Satyabhama Today Episode: పెళ్లి చూపుల్లో విడిగా మాట్లాడుకుంటారు మాధవ్, సత్యభామ. మరోవైపు సత్య ఇచ్చినట్లు క్రిష్‌కు కాళీ లవ్ లెటర్ ఇస్తాడు. ఇక మురళి అందరి ముందు సత్య తనకు బాగా నచ్చిందని చెప్తాడు. సత్య కూడా తనని ఇష్టపడితే పెళ్లి చేసుకుంటానని అంటాడు. 


శేఖర్: విన్నావు కదారా మావాడు వైపు నుంచి లైన్ క్లియర్‌. ఇక అమ్మాయి చెప్పిన దాని బట్టి ముందుకు వెళ్లడమే. 
శాంతమ్మ: మా సత్యకు మేం ఎంత చెప్తే అంతే..
శేఖర్: మరి ఇంకేం పంతుల్ని పిలిచి నిశ్చితార్థం ముహూర్తం పెట్టుకోవడమే.
మాధవ్: అలా కాదు డాడ్.. సత్యని కూడా ఆలోచించుకోనీ..
సునంద: అవునండీ.. ఆడపిల్ల కదా ఆలోచించడానికి అవకాశం ఇవ్వండి.
శేఖర్: సరేరా మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కొని మాకు ఫోన్ చేయండి. 


మరోవైపు క్రిష్ లెటర్ చూసి తెగ మురిసి పోతాడు. ఇక సత్య కూడా ఆలోచనలో పడుతుంది.
సత్య: నేను ఒక నిర్ణయానికి రావడానికి ఇంత ఆలోచించాల్సి వస్తుంది. తానేంటి నిమిషాల్లో తేల్చేశాడు. పెళ్లి అంటే నూరేళ్ల బంధం కదా కనీసం ఒకరోజు అయినా ఆలోచించాలి కదా.. తను తొందర పడి నన్ను తొందర పెడుతున్నాడా.. 
సంధ్య: అక్కా.. చెప్పు 
సత్య: అంత సీన్ లేదు. 
సంధ్య: ఏంటి పెళ్లి కొడుకుకా.. ఉండు ఈ బ్రేకింగ్ న్యూస్ అమ్మవాళ్లకి చెప్తా..
సత్య: అయ్యో ఆగవే.. 
సంధ్య: వాళ్లేమో నీకు పెళ్లి కొడుకు నచ్చాడు అనుకుంటున్నారు. నువ్వేమో కాదు అంటున్నావు. వాళ్ల మాటలు నిశ్చితార్థం వరకు వెళ్లిపోయాయి. వెళ్లి ఆపలేదు అనుకో పెళ్లి వరకు వెళ్లిపోతాయి. 
సత్య: నేను పెళ్లికొడుకు నచ్చలేదు అని చెప్పానా.. 
మైత్రి: ఓ అయితే నచ్చేశాడు అన్నమాట. కంగ్రాట్స్.. కంగ్రాట్స్..
సత్య: అయ్యో నన్ను చంపకండి.. కాసేపు ఒంటరిగా వదిలేయండి.. చూడండి ఒక ఆడపిల్ల పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్లాలి అనుకోవడం చిన్న విషయం కాదు. ఒకరకంగా అది ఓ కొత్త జీవితం. ఎన్నో ఆశలను కోరికలను మోసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టాక తను కోరుకున్న జీవితం అదికాదు అని తెలిశాక ఆ ఆడపిల్ల జీవితం ఏంటి. తన ఆశలను చంపుకొని జీవితాన్ని త్యాగం చేయాలి. లేదా వెనక్కి తిరిగి వచ్చి తన తండ్రికి బరువుగా మారాలి. అవి రెండూ ఏ సగటు ఆడపిల్ల కోరుకోదు. మెడలో తాళి తన జీవితానికి అందంగా ఉండాలి అని కోరుకుంటుందే కానీ బరువుగా మారాలి అని కోరుకోదు. పేగు బంధానికి దూరంగా పెనిమిటి బంధాన్ని నమ్ముకొని దూరంగా వెళ్లాలి అంటే గుప్పెడు గుండెల్లో ఎన్నో భయాలు మరెన్నో సందేశాలు నా పరిస్థితి కూడా అదే.. అందుకే కొద్దిగా సమయం తీసుకోవాలి అనుకుంటున్నాను ఈ మాటే నాన్నకి చెప్తాను. 


