కరోనా టీకాలు బహిరంగమార్కెట్లో ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తోంది. ఇటీవల ప్రికాషన్ డోస్.. అలాగే పిల్లలకు కూడా టీకాల పంపిణీ ప్రారంభించింది. అన్నీ ప్రజలకు ఉచితంగానే అందిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకునేవారి కోసం గతంలో ధర నిర్ణయించింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు టీకా సంస్థలకు త్వరలో డీసీజీఐ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కో టీకాను రూ. 275 కన్నా ఎక్కువ అమ్మకూడదని నిబంధన పెట్టే అవకాశం ఉంది. సర్వీస్ చార్జి కింద మరో రూ. 150 తీసుకునే వెసుబుబాటు కల్పించనున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం దేశీయంగా రెండు టీకాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒకటి భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కాగా.. మరొకటి సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్. ఈ రెండు వ్యాక్సిన్లకూ ఒకే ధరను డీసీజీఐ ఖరారు చేసే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే తక్కువ ధరను నిర్ణయించడం ప్రజలకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం కొత్త టీకా విధానం ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారు సొంతఖర్చుతో టీకా వేసుకోవాలని ప్రకటించింది. అప్పుడు టీకా ధరలను ప్రకటించారు. రెండు డోసులు కలిసి.. రూ. పన్నెండు వందల నుంచి రెండు వేల వరకూ ధరను నిర్ణయించారు.
ప్రభుత్వాలకు మాత్రం తక్కువేక ఇస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ కోవిషీల్డ్‌ను మొదట రూ. ఆరు వందలకు ఇస్తామని చెప్పిన సీరమ్.. విమర్శుల రావడంతో రూ.400 కు తగ్గించింది. కోవాగ్జిన్ కూడా తర్వాత తగ్గింపు ధరలు ప్రకటించింది. ఆ తర్వాత విమర్శలు రావడంతో కేంద్రం ఆ విధానాన్ని రద్దు చేసి అందిరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికీ ఆ విధానం కొనసాగుతోంది. కొనుక్కోవాలనుకున్న వాళ్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో కొనుక్కుని టీకా వేయించుకోవచ్చు.
అయితే ఇప్పుడు రెగ్యులర్‌గా టీకాను ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోవిషీల్డ్, కోవాగ్జిన్ తయారీ కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు డీసీజీఐ వద్ద అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రేపోమాపో అనుమతి రానుంది. అయితే ధర విషయం మాత్రం గతంలోలా అత్యధిక రేటు నిర్ణయించే అవకాశం ఇవ్వడం లేదు. అత్యధికం రూ. 275 ఉండాలని నిర్ణయిస్తోంది. ఈ కారణంతో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. డాక్టర్ల సలహా మేరకు బూస్టర్ డోసులు ప్రజలు సొంత ఖర్చుతో వేసుకునే అవకాశం ఉంది.