అన్‌స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆహాలో ప్రారంభం అయింది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిగత అనుబంధం గురించి మాట్లాడుకున్నారు. ‘మనం ఎప్పుడూ కలవమని, అస్సలు మాట్లాడుకోమని అందరూ అంటూ ఉంటారు. ఇదే మనం ఫస్ట్ టైం కలవడం అని అనుకుంటున్నారు.’ అని బాలకృష్ణ అనగా, పవన్ కళ్యాణ్ ‘లేదండీ. మనం కలుస్తూనే ఉంటాంగా.’ అన్నారు.
ఆ వెంటనే సుస్వాగతం సినిమా సమయంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసిన ఫొటోని కూడా డిస్‌ప్లే చేశారు. ఆ ఫొటో చూశాక ఇద్దరూ ఇప్పటికీ యంగ్‌గానే ఉన్నామని ఒకరికి ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చుకున్నారు. ‘2014లో నా బర్త్‌డే గ్రాండ్ కాకతీయకి వచ్చావ్. చాలా థ్యాంక్స్ అమ్మా.’ అని బాలకృష్ణ చెప్పగా, ‘అవునండీ. నాకు గుర్తుంది. క్రికెట్ టైంలో అనుకుంటా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
‘బాలకృష్ణ చెన్నైలో ఉన్నప్పుడు అన్నయ్య (చిరంజీవి) పుట్టినరోజు ఫంక్షన్లకు ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చేవారు. అప్పుడు ఆయన్ని దూరం నుంచి చూసేవాడ్ని. నేను సినిమాల్లోకి అప్పటికి రాలేదు. మొదటిసారి అన్నయ్య నన్ను మీకు హనీ హౌస్‌లో పరిచయం చేశారు. కానీ అప్పటివి ఫొటోలు ఏమీ లేవు.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
‘హనీ హౌస్ ఇంకా ఉందామ్మా’ అని పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ అడగ్గా ‘తెలీదండీ. ఉందనుకుంటా.’ అని పవన్ బదులిచ్చారు. ‘ఆ జ్ఞాపకాలు, ఆ తీపి గుర్తులే వేరు. చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువ కలిసేవాళ్లం’ అని బాలకృష్ణ అన్నారు. ‘మీ అన్నయ్య బర్త్ డే పార్టీలో మనం మొదటి సారి కలిసినప్పుడే మంచిగా పరిచయం అయి ఉంటే ఇప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్ అయపోయే వాళ్లం.’ అని బాలకృష్ణ అన్నారు. ఈ ఎపిసోడ్‌లో ఇంకా మరెన్నో ఇంట్రస్టింగ్ విషయాలను కూడా పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. ఆహా యాప్‌లో ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుంది.
ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఒక టాక్ షో ఎపిసోడ్‌కు ఇలా జరగడం భారతదేశంలోనే ఇదే తొలి సారి అని ఆహా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ప్రకటించింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ స్క్రీనింగ్ జరిగింది. ఎపిసోడ్ రాత్రి తొమ్మిది గంటలకు స్ట్రీమింగ్ ప్రారంభం కాగా, ఫ్యాన్స్ సాయంత్రం నుంచే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు. ప్రసాద్ ల్యాబ్స్ ముంగిట టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్న విజువల్స్‌ను కూడా ఆహా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.
అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో మొదటి భాగం ఈరోజు స్ట్రీమ్ కానుంది. రెండో భాగం ఎప్పుడు స్ట్రీమ్ కానుందో ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 10వ తేదీన కానీ లేదా మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీన కానీ రెండో భాగం స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటి ఎపిసోడ్ నిడివి 70 నిమిషాలుగా ఉంది.