2019 ఎన్నికలకు ముందు వచ్చిన ‘యాత్ర’ మంచి విజయం సాధించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను మమ్ముట్టి పోషించారు. అప్పటికి ఆనందో బ్రహ్మ, పాఠశాల వంటి చిత్రాలను తెరకెక్కించిన మహి వి.రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ‘యాత్ర 2’గా తెరకెక్కిస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా కార్యరూపం దాల్చింది.


‘యాత్ర 2’ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 2024 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుందని పోస్టర్ ద్వారా తెలిపారు. 2019 ఫిబ్రవరిలో ‘యాత్ర’ విడుదల అయింది. ఇప్పుడు సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అదే నెలలో, ఎన్నికల ముంగిట ‘యాత్ర 2’ని రిలీజ్ చేయనున్నారు. ‘యాత్ర 2’ కీలక టెక్నీషియన్ల వివరాలను కూడా పోస్టర్‌లో తెలిపారు.


ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సంవత్సరం మార్చిలో వచ్చి రూ.100 కోట్లు కొట్టిన నాని ‘దసరా’ సంగీత దర్శకుడు ఆయనే. అలాగే ‘సాహో’, ‘సర్కారు వారి పాట’ వంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మదికి డీవోపీ బాధ్యతలు అప్పగించారు.


అయితే ఇందులో టైటిల్ రోల్ ఎవరు పోషిస్తారన్నది మాత్రం తెలియరాలేదు. గతంలో సూర్య, దుల్కర్ సల్మాన్‌ల పేర్లు బలంగా వినిపించాయి. ప్రస్తుతం తమిళ హీరో జీవా... వైఎస్ జగన్ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య గత చిత్రం ‘కస్టడీ’లో తనకు అన్నయ్య పాత్రలో జీవా నటించారు. మిగతా నటీనటుల విషయాలు కూడా తెలియాల్సి ఉంది.


'యాత్ర 2' సినిమాలో పాయింట్ ఏంటి?
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' తీశారు మహి వి. రాఘవ్. 'యాత్ర 2'లో వైయస్సార్ తనయుడు జగన్ మొగం రెడ్డి చేసిన పాదయాత్రను చూపించబోతున్నారు. తండ్రి మరణం నుంచి తనయుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి మధ్య ఏం జరిగింది? అనేది చూపించబోతున్నారు. దాంతో ఈ సినిమాపై సామాన్య ప్రేక్షకులలో మాత్రమే కాదు... రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. 


'రంగం' సినిమాతో తెలుగులోనూ జీవా హిట్ అందుకున్నారు. తెలుగులో పలు హిట్ చిత్రాలు నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి కుమారుడే ఆయన. ఆల్రెడీ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసిన అనుభవం ఉంది. టీమ్ ఇండియా తొలి వరల్డ్ కప్ విజయంపై రూపొందిన '83' సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించారు. 


కరోనా కారణంగా లభించిన సమయాన్ని  మహి వి. రాఘవ్ సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయంలోనే కొన్ని కథలు రాశారు. స్క్రిప్ట్ పనులు సైతం పూర్తి చేశారు. 'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' ఆ కథల్లోనివే. ఈ రెండూ కాకుండా 'సిద్దా లోకం ఎలా ఉంది నాయనా' అని ఓ సినిమా కూడా తీశారు. అది త్వరలో విడుదల కానుంది. ఇప్పుడు మహి వి. రాఘవ్ ఏం చేయబోతున్నారు? అంటే... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంగా ఆధారంగా తీయబోయే 'యాత్ర 2' ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.