AP Govt Jobs Notification September: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం సంచలన తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్-2026పై మంత్రుల బృందంతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వర్చువల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఈ 10,060 పోస్టుల భర్తీని నాలుగు విడివిడి దశల్లో చేపట్టనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మొదటి ఫేజ్ కింద వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఇక రెండవ విడత కింద 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సమీక్షలో నిర్ణయించారు. సాంకేతిక కారణాలు , రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో మార్పుల వల్లే ఆగస్టులో రావాల్సిన రెండో దశ ప్రక్రియ సెప్టెంబర్‌కు వాయిదా పడిందని లోకేశ్ తెలిపారు.
మూడో దశ, నాలుగో దశలకు సంబంధించిన భర్తీ ప్రక్రియను కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకే విడతలో ముగించేలా చర్యలు చేపట్టారు. మూడో విడతలోని 2,388 పోస్టులు , నాలుగో విడతలోని 2,981 పోస్టులు.. మొత్తంగా 5,369 ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రకటనలు వరుసగా రానుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.
ముఖ్యంగా ఈ నియామకాల్లో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న హోంశాఖ విభాగ పోస్టులకు సింహభాగం ప్రాధాన్యత లభించింది. మొత్తం ఖాళీలలో మూడో దశ కింద భర్తీ చేసే పోస్టుల నుంచే ఏకంగా 2,225 ఉద్యోగాలు హోంశాఖకు సంబంధించిన పోలీస్, కానిస్టేబుల్, ఎస్సై తదితర వర్గాలుగా ప్రభుత్వం వర్గీకరించింది. అభ్యర్థులకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, ఎంపిక విధానం అత్యంత పారదర్శకంగా ఉండేలా పక్కాగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేశారు.
అన్ని శాఖలకు చెందిన పోస్టుల సమగ్ర విభజన, ఖాళీల జాబితా, రోస్టర్ పాయింట్ల తుది వివరాలను ఆగస్టు 6న జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముందుకు తీసుకెళ్లి ఆమోదం తీసుకోనున్నారు. అంతేకాకుండా, గతంలో నిర్దేశించిన గ్రూప్-1 పోస్టుల సంఖ్యను మరింత పెంచాలని, అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా ఖాళీల గణన పునఃసమీక్షించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ నిర్ణయంతో ఏపీలోని నిరుద్యోగుల కల సాకారమయ్యే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
