ఏపీలో వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్‌-1 సర్వీసు(నోటిఫికేషన్ నెం. 28/2022) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఖరారుచేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్‌ 3 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు మే 19న ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని పాతజిల్లాల ప్రధాన కేంద్రాల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు మే 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.


* మెయిన్ పరీక్ష విధానం:


మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. 


* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు


* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు


* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు 


* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు


* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు 


* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే    



ఏపీలో ఖాళీగా ఉన్న 111 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అత్యధికంగా విశాఖపట్నంలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా చిత్తూరులో 4 పరీక్ష కేంద్రాలను మాత్రమే ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. గ్రూప్-1కు మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,06,473 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా.. ఇందులో 87,718 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 85.89 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 73.99 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.


ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ జనవరి 27న విడుదల చేసింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.  ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపికచేశారు. వాస్తవానికి గ్రూప్-1 కింద అన్ని రకాలు భర్తీ చేయాల్సిన పోస్టులు 111 ఉన్నాయి. దీని ప్రకారం 5,550 మందిని ప్రధాన పరీక్షలకు ఎంపిక చేయాలి. కానీ... ఒకరి కంటే ఎక్కువ మందికి ఒకే మార్కులు రావడం, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలోనూ సంఖ్య పెరిగింది.


గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.. 


'గ్రూప్-1' ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్, పోస్టుల సంఖ్య పెరిగిందోచ్! ఎన్ని పోస్టులంటే!


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...