AP Highcourt: ఏపీలో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించడంపై అద్దంకి వాసి బొల్లా సురేష్‌, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఫిబ్రవరి 20న విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించటం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీఎడ్‌ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు. ఎన్‌సీఈటీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగానే బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని కోర్టుకు విన్నవించారు. అర్హత సాధించిన బీఎడ్‌ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్స్‌ చేసిన తర్వాతే.. బోధనకు అనుమతిస్తామన్నారు. 


సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్.. 
ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు? బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముందని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. తక్షణమే నోటిఫికేషన్‌ నిలుపుదల చేస్తామంటూ ఉత్తర్వులిచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. దీంతో ప్రభుత్వ వివరణ తీసుకొనేందుకు ఒక్కరోజు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించారు. ఫిబ్రవరి 23 నుంచి హాల్‌టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో హాల్‌టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అడ్వకేట్ జనరల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.


ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ డిగ్రీ అర్హత ఉన్నవారికి ప్రభుత్వం అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఫిబ్రవరి 15న హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్‌జీటీ, బీఈడీ అభ్యర్థులకు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనను రద్దు చేయాలని కోరుతూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.


ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి.  వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలల్లో 4566 ఖాళీలు ఉన్నాయి. ఇక ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో 1534 ఖాళీలు ఉన్నాయి.


ఎస్జీటీ పోస్టులకు అర్హతలు ఇలా..


➥ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు రెండేళ్ల డీఎడ్/ డీఎల్‌ఈడీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ అర్హత ఉండాలి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.