Movie News: సినిమాల్లో రోజు రోజుకు హింస, అశ్లీలత, మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (BBFC) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ సన్నివేశాలు ఉన్న సినిమాలకు ఎక్కువ వయసు రేటింగ్ ఇవ్వనుంది. ఆదేశ ప్రజల అభిప్రాయాలను స్వీకరించింది కొత్త గైడ్ లైన్స్ రూపొందించింది. 2019 మార్గదర్శకాలలో 12A/12 కింద వర్గీకరించబడిన కొన్ని లైంగిక సన్నివేశాలను ఇప్పుడు 15 ఏళ్ల ఏజ్ రేటింగ్‌కు పెంచింది. ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చినట్లు BBFC వెల్లడించింది.


లైంగిక హింస పట్ల బ్రిటిషర్ల ఆందోళన


సినిమాలకు ఇస్తున్న రేటింగ్ విషయంలో ఫిల్మ్ బోర్డు తనంతట తానుగా నిర్ణయం తీసుకోలేదు. గత ఏడాది(2023)లో సుమారు 12 వేల మందితో మాట్లాడి అభిప్రాయాన్ని సేకరించింది. వీరిలో ఆయా వయసుల వారిని భాగస్వామ్యం చేసింది. సినిమాల్లో పెరిగిన, హింస, అశ్లీలత, మాదక ద్రవ్యాల సీన్స్ గురించి ప్రశ్నించింది. ఏ సినిమాలకు ఎంత ఏజ్ రేటింగ్ ఇస్తే బాగుంటుంది? అనే విషయాలపై అభిప్రాయాలను సేకరించింది. 2019లో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో సినిమాలు ఆత్మహత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని చాలా మంది వెల్లడించారు. ఇప్పుడు దాని స్థానంలో లైంగిక హింస వచ్చి చేసింది.


డ్రగ్స్ వినియోగం గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారంటే?    


ఇక ప్రస్తుత సినిమాల్లో గంజాయి సహా మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా చూపిస్తున్నా, ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదని వెల్లడి అయ్యింది. ఈ నేపథ్యంలో BBFC డ్రగ్స్ సన్నివేశాలు కలిగిన సినిమాల విషయంలో తక్కువ ఏజ్ రేటింగ్ ను ఇస్తుంది. పారామౌంట్ ‘బాబ్ మార్లే: వన్ లవ్‌’ సినిమా విషయంలోనూ ఫిల్మ్ బోర్డ్ ఇదే విషయాన్ని పాటించింది. ఈ సినిమాలో డ్రగ్స్ వినియోగం ఉన్నా, కొత్త మార్గదర్శకాల ప్రకారం 12A రేటింగ్‌ను ఇచ్చింది. భవిష్యత్తులో డ్రగ్స్ వినియోగం ఉన్న సినిమాలకు 15 రేటింగ్ ఇవ్వనున్నారు.


ఆ పదాల విషయంలో కఠిన నిర్ణయం


ఇక సినిమాల్లో వాడే భాష విషయంలోనూ ఫిల్మ్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక, స్త్రీ ద్వేషపూరిత అర్థాలు ఉన్న సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. 'బిచ్ ఆఫ్ ఎ బిచ్,' 'బిచ్,' 'డిక్' వంటి పదాల విషయంలో కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి పదాలను టీనేజ్ వాళ్లు వినడం మంచిదికాదని అభిప్రాయపడింది. ఇలాంటి పదాలను ఉపయోగించే సినిమాలకు ఎక్కువ ఏజ్ రేటింగ్ ఇవ్వనుంది.  


“సినిమాలు మనుషుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే, వాటిని సర్టిఫై చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సినిమాలకు బోర్డు ఇచ్చే రేటింగ్ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయంపై అభిప్రాయాలను సేకరించాం. గతంలో పోల్చితే ఇప్పుడు సినిమాల్లో ఆందోళన చెందే అంశాలు మారినట్లు అర్థం అవుతోంది” అని BBFC ప్రెసిడెంట్ నటాషా వెల్లడించారు. అటు బ్రిటిష్ ఫిల్మ్ బోర్డ్ తాజా మార్గదర్శకాలపై ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ స్పందించింది. తమ ఫ్లాట్ ఫామ్ లో ఉన్న కంటెంట్ వందకు వందశాతం BBFC నిబంధనలకు లలోబడి ఉందని వెల్లడించింది.


Read Also: రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్న ‘బిగ్ బాస్’ విన్నర్ - ఇంతకీ ఆ విషాన్ని ఏం చేస్తారు?