AP Police Constable Recruitment 2025 | అమరావతి: పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం వదిలేసిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీని తాము విజయవంతంగా పూర్తి చేశామని కూటమి నేతలు చెబుతున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ రాగా, అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. తరువాత 5,757 మంది ట్రైనింగ్ కు ఎంపిక కాగా.. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికయ్యారు. సివిల్ విభాగంలో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
ఎంపికైన వారితో నేడు సీఎం చంద్రబాబు సమావేశం..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పోలీసు శాఖలోకొత్తగా జాయిన్ అవుతున్న వారితో మంగళవారం (డిసెంబర్ 16న) సమావేశం కానున్నారు. మంగళగిరి ఎపిఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను పూర్తి చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టి ప్రక్రియను పూర్తి చేసింది.
మొన్న మెగా డీఎస్సీ, నేడు కానిస్టేబుల్ పోస్టులు
కొన్ని నెలల నెలల కిందట ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా 6,104 పోస్టులతో పోలీసు శాఖలో కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసింది. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతను మభ్య పెట్టడానికి మొక్కుబడిగా నోటిఫికేషన్ ఇచ్చిందని కూటమి నేతలు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమని ప్రభుత్వం రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది.
డిసెంబర్ 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం
పోలీస్ రిక్రూట్మెంట్ పై దాఖలైన 31 రిట్ పిటిషన్లు కోర్టుల్లో చట్టబద్ధంగా సమాధానం చెప్పి సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరించింది. నియామక పరీక్షలు కూడా రికార్డ్ టైమ్‌లో పారదర్శకంగా నిర్వహించారు. కేవలం 60 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులు ఆయా జిల్లాల్లో నియామక పత్రాలు అందుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారితోసీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.
కొత్తగా ఎంపికైన ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. పోలీసు శాఖలోకి కొత్తగా వస్తున్న వారికి స్వాగతం పలికేందుకు, వారికి మార్గనిర్దేశం నింపడానికి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. డిసెంబర్ 22 నుంచి పోలీస్ కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది.