ఏపీలోని ఉద్యోగార్థులు ఒకవైపు 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 8న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. మూడు వారాల్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని కలిసే అవకాశముందని చెప్పారు. 

10 రోజుల్లో గ్రూప్-2 నోటిఫికేషన్?
అన్ని అనుకున్నట్లు జరిగితే పది రోజుల్లోనే 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే సిలబస్‌ను మాత్రం అలాగే కొనసాగించాలన్న నిర్ణయానికి ఏపీపీఎస్సీ వచ్చినట్లు సమాచారం. కానీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ విధానంలో మాత్రం మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీపీఎస్సీ పంపించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. సర్కార్ నుంచి ఆమోదం లభించిన వెంటనే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఏపీపీఎస్సీ పూర్తి చేసినట్లు సమాచారం.

182 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్?
ఏపీలో త్వరలో విడుదలకానున్న గ్రూప్-2 నోటిఫికేషన్‌లో 182 పోస్టులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం 182 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్-1 పోస్టుల విషయంలో 110 పోస్టులు అని మొదట చెప్పగా.. 92 పోస్టులకే నోటిఫికేషన్ వెల్లడించారు. అయితే తాజాగా గ్రూప్-1లో మరిన్ని పోస్టులు కలుస్తాయని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 లోనూ పోస్టుల సంఖ్య పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంది.


'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి, 18 జిల్లాల్లో 297 కేంద్రాల ఏర్పాటు!
ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న నిర్వహించనున్న ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్షకు  పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఆయన వెల్లడించాారు. గ్రూప్-1 పరీక్షకు 1,26,499 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను మూడు వారాల్లోనే వెల్లడించనున్నట్లు సవాంగ్ తెలిపారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని కలిసే అవకాశముందని చెప్పారు.


'గ్రూప్-1' ప్రిలిమినరీ ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలలు పడుతుందని, తర్వాత నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆగస్టు నాటికి నియామకాలు పూర్తిచేస్తామని సవాంగ్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్ జారీచేస్తామని సవాంగ్ వెల్లడించారు.  


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...