How To Join ISRO After Graduation: ఇస్రోలో పని చేసి దేశానికి సేవ చేయాలని చాలా మంది యువత కలా ఉంటుంది. ఇస్రోలో పని చేయడం చిన్న విషయం కాదు. అక్కడ చేపట్టే ప్రాజెక్టుల్లో భాగమవ్వడం గర్వించదగ్గ విషయం. ఇక్కడ పని చేస్తే అంతర్జాతీయ ఖ్యాతి కూడా బోనస్‌గా లభిస్తుంది. అయితే ఇంతకీ అక్కడ ఉండే ఉద్యోగాలు ఏంటీ? అవి ఎలా సాధించాలి? అక్కడ పని చేసే వారికి జీతభత్యాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. 

Continues below advertisement

ఇస్రోలో చాలా ఉద్యోగాలు ఉంటాయి. అయితే కీలకమైన ప్రాజెక్టుల్లో పని చేయాలి అంటే మాత్రం మూడు ముఖ్యమైన విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల్లో చేరాలి అంటే నిర్దిష్టమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. అందులో మొదటిది సైంటిస్ట్‌ సెక్టార్. ఇది ఇస్రోలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టు. ఇందులో చేరాలి అంటే అభ్యర్థులు బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీలో ఏదో ఒకటి 65 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్, మెకానికల్, విభాగాలకు చెందిన వారికే ప్రధాన్యత ఉంటుంది. ఈ విభాగంలో పోస్టులు ఖాళీ ఉంటే ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్ ఇస్తుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తుంది. కొన్నిసార్లు గేట్‌లో మంచి మార్కులు సాధించిన వారిని కూడా ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేయవచ్చు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన వారు నేరుగా ఇస్రో సైంటిస్టులుగా చేరిపోవచ్చు. 

రెండో విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌, సైంటిఫిక్ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉంటాయి. దీనికి ఎలక్ట్రానిక్, కంప్యూటర్, మెకానికల్ విభాగంలో ఫస్ట్ క్లాస్‌ ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ చేసిన వారు అర్హులు అవుతారు. నోటిఫికేషన్ వేసిన తర్వాత వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను రాత పరీక్షకు కాల్‌ఫర్ చేస్తారు. అనంతరం స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. మూడో విభాగంలో టెక్నీషియన్ బి ఉద్యోగులు ఉంటాయి. దీనికి పదోతరగతి చేసి సంబధిత ట్రేడ్‌లో ఐటీఐ, ఎన్టీసీ, ఎన్‌ఏసీ చేసిన వాళ్లు అర్హులు అవుతారు. ఈ ఉద్యోగాల ఎంపిక కూడా రెండు దశల్లో ఉంటుంది. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి స్కిల్‌ టెస్టు పెట్టి సెలెక్ట్ చేస్తారు. 

Continues below advertisement

ఇస్రోలో పని చేసే వారికి జీతాలు ఎలా ఉంటాయి?

ఇస్రోలో పని చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వ వేతన సంఘం ఆధారంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ప్రస్తుతానికి ఏడో వేతన సంఘం రూల్స్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.  

పోస్టు పేరు పే లెవల్‌    బేసిక్ పే    గ్రాస్ శాలరీ 
సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ ఎస్సీ లెవల్‌ 10   రూ.56,100    రూ.85000-రూ.95000
టెక్నికల్ అసిస్టెంట్  లెవల్‌ 7  రూ.44,900  రూ.65,000 - రూ.72,000
లైబ్రరీ అసిస్టెంట్  లెవల్7  రూ.44,900  రూ.65,000 - రూ.70,000
టెక్నీషియన్ 'బి' / డ్రాఫ్ట్స్‌మన్ లెవల్‌3 రూ.21,700  రూ.32,000 - రూ.38,000

ఇస్రోలో పని చేసే వారికి షిఫ్టులు ఉంటాయా? 

ఇస్రోలో పని వేళలు అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా ఆఫీస్‌ విధులు నిర్వహించే వారికి, అడ్మిన్ స్టాఫ్‌, సాధారణ సైంటిస్టులకు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల రకు లేదా 5.30 వరకు డ్యూటీ ఉంటుంది. వీళ్లకు వారానికి ఐదురోజులు మాత్రమే పని ఉంటుంది. వారానికి రెండు రోజులు(శని, ఆదివారం) సెలవు. రాకెట్  ప్రోయగాలు జరిగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌, కంట్రోల్‌ రూమ్‌లు వంటి కీలక విభాగాల్లో పని చేసే వారికి 24 గంటలు షిప్టులు ఉంటాయి. ఇంఛార్జ్‌ చెప్పిన టైమింగ్స్‌కు డ్యూటీకి రావాలి. కీలకమైన ప్రయోగాలు ఉన్న రోజుల్లో సమయంతో సంబంధం లేకుండా అవిశ్రాంతంగా పని చేయాల్సి ఉంటుంది. 

