Telangana DSC 2024 Results: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు (DSC Results) సోమవారం (సెప్టెంబరు 30) వెలువడనున్నాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదుల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. అయితే డీఎస్సీ పరీక్షలకు సంబంధించి తుది ఆన్సర్ కీ పై అభ్యర్థుల అభ్యంతరాలను పట్టించుకోకుండానే ఫలితాలను విడుదల చేస్తుండటంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.


తుది కీపైనా అభ్యంతరాలు.. 
డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 13న విడుదల చేసింది. సెప్టెంబరు 6న డీఎస్సీ తుది ‘కీ’ని విడుదల చేసింది. ప్రాథమిక ఆన్సర్‌ కీపై ఏకంగా 28 వేల వరకు అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని తుది ఆన్సర్ కీ విడుదల చేయగా.. అందులోనూ 210కిపైగా అభ్యంతరాలొచ్చాయి. దీంతో అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు. వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ (NCERT) పరిశీలనకు పంపించారు. దీంతో కథ మొదటికొచ్చినట్లయింది. డీఎస్సీ మార్కులకు టెట్‌ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే టెట్‌ మార్కుల అప్‌లోడింగ్‌, సవరణకు విద్యాశాఖ అవకాశమివ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగుచూశాయి. టెక్నికల్ సమస్యలతో కొందరు అభ్యర్థులకు కొత్త మార్కులు అప్‌లోడ్‌ చేసినా.. పాత మార్కులే ప్రత్యక్ష్యమయ్యాయి. ఒక సబ్జెక్టుకు పరీక్షరాస్తే మరో సబ్జెక్టు వెబ్‌సైట్‌లో చూపించింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించి విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలిసింది. దీంతోనే ఫలితాల విడుదలపై ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది.


తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తులు అందగా... మొత్తం 2,45,263 మంది (87.61 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. డీఎస్సీ పరీక్షలకు 34,694 మంది అభ్యర్థులు గైర్హజరయ్యారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం హాజరయ్యారు.  ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 13న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఆగస్టు 20న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా ఫైనల్ ఆన్సర్ కీని విద్యాశాఖ విడుదల చేసింది. 


తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు,  లాంగ్వేజ్ పండిట్-727, పీఈటీలు-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనపర్తి (152) ఉన్నాయి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..