Monkeys Died In The Water Tank At Nandikonda Municipality : నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృతి చెందాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కోతులు మంచి నీటి ట్యాంకులో పడి చనిపోయిన నీటినే సుమారు 150 ఇళ్లకు అధికారులు సరఫరా చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై గ్రామ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున సాగర్ హిల్ కాలనీలో వాటర్(ఒకటో వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన) ట్యాంక్ నుంచి కోతులు మృతదేహాలను మున్సిపల్ కార్మికులు బయటకు తీశారు. కోతులు నీటి ట్యాంకులో ఉన్న తీరు, ఇతర అంశాలను బట్టి వారం రోజులు కిందటే చనిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మంచి నీటిని సరఫరా చేసే అధికారులు కనీసం ట్యాంకులను పరిశీలించకపోవడం వల్ల సుమారు వారం రోజులపాటు కోతులు చనిపోయి పడి ఉన్న నీటినే తాగాల్సి వచ్చిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమానంతో పరిశీలించిన గ్రామస్తులు
గ్రామానికి సరఫరా చేసే మంచి నీటిలో వెంట్రుకలు, మాంసపు ముద్దలు వస్తుండడంతో పలువురికి అనుమానం వచ్చింది. మంచి నీటిని సరఫరా చేస్తున్న ట్యాంకు వద్దకు యువకులు వెళ్లి పరిశీలించగా పెద్ద ఎత్తున కోతులు మంచి నీటి ట్యాంకులో చనిపోయి కనిపించాయి. ఈ కోతులను చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గడిచిన కొద్దిరోజులు నుంచి కోతులు చనిపోయి ఉన్న నీటిని తాగామంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అనారోగ్య సమస్యలు వస్తాయోమోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కోతులు చనిపోయిన విషయం తెలిసి మూడు రోజులు నుంచి నీటిని సరఫరా చేయడం లేదని చెబుతున్నారు.
కోతులు ఎలా మృతి చెందినట్టు..?
కోతులు వాటర్ ట్యాంకులో పడి ఎలా మృతి చెందాయన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటర్ ట్యాంకుపై మూత ఉంటుందని, మూత ఉండగా కోతులు ఎలా పడి ఉంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. నీటిని సరఫరా చేసే సిబ్బంది ట్యాంకు రక్షణ, నీటి సరఫరాలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మూత తెరిచి పెట్టడం వల్లే ఈ కోతులు అందులో పడి మృతి చెంది ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. విజయ విహార్ సమీపంలోని ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే ఉద్ధేశంతో ఈ ట్యాంకును నిర్మించారు.
రెండు వేల లీటర్ల సామర్థ్యంతో ఉన్న తాగునీటి ట్యాంకులు రెండు, వేయి లీటర్ల సామర్థ్యంతో ఉన్న తాగునీటి ట్యాంకు ఒకటి ఉంది. ఈ మూడూ కాకుండా కోతులు పడి చనిపోయిన మరో తాగునీటి సరఫరా ట్యాంకు ఉన్నట్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగేశ్వరరావు వెల్లడించారు. గడిచిన మూడు రోజులు నుంచి కోతులు చనిపోయిన ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేయడం లేదని ఆయన చెబుతున్నారు. చనిపోయిన కోతులను నీటిని శుభ్రం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కేవలం 50 ఇళ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నామన్న ఆయన.. మూడు రోజులు నుంచి పూర్తిగా ఈ ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేయలేదని పేర్కొన్నారు.
మంచినీటి ట్యాంకులో కోతులు పడి మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ మున్సిపల్ శాఖలో ఏదో సిగ్గుమాలిన పరిస్థితిగా ఆయన పేర్కొన్నారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, సరిగా నిర్వహించడం ద్వారా ఇటువంటి ఇబ్బందులను తొలగించవచ్చు అన్నారు. కానీ ఈ తరహా చర్యలను అనుసరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్లే పాలన అస్తవ్యస్తంగా మారిందని కేటీఆర్ విమర్శించారు.