Podharillu Serial Today Episode: విడాకులు కోసం లాయర్‌ను కలిసిన మహా,చక్రికి అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. లాయర్ అడిగిన ప్రశ్నలకు మహా మాత్రమే సమాధానం చెప్తుంది. పెళ్లయి ఎన్నేళ్లు అవుతుందని లాయర్ అడగ్గా...కేవలం 2 నెలలు మాత్రమే అవుతుందని చెబుతుంది. అయితే ఏడాది తర్వాత రండని లాయర్ చెప్పగా మ్యూచివల్ డైవర్స్‌కు అంత సమయం అవసరం లేదు కదా అని మహా చెబుతుంది. అయితే మీ ఆయన ఏమైనా కొడుతున్నాడా..? లేక రోజూ తిడుతున్నాడా అని లాయర్ మళ్లీ ప్రశ్నిస్తాడు. అలాంటిదేమీ లేదని ఆయన చాలా మంచివాడేనని చెబుతుంది.అయితే విడాకులు ఎందుకు కోరుకుంటున్నారని అడగ్గా....మా ఇద్దరికి మధ్య సఖ్యత కుదరక కాపురం చేయడం లేదని అందుకే కోరుకుంటున్నామని అంటుంది.
కౌన్సెలింగ్ ఏర్పాటు చేయిస్తానని అప్పటి కూడా మీ మధ్య సఖ్యత కుదరకపోతే ఆ తర్వాత చూద్దామని అంటాడు. మధ్యలో చక్రి మాట్లాడటానికి ప్రయత్నించగా మహా అతన్ని అడ్డుకుంటుంది. లాయర్ కూడా అతను ఏదో చెప్పబోతున్నాడు కదా చెప్పనివ్వండని అంటే...ఏం లేదని నేను చెప్పాలనుకున్నదే అతను చెప్పడానికి ట్రై చేస్తున్నాడని చెప్పి ఆపుతుంది. మాకు ఎలాంటి కౌన్సెలింగ్ వద్దని...ఇద్దరం ఇష్టపడే విడాకులు తీసుకోవడానికి వచ్చామని చెబుతాడు. మీరు విడాకులు ఇవ్వడం కుదరదంటే..మేం వేరే లాయర్‌ను చూసుకుంటామని మహా గట్టిగా సమాధానమిస్తుంది.
మీరు ఇద్దరూ అంత గట్టిగా అడుగుతున్నారంటే తప్పకుండా ఇప్పిస్తానని చెప్పిన లాయర్....మీకు పెళ్లయినట్లు మ్యారేజీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతాడు. ఉందని మహా అతనికి మ్యారేజీ సర్టిఫికేట్ ఇస్తుంది.అది చూసిన లాయర్ షాక్ తింటాడు.మీ పెళ్లి పోలీసుస్టేషన్‌లో జరిగిందా అని అడుగుతాడు.అవునని మహా సమాధానమిస్తుంది. ఎందుకు అలా జరిగిందని అడిగితే....మా ఇంట్లో నుంచి మేం పారిపోయి వచ్చామని,మా వాళ్లు వెంబడిస్తుంటే పోలీసులను ఆశ్రయిస్తే పెళ్లి చేశారని చెబుతుంది. సరే అయితే ఇద్దరి ఆధార్ కార్డులిస్తే డైవర్స్‌కు అప్లై చేస్తానని అంటాడు. నేను ఇంట్లో నుంచి వచ్చే హడావుడిలో ఆధార్ కార్డు తీసుకురావడం మర్చిపోయానని మహా అంటుంది.అలా అయితే పోలీసుస్టేషన్‌లో పెళ్లి ఎలా చేశారని...రిజిస్ట్రేషన్ ఎలా చేయించారని లాయర్ ప్రశ్నిస్తాడు. అవును కదా పోలీసులు ఆధార్‌కార్డు లేకుండా పెళ్లి ఎలా చేశారని మహా చక్రి ప్రశ్నిస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసని చక్రి అబద్ధం చెబుతాడు. ఆధార్‌కార్డు లేకుండా పోలీసులు అసలు పెళ్లి చేయరని లాయర్ చెప్పడంతో మహా అనుమానం ఇంకా బలపడుతుంది. మీరు ఆధార్ కార్డు తీసుకురాకుండా విడాకులు ఇప్పించలేమని చెప్పి లాయర్ వాళ్లిద్దరినీ పంపించేస్తాడు.
బయటకు వచ్చిన మహా...చక్రిని నిలదీస్తుంది. పోలీసులకు ఆధార్‌కార్డు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. నన్ను అడిగితే నేను ఎలా చెప్పగలనని...నేను కూడా ఆరోజు మీపక్కనే ఉన్నాను కదా అని అంటాడు. మీ నాన్న వాళ్ల దగ్గర నుంచి తీసుకున్నారేమో అని చెప్పగా....వాళ్లు వచ్చిందే నా పెళ్లి ఆపడానికి అయితే ఆధార్ కార్డు ఎందుకు ఇస్తారని నిలదీస్తుంది. మరి నాకు ఏం తెలియదని చక్రి అడగ్గా....అసలు పోలీసులు ఆధార్ కార్డులేకుండా ఎలా పెళ్లి చేశారో కనుక్కోవాలని అంటుంది. ఇప్పుడు ఈలాయర్ లేనిపోనివి చెప్పాడని చక్రి తిట్టుుకుంటాడు. ఈ మహా ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టిందంటే నా గుట్టు మొత్తం తెలిసిపోతుందని చక్రి అనుకుంటాడు.
మహాను మభ్యపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. నాకు వేరే పనుందని మీరు ఇంటికి వెళ్లండని చెప్పి పంపించేస్తాడు. మహా వెళ్లిపోయిన తర్వాత కానిస్టేబుల్‌ను కలిసి చక్రి తన గోడు వెళ్లబోసుకుంటాడు. మీరు కష్టపడి పెళ్లిచేస్తే...మా ఆవిడ రెండునెలలు తిరగకుండానే నాకు విడాకులు ఇచ్చి వెళ్లిపోతానంటుందని అంటాడు. ఎందుకు అలా చేస్తుందని అడిగితే వాళ్ల పుట్టింటి వాళ్లు ఫోన్ చేసి ప్రేమతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని దీంతో నా భార్య కరిగిపోయి నాకు విడాకులు ఇవ్వాలని అనుకుంటుందని..ఇప్పుడే లాయర్‌ను కలిసి వస్తున్నామని చెబుతాడు.మీరు కొంచెం ఆమెకు ఫోన్ చేసి విడాకులు తీసుకోకూడదని బెదిరించాలని అంటాడు. దీనికి ఆ కానిస్టేబుల్ సరేనని చెబుతాడు.
