8th pay commission: కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెట్టాక తమ జీతం ఎప్పుడు పెరుగుతుందా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. దేశంలోని సుమారు 1.19 కోట్ల మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి కేంద్ర ఉద్యోగి 8వ వేతన సంఘం నిర్ణయాల అమలుతో తమ జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
చాలా నెలలుగా ఎదురుచూస్తున్నప్పటికీ, 8వ వేతన సంఘంపై 2026లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. గత ట్రెండ్‌ను పరిశీలిస్తే, కమిషన్ ఏర్పాటు తర్వాత కొత్త వేతన సంఘం అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. కొత్త వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది అమలులోకి రావచ్చని అంచనాలు ఉన్నాయి.
కమిషన్ సిఫార్సులు ఎప్పటిలోగా అమలు కావచ్చు?
గత ఏడాది జరిగిన ప్రక్రియను పరిశీలిస్తే, నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనవరి 15, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ప్రక్రియ చాలా కాలం ముందుకు సాగలేదు. సుమారు 10 నెలల తర్వాత అక్టోబర్ 28న అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 8వ వేతన సంఘానికి తన నివేదికను సమర్పించడానికి 18 నెలల గడువు ఇచ్చారు.
అక్టోబర్ 2025 నుండి 18 నెలల సమయాన్ని చూసుకుంటే, నిర్ణీత గడువు జూలై 2027కి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పెరిగిన జీతం ప్రయోజనాలు 2027లో అమలు కావొచ్చు. లేదా కేంద్రం నిర్ణయంలో జాప్యం జరిగితే 2028 ప్రారంభంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ ఆలస్యానికి కారణం ఏమిటి?
8వ వేతన సంఘానికి తన నివేదికను సిద్ధం చేయడానికి 18 నెలల సమయం ఇచ్చారు. మరోవైపు కమిషన్ ఏర్పాటులో జాప్యం సైతం ఓ కారణం. ఆ నివేదిక వచ్చిన తర్వాత సిఫార్సులపై పరిశీలన, కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి దాదాపు 6 నెలల టైం పడుతుంది. ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాలు కావొచ్చు. ఈ కారణంగానే కొత్త జీతం, పింఛన్ ప్రయోజనాలు 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో అమలు కానున్నాయి. గత రెండేళ్లనుంచి దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Also Read: Snow Removal Jobs : మంచు తొలగిస్తే లక్షల్లో జీతం.. ఉద్యోగం, సౌకర్యాల గురించిన పూర్తి వివరాలివే