AP TET 2022 : ఏపీ టెట్ కు అప్లై చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్ డేట్ వచ్చింది. ఏపీ టెట్ కు 5.50 లక్షల దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ సైట్ లో అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాల ఆప్షన్ లింక్ ను ఏపీ టెట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అయితే అందులో పరీక్ష కేంద్రం ఎంపిక ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 


పక్క రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు 


గత ఏడాది కంటే ఈసారి దరఖాస్తులు భారీగా రావడం వల్ల పక్క రాష్ట్రంలో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆప్షన్స్ ఇచ్చిన వారికి సొంత జిల్లాలో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా ఇచ్చిన వారికి వేరే జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉంటుంది. ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిషాలోనూ పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అందుకే చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా పరీక్ష కేంద్రాల ఆప్షన్స్ ముందుగా ఇచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 


25న హాల్ టికెట్లు


ఈ నెల 25వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) హాల్ టికెట్లు విడుదల అవుతున్నాయి. అభ్యర్థులు https://cse.ap.gov.in/ లేదా https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జులై 26 నుంచి మాక్‌ టెస్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆసక్తి ఉన్న మాక్ టెస్ట్ రాయొచ్చని సూచించింది. ఏపీ టెట్ పేపర్‌-2A అర్హతలో కొన్ని మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు వచ్చిన వారు పేపర్‌-2Aకి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈసారికి మాత్రమే సడలింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.


ఆగస్టు 6 నుంచి పరీక్షలు 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల చేసింది. దరఖాస్తు దారులు జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించింది. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్‌ కీ విడుదల చేసి, సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించే APTET-August, 2022 పరీక్షను అన్ని జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. TET లక్ష్యం జాతీయ ప్రమాణాలు పాటించడం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌కు (National Council for Teacher Education - NCTE) అనుగుణంగా నియామక ప్రక్రియలో ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.