ఇస్రోలో రాజీనామా చేయడం సులభమేనా?

ఇస్రో శాస్త్రవేత్తలు భారత ప్రభుత్వ పరిధిలోని డిపార్టమెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ కింద పని చేస్తారు. అందుకే ఇక్కడ రాజీనామా చేయడానికి కేంద్ర ప్రభుత్వ సివిల్‌ సర్వీెస్‌ నిబంధనలు, ఇస్రో రూల్స్ వర్తిస్తాయి. 

నోటీస్‌ పీరియడ్ చేయాల్సిందే?

రాజీనామా చేసిన సిబ్బంది కచ్చితంగా నోటీస్‌ పీరియడ్‌ పని చేయాలి. ఇది ఉద్యోగి కేటగిరిని బట్టి మారుతుంది. ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్న వ్యక్తి రాజీనామా చేయాలనుకుంటే నెల ముందు నోటీసు ఇవ్వాలి. లేకుంటే ఒక నెల జీతాన్ని చెల్లించి వెంటనే విధుల నుంచి తప్పుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగి రాజీనామా చేయాలి అంటే మూడు నెలల ముందస్తు రాతపూర్వక నోటీసు కచ్చితంగా ఇవ్వాలి. 

సర్వీస్ బాండ్‌ రూల్స్ ఇవే!

ఇస్రోలో చేరే ముందు మీతో బాండ్ రాయించుకుంటారు. ఉద్యోగ స్థాయిని బట్టి మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో ఈ బాండ్ ఉంటుంది. ఆ బాండ్ ఒప్పందం పూర్తి కాక ముందే రాజీనామా చేస్తే బాండ్‌లో ఒప్పుకున్న మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

ఇస్రోలో ఉద్యోగం చేస్తూ సంస్థ ఖర్చులతో పీహెచ్‌డీ చేసినా, ఉన్నత చదువులు, కోర్సులు చేసినా, విదేశాల్లో ప్రత్యేక టెక్నికల్ ట్రైనింగ్ తీసుకున్న వారు మరో బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. వారు బాండ్‌లో చెప్పిన గడువు ముందే రాజీనామా చేస్తే చదువు, శిక్షణ కోసం ప్రభుత్వం పెట్టిన ప్రతి పైసా వడ్డీతోపాటు వసూలు చేస్తుంది.  

మీరు ఇస్రో కంటే మెరుగైన లేదా సమానమైన ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆ ఉద్యోగంలో చేరేందుకు అనుమతి ఉంటుంది. దీంతోపాటు లీవ్స్‌ ఇతర బెనిఫిట్స్ బదిలీ అవుతాయి. 

రాజీనామా కచ్చితంగా ఆమోదించాల్సిందేనా?

ఉద్యోగి రాజీనామా చేసిన వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తిరస్కరించవచ్చు. ఏమైనా క్రమశిక్షణ చర్యలు, విచారణ పెండింగ్‌లో ఉన్నా, విజిలెన్స్ విచారణ లేదా కోర్టు కేసులు ఉన్నా, కీలకమైన ప్రాజెక్టుల్లోని కీలక బాధ్యతల్లో ఉన్నప్పుడు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు రిలీవ్‌ చేయకపోవచ్చు. 

120 మంది వరకు సైంటిస్టులు ఇస్రోకు రాజీనామా 

ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో 100 నుంచి 120 మంది శాస్త్రవేత్తలు ఇస్రోకు రాజీనామా చేస్తున్నారు. గగన్‌యాన్, చంద్రయాన్-3 లాంటి కీలకమైన మిషన్లలో పనిచేస్తున్న వారిలో చాలామంది రాజీనామా బాట పడుతున్నారు. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాజీనామాల ఆమోదంపై కఠిన నిబంధనలు అమలు చేసింది. రాజీనామాలు, వీఆర్‌ఎస్‌పై తామే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. దీంతో రాజీనామాల పర్వానికి తెరపడుతుందని కేంద్రం భావిస్తుంది. 

ప్రస్తుతం ఇస్రో ఇచ్చిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఏది?

ప్రస్తుతం ఇస్రోలోని వివిధ కేంద్రాల్లో నియామక ప్రక్రియ వేగంగా సాగుతోంది. ISTRAC బెంగళూరు కేంద్రం జూన్ 2026లో టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్‌మన్‌ బి, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి ఆన్‌లైన‌లో దరఖాస్తు ఇప్పటికే ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో దరఖాస్తు స్వీకరణ విండో క్లోజ్ కానుంది.