Chiyaan Vikram,s Veera Dheera Sooran Title Teaser Out: విలక్ష‌ణ‌మైన సినిమాలు చేయడంలో ముందుంటారు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్షకులను అలరిస్తారు. తన అద్భుత నటనతో జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘చియాన్ 62’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో మేకర్స్ చక్కటి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ‘చియాన్ 62’ చిత్రానికి ‘వీర ధీర శూరన్’ అనే టైటిల్‌ ను క‌న్‌ ఫ‌ర్మ్ చేశారు. త్వరలోనే తెలుగు టైటిల్ ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. రియా శిబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.   


ఊరమాస్ అవతార్ లో దుమ్మరేపిన చియాన్ విక్రమ్


ఇక ‘వీర ధీర శూరన్’లో చియాన్ విక్రమ్ ప‌క్కా మాస్ అవ‌తార్‌ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులను విక్రమ్ ఓ రేంజిలో అలరించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ టీజర్ లో విక్రమ్ కాళి అనే పాత్రలో కనిపిస్తున్నాడు. త‌న‌కు ఓ కిరాణా షాప్ ఉంటుంది. అందులో త‌ను ప‌ని చేసుకుంటుంటాడు. అత‌డితో అంత‌కు ముందే దెబ్బ‌లు తిన్న విల‌న్స్ జీపులు, వ్యాన్స్ వేసుకుని అక్క‌డికి చేరుకుంటారు. త‌మ‌ను కొట్టింది కిరాణా షాప్‌లో ఉన్న కాళి అని క‌న్‌ ఫ‌ర్మ్ అయితే అత‌న్ని చంపేయాల‌నేది వారి ఆలోచ‌న‌.


అయితే, విలన్స్ రాకను గుర్తిస్తాడు కాళి. వారిని ఏం చేయాలని అని ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో తమను కొట్టిందే కిరాణ దుకాణంలోని వ్యక్తి అని విలన్స్ తెలుసుకుంటారు. కత్తులతో అతడిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. అప్ప‌టి వ‌ర‌కు దాచి పెట్టిన తుపాకీ తీసుకుని కాలుస్తాడు కాళి. తుపాకీ చూడగానే విలన్స్ అక్కడి నుంచి పారిపోతారు. షాపులో ఉన్న ఓ కస్టమర్ హీరో చేతిలో గన్ చూసి భయపడుతుంది. కానీ, హీరో అదేమీ ప‌ట్టించుకోకుండా ఆమె కొన్న స‌రుకుల ఖ‌ర్చు ఎంత‌య్యిందనే విష‌యాన్ని చెప్తాడు. ఆమెలో ఓవైపు భయం, మరోవైపు ఆశ్చర్యం కనిపిస్తాయి.     



సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్న టైటిల్ టీజ‌ర్‌


సుమారు 4 నిమిషాల పాటు ఉన్న ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజ‌ర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ లోనే ఈ రేంజిలో మాస్ ఎలిమెంట్స్ ఉంటే, ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్ మాస్ అవ‌తార్ ప్రేక్షకులను బాగా అలరించడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీకి జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈశ్వ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్  వెల్లడించారు.


Read Also: సల్మాన్‌పై కాల్పులు జరిపేందుకు అంత చెల్లించారట - ఫుల్ అమౌంట్ తీసుకోకుండానే దొరికిపోయారు!