కాలేజీలో పిల్లలకు ఆకస్మికంగా స్వేచ్ఛ దొరకడం, కొత్త స్నేహితులు, సామాజిక మాధ్యమాలు వంటివి వారికి భావోద్వేగ షాక్ కలిగిస్తాయి. వారి వయసుకు తగినంత పరిణతి లేకపోవడం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టమవుతుంది.
Valentine Day 2026: మీ పిల్లలు ప్రేమలో పడ్డారా? లేక డిప్రెషన్‌లో ఉన్నారా? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అసలు విషయాలు ఇవే!
Love vs Depression: కాలేజీకి వెళ్లిన తర్వాత పిల్లల్లో చాలా మార్పులు వస్తుంటాయి. దీని కారణంగానే కొందరు డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. కానీ తల్లిదండ్రులు తప్పుగా భావించి ప్రేమ అని భ్రమ పడుతుంటారు.

Love vs Depression:ప్రతి ఇంట్లోనూ ఒకప్పుడు సందడిగా ఉండే పిల్లలు, కాలేజీలో అడుగుపెట్టిన కొన్ని నెలలకే అపరిచితుల్లా మారిపోవడం ఈ రోజుల్లో ఒక పెద్ద ఆందోళనగా మారింది. నిన్నటి వరకు వారు బయట చూసిన చేసిన ప్రతి విషయాన్ని పూస గుచ్చినట్టు చెప్పే అమ్మాయి అబ్బాయి ఇప్పుడు రూమ్ తలుపులు వేసుకొని మొబైల్‌తోనే గడుపుతున్నారా.. తిండి కూడా సరిగా తినకుండా అడిగితే విసుక్కుంటున్నారా వెంటనే మనందరికీ వచ్చే మొదటి ఆలోచన... ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో అని అనుకుంటారు. కానీ సైకాలజిస్టులు చెబుతున్న మాట మరొకటి ఉంది. ఈ మార్పుల వెనుక కేవలం ప్రేమే కాదు, అంతకంటే లోతైనా మానసిక సంఘర్షణ ఉండవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
స్నేహ కథ ప్రతి ఇంట్లో కనిపించే దృశ్యం
స్నేహ చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేది. స్కూల్ నుంచి రాగానే ఆ రోజు ఏం చేసిందో, స్కూల్‌లో టీచర్స్ ఏం చెప్పారు, ఫ్రెండ్స్ తినడానికి ఏం తీసుకొచ్చారు, స్కూల్‌లో టీచర్స్ ఎలాంటి శారీలు కట్టుకున్నారు, ఇలా ప్రతి విషయాన్ని చెప్పే వరకు ఆమెకు నిద్రపట్టేది కాదు. కానీ కాలేజీలో చేరిన రెండు నెలలకే సీన్ మారిపోయింది. సాయంత్రం ఇంటికి రాగానే డల్‌గా ఉంటోంది. కాలేజీ ఎలా ఉందని అడిగితే ఫైన్ అని ఒక్క మాటతో సరిపెట్టడం, ఎక్కువగా మొబైల్‌లోనే గడపడం వంటివి మొదలయ్యాయి. ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులు తల్లిదండ్రుల్లో టెన్షన్ పెంచాయి. ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో దాదాపు 70 శాతం మంది కాలేజీ విద్యార్థుల్లో కనిపిస్తోందని అమెరికన్ సైకాలజీ అసోసియేషన్ గణాంకాలు చెబుతున్నాయి. అంటే స్నేహ లాంటి పరిస్థితి చాలా మంది ఫేస్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈలాంటి పరిస్థితిలో ఏం చేయాలో చూద్దాం.
స్వేచ్ఛ కూడా సమస్యే
స్కూల్ వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉంటుంది. కానీ కాలేజీకి వెళ్లగానే ఒక్కసారిగా స్వేచ్ఛ దొరుకుతుంది. కొత్త స్నేహితులు, సీనియర్లు, పార్టీలు, సోషల్ మీడియా ప్రపంచం ఇవన్నీ విద్యార్థులకు ఒక రకమైన ఎమోషనల్ షాక్ ఇస్తాయి. అప్పటి వరకు మెదు పూర్తిగా మెచ్యూరిటీ చెందదు. కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకోవడం వారికి కష్టమవుతుంది. దీనినే ఐడెంటిటీ ఫార్మేషన్ స్టేజ్ అంటారు.
ఇది ప్రేమేనా? ఎలా గుర్తించాలి?
తల్లిదండ్రులకు ఉండే పెద్ద అనుమానం ప్రేమ. ప్రేమలో పడినప్పుడు కొన్ని మార్పులు రావడం సహజం. నిత్యం ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంచడం, లాక్ స్క్రీన్ మార్చడం, అర్థరాత్రి వరకు మెసేజ్‌లు చూడటం. ఫోన్ కాల్ వచ్చినప్పుడు బయటకు వెళ్లి మాట్లాడటం లేదా కుటుంబం నుంచి దూరంగా ఉంటారు. అకస్మాత్తుగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం, అందంపై ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. కొన్నిసార్లు విపరీతమైన ఆనందంగా, మరికొన్ని సార్లు చిరాగ్గా కనిపిస్తారు.
డిప్రెషన్ లక్షణాలు కావచ్చు!
