AP DSC 2025: లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజున డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని తొలి సంతకం చంద్రబాబు చేశారు. అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ప్రక్రియ ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ 20 తేదీ అంటే ఆదివారం విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. చంద్రబాబు పుట్టిన రోజుకు డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబందం లేదు. అయినా సరే డీఎస్సీ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అందుకే ఆయన పుట్టిన రోజున నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. 

ఒక వేళ ఏదైనా కారణంతో 20న నోటిఫికేషన్ రాకపోతే 23 నోటిఫికేషన్ రానుంది. ఆ రోజు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నారు. అందుకే అదే రోజు ఈ డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. ఈ డీఎస్సీ ద్వారా 16 వందలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఇప్పటికే ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వం చెప్పింది. గరిష్ట వయో పరిమితి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచారు. జులై 1 2024ను కటాఫ్ డేట్‌గా తేల్చారు.  నోటిఫికేషన్ ఇప్పుడే ఇస్తున్నప్పటికీ ఈ తేదీని కటాఫ్‌గా తేదీగా ప్రకటిస్తే చాలా మంది అభ్యర్థులు నష్టపోతారని ప్రభుత్వం గతేడాదినే కటాఫ్‌గా తేదీగా పరిగణలోకి తీసుకుంది. 

ఎస్సీ వర్గీకరణను ఈ డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి అమలు చేస్తోంది ప్రభుత్వం. అందుకే 200 రోస్టర్ పాయింట్లతో ఈ రిజర్వేషన్‌ను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఉదాహరణకు వంద పోస్టులకు 15 పోస్టులు ఎస్సీలకు వస్తే.... ఇందులో గ్రూప్ వన్‌ వాళ్లకు ఒక పోస్టు అది కూడా రెండో పోస్టు, ఆరు గ్రూప్ టూ వాళ్లకు మాదిగ, ఉపకులాలకు కేటాయిస్తారు. మిగతా 8 పోస్టులు గ్రూప్‌ 3 వాళ్లకు ఇస్తారు. ఇందులో మాల, దాని ఉపకులాలు వస్తాయి. రెండో వంద రోస్టర్ పాయింట్ల సైకిల్‌లో ఒకటి గ్రూప్‌ వన్‌ కేటగిరి వాళ్లకు, గ్రూప్‌ టూ అండ్‌ త్రీ వాళ్లకు చెరో ఏడు కేటాయిస్తారు.