క్రిష్‌ లెటర్ పట్టుకొని సంతోషంగా ఉండగా వాళ్ల బామ్మ వస్తుంది. ఏం జరిగింది అని సైగలు చేస్తుంది. గంట ఆమె అడగాల్సిన ప్రశ్నలను క్రిష్‌ని అడుగుతాడు. క్రిష్ తన ప్రేమ గురించి చెప్తాడు. ఇక క్రిష్ సత్యను నేరుగా ఇంటికే తీసుకొస్తా అని అంటాడు. దానికి బామ్మ ఓరిదేవుడా ఇన్నాళ్లకు నా కొడుకుని ఎదురించే మనవడిని నాకు ఇచ్చావా అని అంటుంది. దాన్నే గంట చెప్తాడు. 


విశ్వనాథం: సత్య నిన్ను చూస్తే అర్థమవుతుంది. నువ్వేదో కన్ఫూజన్‌లో ఉన్నావని.  అంతేనా అమ్మ.
సత్య: ఆడపిల్ల జీవితం అంటేనే ఓ పెద్ద కన్ఫూజన్.. కోరుకున్నది దక్కదు. అనుకున్నది జరగదు. నచ్చింది ఉండదు. ఉన్నది నచ్చదు. ఏం చేయాలో తెలీదు. అలా అని ఏం చేయకుండా ఉండలేదు. సమస్య ఇది అని తెలియకపోవడమే నా సమస్య నాన్న.
విశ్వనాథం: పెళ్లి కొడుకు నచ్చలేదా అమ్మ.
సత్య: నచ్చకపోవడానికి అతనిలో ఏం లోటు లేదునాన్న. నచ్చాడు అని చెప్పడానికి కారణాలు కావాలి కదా నాన్న అవే వెతుక్కుంటున్నాను. నా అంతరాత్మ చాలా ప్రశ్నలు అడుగుతుంది నాన్న. సమాధానం చెప్పి తృప్తి పరిస్తేనే నా మనసు ఒక నిర్ణయానికి రాగలుగుతుంది. 
విశ్వనాథం: ఇంట్లో వాళ్లు అందరూ నీ సమాధానం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అమ్మా.
సత్య: తెలుసు.  


క్రిష్: రేయ్ బాబీ అన్ని పండగలు ఒకే సారి వస్తే ఎలా ఉంటుందో నా మనసు ఇప్పుడు అలా ఉందిరా.. 
మాధవ్: నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సత్య ఎందుకో తటపటాయిస్తుంది అనిపిస్తుంది. ఒక సారి కలిసి మాట్లాడితే క్లారిటీ వస్తుంది.
విశ్వనాథం: అమ్మా సంధ్య ఎప్పుడు చూసినా ఫోన్ ఏనా.. అయినా నీకు ఇచ్చిన టైం అయిపోయింది.  ఫోన్ పక్కన పెట్టు. అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు.. 
మాధవ్: అంకుల్ నేను మాధవ్‌ని ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా.. 
విశ్వనాథం: అమ్మా మాధవ్ నీతో మాట్లాడుతాడు అంట.
మాధవ్: నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని తెలుసు కానీ తప్పలేదు. ఒకసారి పక్కకు వచ్చి మాట్లాడొచ్చు కదా..
సత్య: ఫోన్ మా నాన్నకి ఇవ్వనా..
మాధవ్‌: సత్య ఒక్క నిమిషం నేను చెప్పేది విను. మిమల్ని కలుసుకోవాలి రెస్టారెంట్‌కి రాగలరా..
సత్య: మీరు మా నాన్నతో మాట్లాడండి ఆయన ఒప్పుకుంటే వస్తాను.
మాధవ్‌: అంకుల్ నేను సత్యతో ఒకసారి మాట్లాడాలి. రెస్టారెంట్‌లో కలుద్దామా అంటే మీ పర్మిషన్ తీసుకోవాలి అంటుంది.
విశ్వనాథం: బాబు నేను నీకు మళ్లీ కాల్ చేసి ఏ సంగతో చెప్తాను. 


ఇక శాంతమ్మ అడ్డు చెప్తుంది. తనని విశాలాక్షి, విశ్వనాథం ఒప్పిస్తారు. ఇక సంధ్యను తోడుగా వెళ్లమంటుంది శాంతమ్మ. సత్య బయల్దేరుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: బిగ్‌బాస్ ప్రియాంక జైన్: చేదు వార్త చెప్పిన ప్రియాంక.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ ఏడ్చిన నటి