టాలీవుడ్ హీరో నాగచైతన్య హైదరాబాద్‌లో ‘షోయు’ పేరుతో జపనీస్ రెస్టారెంట్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆథెంటిక్ జపనీస్ ఫుడ్ కాకుండా అక్కడి మెనూకి ఇక్కడి లోకల్ ఫ్లేవర్ యాడ్ చేసిన వంటకాలు ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తూ ఉంటాయి. ఆ రెస్టారెంట్‌లో ఇప్పుడు వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత, నాగ చైతన్య కలిసి ఒక వీడియో చేశారు. ‘షోయు’ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది? అంత ప్రత్యేకంగా ఎలా తయారవుతుంది? షోయులో లభించే ఫుడ్ ఎందుకు ప్రత్యేకం? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకున్నారు. నాగ చైతన్య తల్లి వెంకటేష్ సోదరి. కాబట్టి ఆశ్రితకు నాగ చైతన్య బావ అవుతారు.


అయితే ఈ వీడియో పూర్తిగా ఇంగ్లిష్‌లో ఉంటుంది. షోయులో లభించే ఫ్యూజన్ జపనీస్ ఫుడ్ గురించి నాగ చైతన్య ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కేవలం ఫుడ్ మాత్రమే కాకుండా తమ ప్యాకేజింగ్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని నాగ చైతన్య ఈ వీడియోలో తెలిపారు. 



నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది. చైతన్యకు తొలి స్ట్రయిట్ తమిళ చిత్రమిది. ఆయన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.


ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో నిర్మించిన 'ది వారియర్' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. నాగ చైతన్యకు ఇది 22వ చిత్రం. 'కస్టడీ' సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే... తోటి అధికారులు ఆయన్ను కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్. ఈ సినిమాలో హీరో పేరు 'ఎ.శివ'. ఏ అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా ఉంది. చైతూ లుక్‌లో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. 'ప్రపంచంలో మార్పు రావాలంటే... అది ముందుగా నీలో రావాలి' అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్ కూడా చూపించారు. 


నాగ చైతన్యకు జోడీగా ఈ సినిమాలో కృతి శెట్టి3 నటిస్తున్నారు. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ సూపర్ హిట్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు. అందులో 'బంగార... బంగార...' సాంగ్ కూడా సూపర్ హిట్. మరో సారి ఈ సినిమాలో ఈ జంట సందడి చేయనుంది. 


అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, 'వెన్నెల' కిశోర్ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి తండ్రీ కుమారులు, సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పించనున్నారు. అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.