Supreme Court on Govt jobs: రాష్ట్ర ప్ర‌భుత్వ(State govt) ఉద్యోగాల‌(Jobs)కు సంబంధించి దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. జ‌నాభా నియంత్ర‌ణ‌, కుటుంబాల ఆర్థిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌స్థాన్(Rajastan) ప్ర‌భుత్వం(Govt) తీసుకున్న నిర్ణ‌యాన్ని, అమ‌లు చేస్తున్న చ‌ట్టాల‌ను కూడా సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. ఈ క్ర‌మంలో ఒక కుటుంబంలో ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే.. అలాంటి కుటుంబంలోని వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోవ‌డం స‌రైందేన‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగానికి వ్య‌తిరేకం కాబోద‌ని.. రాష్ట్ర విస్తృత ప్ర‌యోజ‌నం, ప్ర‌జ‌ల అభ్యున్న‌తి, వ‌న‌రులు, మౌలిక స‌దుపాయాల‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణ‌యంగా సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. అంతేకాదు.. దీనిని త‌ప్పుబ‌డితే.. జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఉద్దేశించిన ల‌క్ష్యానికి తాము విఘాతం క‌లిగించిన‌ట్టు అవుతుంద‌ని పేర్కొంది. రాజ్యాంగం.. చ‌ట్ట నిబంధ‌న‌ల‌కు లోబ‌డే రాజ‌స్థాన్  ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. ``ఇది మంచి నిర్ణ‌యం. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన విధానంలోనే తీసుకున్నారు. దీనిని దేశ‌వ్యాప్తంగా కూడా ప‌రిశీలిస్తే మంచిదే`` అని న్యాయ‌మూర్తి ఒక‌రు వ్యాఖ్యానించారు. 


విష‌యం ఏంటి? 


ఎడారి రాష్ట్రం రాజ‌స్థాన్‌(Rajastan)లో 2001-02 మ‌ధ్య ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌నాభా నియంత్ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్ర‌మంలో విస్తృత ప్ర‌చారం కూడా క‌ల్పించింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌నాభా పెరుగుద‌ల నియంత్ర‌ణ కాలేదు. ఈ నేప‌థ్యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ పిల్ల‌ల‌ను క‌నే కుటుంబాల్లోని వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదని పేర్కొంటూ చ‌ట్టం తీసుకువ‌చ్చింది. ఈ మేర‌కు  రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌(Service rules)  చట్టానికి 2001లో సవరణలు చేసింది. దీని ప్ర‌కారం.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. రాజస్థాన్‌ పోలీస్‌(Police) సబ్‌ఆర్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌, 1989 ప్రకారం.. జూన్‌ 1, 2002 తర్వాత ఇద్దరు క‌న్నా ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థులు నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ నిబంధ‌న‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు.  


ఇదీ కేసు.. 


రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్(Ramji lal Jhat)(జాట్ సామాజిక వ‌ర్గం) అనే వ్య‌క్తి ఆర్మీలో పనిచేశారు. ఈయ‌న‌ 2017లో రిటైర్ అయ్యారు. అనంత‌రం అదే ఏడాది రాజ‌స్థాన్ హోం శాఖ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఆయ‌న  ఉద్యోగానికి ఎంపిక‌య్యాడు. అయితే.. కుటుంబ స‌ర్వేలో ఆయ‌న‌కు ఏకంగా ఐదుగురు పిల్లులు ఉన్నార‌ని తెలియ‌డంతో అధికారులు ఆయ‌న‌కు చివ‌రి నిమిషంలో ఉద్యోగాన్ని నిరాక‌రించారు.  దీంతో రామ్‌జీ న్యాయ‌పోరాటానికి దిగారు. తొలుత హైకోర్టు ను ఆశ్ర‌యించారు. అయితే.. ఇక్క‌డ కూడా  రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న చ‌ట్టం ప్ర‌కారం ఈ నిర్ణ‌యం స‌రైందేన‌ని కోర్టు పేర్కొంటూ.. పిటిష‌న్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థించింది. అంతేకాదు.. ఈ చ‌ట్టంలో వివక్ష లేదని, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింద‌ని తెలిపింది. దీనిని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసినా మంచిదేన‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 


దేశ‌వ్యాప్త అమ‌లు సాధ్య‌మేనా? 


దేశ‌వ్యాప్తంగా ఇద్ద‌రు పిల్ల‌ల నినాదం 1980-2000 మ‌ధ్య తీవ్రంగావినిపించింది. ఇద్ద‌రు ముద్దు-ముగ్గురు వ‌ద్దు అంటూ.. పెద్ద ఉద్య‌మ‌మే సాగింది. త‌ర్వాత‌.. ఒక్క‌రు ముద్దు-ఇద్ద‌రు హ‌ద్దు అంటూ క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌ల‌లోనూ వినిపించింది. అయితే.. త‌ర్వాత కాలంలో మైనారిటీ వ‌ర్గాల నుంచి వెల్లువెత్తిన నిర‌స‌న‌లు, రాజ‌కీయ ప్రాధాన్యాల నేప‌థ్యంలో జ‌నాభా నియంత్ర‌ణ కేవ‌లం .. కాయితాల‌కే ప‌రిమితం అయింది. కొన్నాళ్లు కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేయించుకున్న వారికి ప్రోత్సాహ‌కాలు కూడా ఇచ్చారు. అయితే.. ఇది కూడా సాధ్యం కాలేదు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల విష‌యంలో ఇలాంటి ప‌థ‌కాల‌ను తీసుకురాలేమ‌ని.. రెండేళ్ల కింద‌ట కేంద్ర ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. అయితే.. కుటుంబ నియంత్ర‌ణ‌ను మాత్రం అన్ని రూపాల్లోనూ ప్రోత్స‌హిస్తామ‌ని పేర్కొంది. దీనిని రాష్ట్రాల‌కే వ‌దిలి వేసింది.