ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న నిర్వహించనున్న ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్షకు  పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఆయన వెల్లడించాారు. గ్రూప్-1 పరీక్షకు 1,26,499 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను మూడు వారాల్లోనే వెల్లడించనున్నట్లు సవాంగ్ తెలిపారు. నోటిఫికేషన్‌లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని కలిసే అవకాశముందని చెప్పారు.


'గ్రూప్-1' ప్రిలిమినరీ ఫలితాలు వచ్చిన 90 రోజుల్లోగా మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలలు పడుతుందని, తర్వాత నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆగస్టు నాటికి నియామకాలు పూర్తిచేస్తామని సవాంగ్ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్ జారీచేస్తామని సవాంగ్ వెల్లడించారు.  


'గ్రూప్-1' ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి.. 


పరీక్ష కేంద్రాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


రాష్ట్రంలో ఇప్పటికే 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి అక్టోబరు 1న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 13 నుంచి నవంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 8న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.


గ్రూప్-1 నోటిఫికేషన్, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి.. 


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
➥ అభ్యర్థులు తమకు ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే, సూచించిన ప్రకారం అన్ని ప్రశ్నలు ఉన్నాయో లేదో చెక్ చేకోవాలి.   


➥ ప్రశ్నపత్రంలో మొత్తం 4 (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి, పార్ట్-డి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ'లో హిస్టరీ & కల్చర్, 'పార్ట్-బి'లో కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ & ఇంటర్నేషనల్ రిలేషన్స్, 'పార్ట్-సి'లో ఇండియన్ & ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్, 'పార్ట్-డి'లో జాగ్రఫీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి విభాగానికి 30 మార్కుల చొప్పున మొత్తం 120 మార్కులు ఉంటాయి.  


➥ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.


➥ ఓంఎఆర్ షీటులో సమాధానాలను బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నుతో మాత్రమే సమాధానాలు గుర్తించాలి (సర్కిల్ పూరించాలి). అనవసరపు  గుర్తులు పెట్టకూడదు. వైట్నర్ వాడకం నిషేధం.


➥ సమాధాన పత్రం నింపడానికి కూడా బ్లూ/బ్లాక్ పెన్ను మాత్రమే వాడాలి. జెల్ పెన్నులు, ఇంక్ పెన్నులు, పెన్సి్ల్స్ వాడకూడదు.


➥ సమాధాన పత్రం (ఓఎంఆర్ ఆన్సర్ షీటు)లో నిర్దేశించిన ప్రదేశంలో అభ్యర్థి సంతకంతోపాటు, ఇన్విజిలేటర్ సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలి. సంతకాలు లేని సమాధానపత్రాలు పరిగణనలోకి తీసుకోరు. 


➥ ఓఎంఆర్ ఆన్సర్ షీటు మీద ఏదైనా రఫ్ వర్క్ గాని, గీతలు గీయడం గాని, చింపడం, పిన్ చేయడం లాంటివి చేయకూడదు.


➥ ఓఎంఆర్ షీటులో జవాబులు మార్చడానికి వైట్నర్, బ్లేడు, రబ్బరు లేదా ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేసినా సమాధానపత్రాలను పరిశీలించరు.  


➥ ఇచ్చిన ప్రశ్నలకు బుక్‌లెట్‌లో జవాబులు గుర్తించకూడదు. ఓఎంఆర్ షీటులో మాత్రమే సమాధానాలు రాయాలి. దీన్ని తీవ్రంగా పరిగణిస్తారు. 


➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, మ్యాథ్స్/లాగ్ టేబుల్స్, మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఆభరణాలు కూడా వేసుకురాకపోవడం మంచిది.


➥ పరీక్ష సమయం ముగిసిన తర్వాతనే అభ్యర్థులను బయటకు పంపుతారు. పరీక్ష మధ్యాలో ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు అనుమతించరు.


➥ పరీక్షలో కాపీ/చీటింగ్‌కు పాల్పడినట్లయితే పరీక్ష నుంచి బహిష్కరిస్తారు. 


➥ రఫ్ వర్కును ప్రశ్నపత్రం చివరి పేజీలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.


➥ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్న కారణంగా జవాబులు జాగ్రత్తగా గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాకి 0.3 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...