Vishnu filed a petition against Manchu Manoj in the court and got a favorable order: మంచు సోదరుల మధ్య ఓ వివాదం కోర్టు వరకూ వెళ్లింది. చివరికి మంచు విష్ణు ఈ విషయంలో విజయం సాధించారు. మంచు విష్ణు పరువు తీసే విధంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దని సిటీ సివిల్ కోర్టు మంచు మనోజ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పంచదార ఉదంతం విషయంలో తన పరువు పోయిందని మంచు విష్ణు ఫీలయ్యారు. అందుకే కోర్టుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి మోహన్ బాబు మీద మంచు మనోజ్ నేరుగా మాట్లాడవచ్చు కానీ..సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేరు.
వారం రోజుల కిందట మంచు మనోజ్, కుటుంబసభ్యులతో ఇంట్లో ఉన్న సమయంలో కరెంట్ పోయింది. తీవ్రంగా హెచ్చుతగ్గులు రావడంతో ఏం జరిగిందో అని పరిశీలిస్తే.. వారింటికి పవర్ సమన్వయపరిచే బ్యాటరీ ఇన్వర్టర్, జనరేటర్ లో ఎవరో పంచదార పోసి ఉన్నారు. దీంతో సీసీఫుటేజీ పరిశీలించిన మనోజ్.. తన ఇంటికి మంచు విష్ణు వచ్చారని గుర్తించారు. ఆయన తన సిబ్బందితో ఓ కవర్ కూడా తీసుకు రావడంతో అది పంచదార అని.. విష్ణునే తన కుటుంబానికి హాని తలపెట్టేలా కరెంట్ షార్ట్ సర్క్యూట్ కు ప్రయత్నించారని మనోజ్ ఆరోపించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు కానీ తర్వాత రోజు తన భార్య మౌనికా రెడ్డి తల్లి శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో ఆళ్లగడ్డ వెళ్లిపోయారు.
విష్ణు ఇలా జనరేటర్ లో పంచదార పోశారని విస్తృతంగా ప్రచారం జరిగింది.దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చాయి. ఇంత సిల్లీగా ఎలా ఆలోచించారని ఆయనపై మీమ్స్ వేశారు. దీంతో మంచు విష్ణు హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఆయన పంచదార పోయలేదని వారి తల్లి మంచు నిర్మల కూడా లేఖ రాశారు. ఈ లేఖను పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఈ వివాదంపై స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇక విష్ణు గురించి మనోజ్ పోస్టులు పెట్టలేరు అనుకోవచ్చు.
మంచు మనోజ్ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తమ మధ్య ఆస్తుల గొడవలు లేవని ఆత్మగౌరవ పోరాటం ఉందని మనోజ్ ప్రకటించారు. కారణం ఏదైనా మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా వారు పెట్టుకున్న కేసులు కాకుండా.. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. మనోజ్ ను ఇంట్లోకి రాకుండా గేటు మూసేసిన రోజున ఆయన గేట్లు తోసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంంలో మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు. అక్కడ వాగ్వాదం జరగడంతో మోహన్ బాబు ఓ టీవీ చానల్ రిపోర్టర్ మైక్ లాక్కుని ఆయనను కొట్టారు. దాంతో ఆపరేషన్లు కూడా జరిగిన ఆ రిపోర్టర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు.