APPSC Group2 Answer Key: ఏపీలో 'గ్రూప్ -2' పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ఆన్సర్ 'కీ'ని ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రశ్నపత్రంతోపాటు ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు తెలియజేయవచ్చు. ఆన్‌లైన్‌లో మాత్రమే అభ్యంతరాలు సమర్పించాలని ఏపీపీఎస్సీ సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్‌ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
ప్రిలిమ్స్ పరీక్షకు 87.17 శాతం అభ్యర్థలు హాజరు..
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో నకిలీ అడ్మిట్‌కార్డుతో ఒకరు పరీక్ష రాసేందుకు రాగా సిబ్బంది పట్టుకున్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను అయిదు నుంచి ఎనిమిది వారాల్లోగా వెల్లడిస్తామని, జూన్ లేదా జులైలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని గౌతం సవాంగ్ సూత్రప్రాయంగా వెల్లడించారు. వీలైతే మే నెలలోనే నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు గౌతం సవాంగ్ ఫిబ్రవరి 25న విజయవాడలో విలేకర్లతో మాట్లాడారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించారు. పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశారు.
కటాఫ్ ఎంత ఉండొచ్చు..?
పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరి కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రూప్-2 ప్రశ్నల తీరు ఇలా..
➥ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో పరీక్ష సమయం(2.30 గంటలు)కు తగినట్టుగా ప్రశ్నలు లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉండటంతో సమయం సరిపోక హైరానా పడ్డారు. ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఇచ్చారు.
➥ ఇండియన్ సొసైటీ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబుల గుర్తింపునకు మరింత సమయం పట్టింది. ఈ పరిణామాలు గ్రామీణ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాయి. బ్లూప్రింట్, వెయిటేజ్‌కు తగ్గట్లు ప్రశ్నపత్రం లేదని, పోటీ స్ఫూర్తి అందులో కనిపించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు.
➥ వర్తమాన వ్యవహారాల్లో ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డులు, విశాఖపట్నంలో జరిగిన మిలాన్-2024 గురించి ప్రశ్నలొచ్చాయి. మెంటల్ ఎబిలిటీలో విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, ఆడుదాం ఆంధ్రాలను ఉదహరిస్తూ ప్రశ్నలు అడిగారు. జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న జీవన క్రాంతి పథకం, వైఎస్‌ఆర్ నవోదయ పథకాలు, విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చిన అవార్డు గురించి ప్రశ్నలు ఇచ్చారు.