Podharillu Serial Today Episode: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహా మళ్లీ తిరిగిరావడంతో ఏమైందని మాధవ్‌ అడుగుతాడు. నిన్న రూమ్ అద్దెకు ఇచ్చేందుకు టోకెన్ ఎమౌంట్ తీసుకున్న యజమాని...ఇవాళ అద్దెకు ఇచ్చేదిలేదని చెప్పి వెళ్లగొట్టాడని మహా బదులిస్తుంది.అలా ఎలా చేస్తాడని రాత్రికిరాత్రి వాడికి ఏమైందని మాధవ్‌ ప్రశ్నిస్తాడు. నాకు కూడా  అదే అనుమానం కలుగుతోందని....నిన్న బాగానే మాట్లాడినవాడు ఇవాళ ఇలా చేశాడంటే వాడిని గట్టిగా ఎవరో బెదిరించి ఉంటారని అంటుంది. ఇదేదో నామీదకే వస్తోందని భావించిన చక్రి కూడా మాట కలపుతాడు. నేను కూడా వాడిని గట్టిగా బెదిరించానని కానీ నా ఇల్లు నాఇష్టం అనేసరికి వదిలేసి వచ్చామని చెబుతాడు.
అంత బలవంతంగా వాడి ఇంట్లో ఉంచలేక మహాను తీసుకుని వచ్చేశానని చెబుతాడు. మరో ఇల్లు చూడమని మహా చెప్పగా....ఎక్కడికి వెళ్లినా ఇదే తంతు ఉంటుందని..నీకు ఈ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని మాధవ్‌ అంటాడు. చక్రి అబద్ధాలు తప్ప...ఈఇంట్లో నీకు ఇబ్బంది ఏముందని అంటాడు. ఇప్పటికే కన్నా, కేశవ్‌ నిజంగా నేను వాళ్ల వదిన అనుకుంటున్నారని...నేను ఇక్కడే ఉంటే వాళ్లు అదే నిజమనుకునే ప్రమాదం ఉందని మహా అంటుంది.
 
అది ఏరోజైనా  తెలియాల్సిందే కదమ్మా నువ్వు దాని గురించి ఆలోచించొద్దని చెప్పి పంపించేస్తాడు. మహా వెళ్లిపోయిన తర్వాత చక్రిని పట్టుకుని మాధవ్‌ గట్టిగా నిలదీస్తాడు. ఆ ఇంటి యజమానిని బెదిరించింది నువ్వే కదా అని అడుగుతాడు. ఏం చేస్తాను మహాను ఇక్కడే ఉంచడానికి నాకు ఇంతకన్నా మంచి మార్గం దొరకలేదని అంటాడు. ఇలా మోసం చేసి తనను నీవైపు తిప్పుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తాడు. మహాకు ఈవిషయాలన్నీ తెలిస్తే నిన్ను ఇంకా అసహ్యించుకుంటుందని అంటాడు. 
రాత్రికి మందు తాగి ఇంటికి వచ్చిన నారాయణ...అందరూ హాల్‌లో పడుకోవడం చూసి ఆశ్చర్యపోతాడు.  చక్రి వాళ్ల ఆవిడ రూమ్‌లో కాకుండా బయట ఎందుకు పడుకున్నాడని అనుకుంటాడు. వెంటనే చక్రిని నిద్రలేపి నువ్వేంటిరా ఇక్కడ పడుకున్నావని నిలదీస్తాడు. వెంటనే వెళ్లి మీ ఆవిడ రూమ్‌లో పడుకోమని చెబుతాడు. మాధవ్‌ నిద్రలేచి ఇప్పుడు అవన్నీ ఎందుకని ప్రశ్నించగా....వాళ్ల నాన్న గట్టిగా తిడతాడు. మీ అందరికి బాడీ పెరుగుతుంది కానీ బుద్ధి పెరగడం లేదని మండిపడతాడు. భార్యాభర్తలు ఒకచోట ఉండకుండా ఇలా విడివిడిగా ఉంటారా అని నిలదీస్తాడు.
 
మాధవ్‌ ఎంత ఆపేందుకు ప్రయత్నిస్తున్నా వినకుండా  చక్రిని తన భార్య గదిలోకి పంపుతాడు. అర్థరాత్రి తలుపులు కొట్టడంతో  మహా భయపడి తలుపు తీస్తుంది. చక్రి గదిలోకి వస్తూ...నేను బయటపడుకున్నానని మానాన్న గొడవ చేస్తున్నాడని చెబుతాడు. ఈ ఒక్కరాత్రికి ఇక్కడ పడుకుంటానని చెబుతాడు. దీంతో మహాకు ఏం అర్థంకాదు. చక్రి అలాగే కింద పడుకోగా...ఆమె మంచంమీద కూర్చుని ఉంటుంది. నారాయణ బయటకు వెళ్లిపోగానే...మాధవ్‌ చక్రిని బయటకు పిలిచి పడుకోబెట్టుకుంటాడు.
రాత్రి జరగిన వ్యవహారం అంతా చూసిన కేశవ్‌....ఉదయాన్ని మాధవ్‌ను గట్టిగా నిలదీస్తాడు. అసలు ఎందుకు వాళ్లిద్దరినీ విడదీయాలని చూస్తున్నావని ప్రశ్నిస్తాడు. ఎవరైనా కొత్త జంట ఏకాంతంగా ఉండటానికి సమయం ఇస్తారని...కానీ నువ్వు మాత్రం వాళ్లను విడదీయాలనే చూస్తున్నావని మండిపడతాడు. తాగి చేసినా రాత్రి నాన్న చేసిన పనిమంచిదేనని  కానీ నువ్వు ఎందుకు మళ్లీ చక్రిని బయటకు పిలిచి నీ దగ్గర పడుకోబెట్టుకున్నావని అంటాడు.
 
వాళ్లేకదరా నా పెళ్లి అయ్యేవరకు కలిసి ఉండమని చెప్పింది అందుకే పిలిచానని చెబుతాడు. నువ్వు చేస్తున్న పద్ధతి ఏం బాగాలేదని కేశవ్‌ అంటాడు. వాడికి బుద్దిలేక అలా అన్నాడనుకో...నువ్వు పెద్దవాడివి వాడికి సర్దిచెప్పకుండా  సరేనని ఎలా అంటావని అంటాడు. నువ్వు పద్ధతి మార్చుకో అన్నయ్య అని చెప్పి కోపంగా వెళ్లిపోతాడు. కేశవ్‌కు నిజం తెలియక అపార్థం చేసుకుంటున్నాడని మాధవ్‌ అనుకుంటాడు.