చాలా సార్లు మనం ప్రేమ అని అనుకునే లక్షణాలు నిజానికి డిప్రెషన్ వల్ల కూడా రావచ్చు. బోస్టన్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం 2013-201 మధ్య కాలేజీ విద్యార్థుల్లో డిప్రెషన్ 135 పెరిగింది. ఇలాంటి డిప్రెషన్‌లో ఉన్న వాళ్లు గతంలో ఇష్టంగా చేసిన పనులపై ఆసక్తి కోల్పోతారు. కొందరిలో ఆకలి తగ్గుతుంది. లేదా మరికొందరితో ఆకలి పెరుగుతుంది. కొందరికి నిద్ర పట్టదు. మరికొందరు నిత్యం పడుకునే ఉంటారు. చదువుపై ఏకాగ్రత పూర్తిగా తగ్గుతుంది. దేనికీ పనికి రామేమో అనే నిరాశాజనకమైన మాటలు మాట్లాడటం. ప్రేమలో ఉన్నప్పుడు లాంటి నెగెటివ్ ఎనర్జీ కనిపించదు.
చదువు ఒత్తిడి
కాలేజీలో సిలబస్ కఠినంగా ఉండటం, పోటీ పెరగడం, పరిస్థితులకు అడ్జెస్ట్ కాకపోవడం వల్ల కూడా పిల్లలు డల్‌గా మారిపోతారు. దీనిని బర్న్ అవుట్ అంటారు. అంటే పని ఒత్తిడి వల్ల మానసికంగా, శారీరకంగా అసిపోవడం ఇలాంటప్పుడు వారు మొబల్‌ను ఒక ఎస్కేప్‌లా వాడుకుంటారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నట్టు కనిపిస్తే మీరు వెంటనే అరిచి గీ పెట్టడం, లేదా ఫోన్ లాక్కుంటే సమస్య మరింత తీవ్రం అవుతుంది. సైకాలజిస్టులు ఒక 3 వారాల ప్లాన్ సూచిస్తున్నారు.
మొదటి వారం ఏం చేయాలి
పిల్లలకు ఇష్టమైన ఫుడ్ వండి పెట్టి వారితో కలిసి కూర్చొని తినండి. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, అండగా ఉంటామని భరోసా ఇవ్వండి. మొబైల్ గురించి గొడవ పడొద్దు.
మీ పిల్లలు చెప్పేది పూర్తిగా వినండి, వెంటనే సలహాలు ఇవ్వకండి. సమస్య ఏదైనా, పేరెంట్స్ నా పక్షాన ఉన్నారనే ధైర్యం వారికి కలగాలి. వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించవద్దు
రెండో వారం ప్రణాళిక
బయటకు షాపింగ్‌కో సినిమాకో, లేదా స్నేహితుల ఇంటికో, టూర్‌లో తీసుకెళ్లండి, కాలేజీ ఫ్రెండ్స్ గురించి,కాలేజీలో ఉన్న ఇతర వివరాలపై సాఫ్ట్‌గా ఆరా తీయండి. ఫోన్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ దొంగచాటుగా చూడకండి, అలా చేస్తే ఒక్కసారిగా నమ్మకం పోతుంది.
మూడో వారంలో ఏం చేయాలి
పరిస్థితి మారకపోతే కెరీర్ కౌన్సెలింగ్ అనే పేరుతో ఒక సైకాలజిస్ట్‌ను కలవండి. ప్రేమలో ఉన్నట్టు తెలిస్తే, ఆమెకు సేఫ్టీ గురించి, కెరీర్ ప్రాధాన్యత గురించి ఓపెన్‌గా మాట్లాడండి. ప్రేమ అనేది ఎదుగుదలలో ఒక భాగం. దాన్ని నేరంలా కాకుండా, బాధ్యతతో ఎలా డీల్ చేయాలో నేర్పండి.
మీ పిల్లలు మారిపోలేదు. వాళ్లు ఒక కొత్త దశలోకి ప్రవేశించారు. ఆ సమయంలో మీరు వారితో కలిసి ట్రావెల్ చేయాలి. దీంతో ఆ దశలో వారు ఎదుర్కొంటున్న సమస్య మీకు అర్థమవుతుంది. వారికి తోడుగా నిలవాలి. అప్పుడే దాన్ని పరిష్కరించే వీలు వారికి కలుగుతుంది.
Frequently Asked Questions
పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత ఎందుకు మారిపోతారు?
పిల్లల్లో మార్పులు ప్రేమేనా అని ఎలా గుర్తించాలి?
ప్రేమలో ఉన్నప్పుడు ఫోన్ ను ఎక్కువసేపు చూడటం, బయటకు వెళ్లి మాట్లాడటం, డ్రెస్సింగ్ స్టైల్ లో మార్పు, అందంపై శ్రద్ధ పెరగడం, అతి ఆనందం లేదా చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డిప్రెషన్ వల్ల పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయా?
అవును, డిప్రెషన్ వల్ల కూడా పిల్లలు గతంలో ఇష్టపడిన పనులపై ఆసక్తి కోల్పోవడం, ఆకలి తగ్గడం లేదా పెరగడం, నిద్రలేమి లేదా అధిక నిద్ర, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తల్లిదండ్రులు పిల్లల్లో మార్పులను ఎలా ఎదుర్కోవాలి?
పిల్లలతో కలిసి తినడం, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం, వారు చెప్పేది ఓపికగా వినడం, వారి గోప్యతను గౌరవించడం ముఖ్యం. వారితో బయటకు వెళ్ళడం, సున్నితంగా ఆరా తీయడం కూడా మేలు చేస్తుంది.
పరిస్థితి మారకపోతే ఏమి చేయాలి?
పరిస్థితి మారకపోతే కెరీర్ కౌన్సెలింగ్ పేరుతో మానసిక నిపుణుడిని సంప్రదించడం మంచిది. ప్రేమలో ఉన్నట్లు తెలిస్తే, వారితో సేఫ్టీ, కెరీర్ ప్రాధాన్యత గురించి మాట్లాడాలి.























