TS Constable Training: తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెలలోనే శిక్షణ మొదలుకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 కేంద్రాల్లో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
వాస్తవానికి సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్‌ఎస్‌పీ విభాగానికి చెందిన 5,010 మందికి కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి మరో రెండు రోజుల్లో శిక్షణను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా కేంద్రాల ప్రిన్సిపాళ్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
తెలంగాణ పోలీస్ నియామక మండలి(TSLPRB) నిర్వహించిన అర్హత పరీక్షల తుది ఫలితాలు అక్టోబరులోనే వెలువడినా న్యాయపరమైన వ్యాజ్యాల కారణంగా తుది ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14న ఎల్‌బీ స్టేడియంలో కానిస్టేబుళ్లకు ఎంపిక పత్రాలను అందజేసిన నేపథ్యంలో శిక్షణ విభాగం ఇన్‌ఛార్జి ఐజీపీ అభిలాషాబిస్త్ శిక్షణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు.
కేంద్రాల అన్వేషణ..
టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ విభాగంతోపాటు ఏపీ, కర్ణాటక పోలీసుశాఖలకు తెలంగాణ శిక్షణ విభాగం లేఖలు రాసింది. అక్కడి కేంద్రాల్లో అనుమతి లభిస్తే ప్రారంభించాలని యోచిస్తున్నారు. కుదరని పక్షంలో 9 నెలలపాటు జరిగే ఇతర కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందే. పోలీసు అకాడమీలో ఇప్పటికే 500 మందికిపైగా ఎస్సైలు శిక్షణలో ఉండగా.. మరో 653 మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే వరంగల్ పీటీసీలో వెయ్యి మంది సివిల్, మేడ్చల్ పీటీసీలో సుమారు 400 మంది ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో 587 ఎస్ఐ, తత్సమాన ఉద్యోగాలకు, 16,604 కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 587 ఎస్ఐ ఉద్యోగాలకు టీఎస్‌ఎల్‌పీఆర్బీ బోర్డు ప్రిలిమినరీ, ఫిజికల్ ఈవెంట్స్, ఫైనల్ పరీక్షలు నిర్వహించి, గత ఆగస్టులోనే తుది ఫలితాలను వెల్లడించింది. దీంతో ఎస్ఐ ఉద్యోగాలకు ఎంపికైన 587 మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
అభ్యర్థుల నియామక ప్రక్రియ 2022 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. గర్భిణులైన అ భ్యర్థినులతో మొదలైన చిన్న చిన్న వివాదాలు.. తుది పరీక్షలో వచ్చిన అనువాద ప్రశ్నల వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయినా, టీఎస్‌ఎల్‌పీఆర్బీ ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలు పాటిస్తూ.. నియామక ప్రక్రియను కొనసాగించింది. కానిస్టేబుల్ నియామకాల్లో జరిగిన తప్పొప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. నిపుణుల కమిటీ వయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్బీ అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో తుది ఎంపిక ఫలితాలను విడుదల చేయడంతో పోలీసుశాఖలోని పలు విభాగాల్లో 16,604 కానిస్టేబుల్ పోస్టులకుగాను 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.