Meta Singapore Layoffs: టెక్ దిగ్గజం మెటా ఫేస్‌బుక్ మాతృసంస్థ లో సాగుతున్న భారీ లేఆఫ్స్ ఒక ఇంజనీర్ మనోవేదనను ప్రపంచానికి చాటిచెప్పాయి. దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో, సింగపూర్‌లో పనిచేస్తున్న గ్యారీ టే అనే సీనియర్ ఇంజనీర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న కొత్తగా వచ్చిన ఇంజనీర్‌కు శిక్షణ ఇచ్చాను.. ఈరోజు నా ఉద్యోగం ఊడింది అంటూ ఆయన రాసిన మాటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మానవ శ్రమకు దక్కుతున్న విలువపై చర్చకు దారితీశాయి.
గ్యారీ టే మెటా కంపెనీలో దాదాపు 9 ఏళ్ల 9 నెలల పాటు పనిచేశారు. లండన్‌లో జూనియర్ ఇంజనీర్‌గా చేరి, సింగపూర్‌లో సీనియర్ స్థాయికి ఎదిగిన ఆయన.. మెటాలో పనిచేస్తున్న 99 శాతం మంది ఉద్యోగుల కంటే సీనియర్ కావడం విశేషం. ఇంత సుదీర్ఘ కాలం సంస్థ అభివృద్ధికి తోడ్పడినా, తీరా ఒక ఉదయం 4 గంటలకు వచ్చిన ఈమెయిల్ ద్వారా ఆయనను ఇంటికి పంపడం టెక్ ప్రపంచంలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది.
AI ఇక్కడే ఉంటుంది.. కానీ మనుషులు మాత్రం ఉండలేకపోతున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్య టెక్ వర్కర్లలో నెలకొన్న భయాందోళనలను ప్రతిబింబిస్తోంది. గత ఏడాది కాలంగా తన పనివేగాన్ని AI సాయంతో 200-300 శాతం పెంచుకున్నానని, అయినప్పటికీ మానవ మేధస్సు కంటే ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లకే కంపెనీ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూలైలో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి చేదు వార్త వినాల్సి రావడం తనను కలచివేసిందని గ్యారీ పేర్కొన్నారు. 15 ఏళ్ల పాటు మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం తనకు ఉన్నందున, రాబోయే రోజుల్లో తన కెరీర్ ఆప్షన్లను పునఃసమీక్షించుకుంటానని చెప్పారు. వేల సంఖ్యలో నిరుద్యోగులుగా మారిన మెటా ఉద్యోగులను గౌరవించాలని, వారికి మద్దతుగా నిలవాలని ఆయన నెటిజన్లను కోరారు.
మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ పంపిన అంతర్గత మెమో ప్రకారం.. కంపెనీలో మేనేజర్ల సంఖ్యను తగ్గించి, దాదాపు 7,000 మందిని నేరుగా AI సంబంధిత ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవడానికి, ఆటోమేషన్‌ను పెంచడానికి మెటా చేస్తున్న ఈ ప్రయోగాలు గ్యారీ వంటి నిపుణులను బలితీసుకుంటున్నాయి. సంస్థను నిర్మించడంలో కీలకపాత్ర పోషించిన పాత ఉద్యోగులను కూడా కనికరం లేకుండా తొలగించడంపై టెక్ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
