తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'వారిసు' (Varisu Movie). ద బాస్ రిటర్న్స్... అనేది ఉపశీర్షిక. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'వారసుడు'గా రానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. అతి త్వరలో, మరికొన్ని గంటల్లో సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 


జనవరి 4న ట్రైలర్...
బుధవారం సాయంత్రం ఐదు గంటలకు 'వారిసు' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిజేసింది. అంటే... తమిళ వెర్షన్ ట్రైలర్ (Varisu Trailer) మన ముందుకు వస్తుందన్నమాట. కాసేపటికి తెలుగు ట్రైలర్ (Varasudu Trailer) కూడా అదే సమయానికి విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ట్రైలర్ వస్తే... సినిమాలో కంటెంట్ ఏంటనేది ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. సినిమాలో భారీ తారాగణం ఉంది. 'ఊపిరి', 'మహర్షి' సినిమాల్లో వంశీ పైడిపల్లి సందేశం ఇచ్చారు. ఈ సినిమాలో ఏం సందేశం ఇస్తారో చూడాలి.    


Also Read : అమెరికాలో 'వీర సింహా రెడ్డి' దూకుడు - ఫస్ట్ డే 8 కోట్లు గ్యారెంటీ!?






శింబు పాడటమే కాదు... 
డ్యాన్స్ కూడా ఇరగదీస్తే!
'వారసుడు' సినిమాలో 'థీ దళపతి...' పాటను యువ తమిళ హీరో శింబు పాడిన సంగతి తెలిసిందే. పాడటమే కాదు... ఆయన లిరికల్ వీడియో కోసం డ్యాన్స్ కూడా చేశారు. హీరోగా విజయ్ కెరియర్ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అవుతోంది. ఆయన జర్నీ సెలబ్రేట్ చేసేలా ఆ పాటను రూపొందించారు. దాంతో పాటు 'రంజితమే...', 'సోల్ ఆఫ్ వారిసు' పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'రంజితమే...' సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవల తమిళ ఆడియో విడుదల చేశారు. 


తెలుగులో 'రంజితమే...' సాంగ్, 'ఇట్స్ ఫర్ యు అమ్మా' సాంగ్స్ విడుదల చేశారు. మిగతా పాటలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ కోసం ఫంక్షన్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ సభ్యులు  
 
తమిళంలో 'రంజితమే...' పాటను విజయ్ పాడారు. తెలుగులో ఈ పాటను యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఫిమేల్ లిరిక్స్ మాత్రం తమిళంలో పాడిన ఎంఎం మానసి తెలుగులో కూడా పాడారు. తెలుగు పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ ఈ పాటకు బాణీ అందించిన సంగతి తెలిసిందే.


Also Read : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ' 


తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'వారసుడు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్... పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక కథానాయికగా నటించారు. 


తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
 
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.