Constable Training: తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 21న శిక్షణ ప్రారంభమైంది. అయితే శిక్షణకు భారీగా అభ్యర్థులు గైర్హాజరవడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. కానిస్టేబుల్ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 13,953 మంది ఎంపికవగా.. తొలి దశలో 9,333 మందికి శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. వీరికి ఫిబ్రవరి 21న శిక్షణ ప్రారంభించారు. ఈ శిక్షణకు అన్ని కేంద్రాల్లో కలిపి దాదాపు 30 శాతం మంది అభ్యర్థులు హాజరుకాలేదు. దీంతో తొలిరోజే సుమారు 2833 మంది హాజరుకాకపోవడంతో కారణాల అన్వేషణలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్లు, పీటీసీలు, సీటీసీలు..తదితర 28 కేంద్రాల్లో శిక్షణను ప్రారంభించారు. శిక్షణ తొలిరోజు దాదాపు 6,500 మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ శిక్షణ కళాశాల(పీటీసీ)లో 650 మందికిగానూ 482 మంది, మేడ్చల్ పీటీసీలో 509కి 422 మంది, కరీంనగర్ పీటీసీలో 1000కి 675 మంది, వరంగల్ నగర శిక్షణ కేంద్రం(సీటీసీ)లో 250కి 201 మంది హాజరయ్యారు. దాదాపు అన్ని కేంద్రాల్లో ఇదే పరిస్థితి. మొత్తంగా సుమారు 30 శాతం మంది హాజరుకాకపోవడంతో..కారణాలను అన్వేషించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
ఎంపికైన వారిలో పలువురు ఇతర ఉద్యోగాలు సాధించడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయులు, స్టాఫ్‌నర్స్‌ల పోస్టులను దక్కించుకున్నందునే పలువురు శిక్షణకు గైర్హాజరైనట్లు అంచనా వేస్తున్నాం. హాజరుకాని వారిలో మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులే ఎక్కువగా ఉండటం ఆ వాదనకు బలాన్నిస్తోంది. మరోవైపు కేసులు ఉన్న కారణంగా కొందరు శిక్షణకు రాలేదని సమాచారం. దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారని పోలీస్ నియామక మండలి వర్గాల సమాచారం.
భారీగా పెరగనున్న బ్యాక్‌లాగ్ పోస్టులు..
పోలీస్ నియామక మండలి(TSLPRB) 2022లో విడుదల చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకారం.. సివిల్-4,965; ఏఆర్-4,423, ఎస్‌ఏఆర్ సీపీఎల్-100, టీఎస్‌ఎస్‌పీ-5,010, ఐటీ అండ్ కమ్యూనికేషన్-262, పీటీవో-121 ఉండగా.. ఈ లెక్కన అన్ని విభాగాల్లో కలిపి 14,881 మందిని ఎంపిక చేయాలి. అయితే ఎంపిక ప్రక్రియ పూర్తయిన సమయంలో తగినంత మంది అర్హులు లేకపోవడంతో 13,953 మందినే శిక్షణకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో శిక్షణ ప్రారంభానికి ముందే 928 పోస్టులు బ్యాక్‌లాగ్ కింద మిగిలిపోయాయి. ఇప్పుడు శిక్షణకూ భారీ సంఖ్యలో గైర్హాజరవడంతో బ్యాక్‌లాగ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిక్షణలో చేరేందుకు అభ్యర్థులకు ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని శిక్షణ విభాగం నిర్ణయించింది. ఆ లోపు ఎంతమంది శిక్షణకు హాజరవుతారనేది తేలితేనే బ్యాక్‌లాగ్‌లపై స్పష్టత రానుంది.
28 కేంద్రాల్లో ఏర్పాట్లు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 కేంద్రాల్లో ఫిబ్రవరి 21 నుంచి శిక్షణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వాస్తవానికి సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్‌ఎస్‌పీ విభాగానికి చెందిన 4,725 మందికి కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి శిక్షణ ప్రారంభించారు.