Prabhas about his marriage: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా గుర్తుచ్చేది ప్రభాస్. మన టాలీవుడ్ బాహుబలి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. కానీ ఇప్పటిదాకా ఆయన పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. తాజాగా అసలు పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా? అంటూ ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి ఆయన ఎప్పుడు, ఎక్కడ ఇలాంటి కామెంట్స్ చేశారో తెలుసుకుందాం పదండి.
బుల్లితెరపై ప్రసారమవుతున్న 'నా ఉఛ్వాసం కవనం' (సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలపై ప్రత్యేక కార్యక్రమం) షోలో ప్రభాస్ అతిథిగా పాల్గొన్నారు. అందులో భాగంగా తనకు ఇష్టమైన పాటల గురించి మాట్లాడటంతో పాటు పెళ్లిపై సరదాగా వ్యాఖ్యానించారు. తనకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'జల్సా' సినిమాలోని 'చలోరే చలోరే చల్' సాంగ్ గురించి చర్చిస్తానంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయట పెట్టారు. తను ఏ పార్టీకి వెళ్లినా సరే ఈ పాట గురించి ప్రస్తావన తీసుకొస్తారట. అలాగే సీతా రామశాస్త్రి రాసిన పెళ్లి పాటల గురించి కూడా ఆయన మాట్లాడారు. ప్రభాస్ మాట్లాడుతూ "జల్సా మూవీలో ఉన్న చలోరే చలోరే చల్ పాట అంటే నాకు చాలా ఇష్టం. దాని అర్థం గురించి ఎన్నిసార్లు చర్చించానో లెక్కలేదు. పార్టీలో ఈ పాటను నేను పెట్టగానే కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ పారిపోయేవారు. మళ్లీ ఆ పాట గురించి డిస్కషన్ పెడతానని భయపడేవాళ్లు. ముఖ్యంగా ఈ పాటలో వచ్చే 'రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం' అనే లైన్ అంటే ప్రత్యేకంగా చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ పాటను సినిమాలో స్టోరీ కోసం రాసినప్పటికీ అది మన లైఫ్ స్టైల్ గురించే రాసారని అనిపిస్తుందని వెల్లడించారు.
Also Read: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్... ఆ రెండు మాత్రం చాలా స్పెషల్
'ఆట' సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా బాగుంటుందంటూ కితాబునిచ్చారు. వీటితో పాటు ప్రభాస్ మరికొన్ని సినిమాల్లో ఉన్న పెళ్లి పాటల గురించి మాట్లాడారు. అందులో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ "మనీ అనే సినిమాలో సీతారామశాస్త్రి రాసిన 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్' అనే పాటలో పెళ్లి చేసుకోకూడదని రాశారు. అయితే మరోవైపు పెళ్లిని గొప్పగా అభివర్ణిస్తూ ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. అయితే ఇంతకీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా" అని నవ్వుతూ ఆ పాటల వల్ల తాను ఏం ఫీలయ్యాడో సరదాగా బయట పెట్టారు ప్రభాస్.
అలాగే తెలుగు సినిమా చరిత్రలోనే అద్భుతమైన పాటలు అంటే 'చక్రం' సినిమాలోని 'జగమంత కుటుంబం' సాంగ్ కచ్చితంగా ఉంటుందని అన్నారు ప్రభాస్. "ఆ పాటను విన్నప్పుడల్లా ఆ సాహిత్యం వెనుక ఉన్న అర్థం తెలిసి నాకు కన్నీళ్లు వస్తాయి. సీతారామశాస్త్రి గురించి చెప్పడం అంతా తేలికైన పని కాదు. పెద్ద పెద్ద పండితులు మాత్రమే ఆయన గురించి మాట్లాడగలరు. తెలుగు సాహిత్యంలో ఆయన ఒక సింహం లాంటివాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు పాటలు రాయడం అన్నది మన అదృష్టం" అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి తనలో ఎలా స్ఫూర్తినింపారో వివరించారు.