Podharillu Serial Today Episode: ప్రతాప్‌ పంపించిన మనుషులు మహా కారును వెంటాడుతుంటే...చక్రి వాళ్లను దారితప్పించేందుకు  అడవి మార్గంలోకి తీసుకెళ్తాడు. దీంతో రౌడీలకు మహా, చక్రి కనిపించకుండాపోతారు. ప్రతాప్‌వాళ్లకు భయపడి భూషణ్‌ కూడా  వాళ్ల కారులో నుంచి దిగి ప్రెండ్‌ను పిలిపించుకుని వేరే కారులో వెళ్లిపోతాడు. అయితే మహా వాళ్లు ప్రయాణిస్తున్న  కారు అడవిమార్గంలో ఆగిపోతుంది. దీంతో మహా మరింత భయపడుతుంది. చక్రి ఏమైనా చేస్తాడేమోనని భయంతో వణికిపోతుంది. అయితే చక్రి చలికాచుకోవడానికి చలి మంటవేయడంతోపాటు తినడానికి మొక్కజొన్నపొత్తులు అన్నీ అరెంజ్ చేయడంతో మహాకు అతనిపై నమ్మకం కుదురుతుంది. చక్రి మంచివాడేనని అనుకుంటుంది. ఇద్దరూ కలిసి కారుదిగి చలిమంట వద్దకు వెళ్తారు. మహాకు మంచి నిద్రరావడంతో  అలాగే చక్రి భుజంపై నిద్రపోతుంది. దీంతో చక్రి ఆమెకు గడ్డితో పడుకోవడానికి ఏర్పాట్లు చేసి పడుకోబెడతాడు.                    చక్రి ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో మాధవ్‌ భయపడుతుంటాడు. పెళ్లికొడుకుని కిడ్నాప్ చేసింది మనమేనని తెలిసి చక్రికి ఏమైనా అపాయం తలపెట్టారేమోనని కేశవ్‌తో అంటాడు. మనం ఒక్క క్లూ కూడా వదిలిపెట్టలేదని...మనం అని తెలిసే ఛాన్స్‌ లేదని అంటాడు. వాళ్లు పెళ్లి ఆపడంలేదని వీడు మళ్లీ ఏదో ప్రయత్నం చేసి ఉంటాడని అనుమానిస్తాడు. చక్రికి ఏంకాదులే అని ఛార్జింగ్ పెట్టుకుని ఉండడులేఅని కేశవ్‌ సర్దిచెబుతాడు. ఈలోగా  మళ్లీ తెల్లారడంతో చక్రి నిద్రలేచి చూసే సరికి మహా ఇంకా నిద్రపోతూనే ఉంటుంది. దీంతో అతను మెల్లగా  లేచి వెళ్లిపోయి కారు రిపేర్ చేస్తుంటాడు. ఈలోగా మహా కూడా  నిద్రలేచి అతని వద్దకు వస్తుంది. ఇంతలో చక్రి కారు రెడీ చేస్తాడు. ఈపాటికి మీనాన్న పంపించిన రౌడీలు వెతికి వెతికి అలిసిపోయి తిరిగి ఇంటికి వెళ్లిపోయి ఉంటారని చక్రి అంటాడు. అయితే పోలీసు  కంప్లైంట్ ఇస్తే మాత్రం వాళ్లు సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా వెతుక్కుంటూ వచ్చే ప్రమాదం ఉందని అందుకే ఫోన్‌కూడా ఆన్ చేయడం లేదని చెబుతాడు. ఇద్దరూ రెడీ అయిపోయి హైదరాబాద్‌ వెళ్లేందుకు  అడవి మార్గంలో ఎవరికీ కనిపించకుండా మరోసారి బయలుదేరతారు..                             అయితే రాత్రంతా వెతుకుతున్న భూషణ్‌ తెల్లారిన తర్వాత కూడా మహా కోసం పిచ్చెక్కినవాడిలా  వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో భూషణ్ కారుకు మహాకారు ఎదురుపడుతుంది. దీంతో వారిని అడ్డగించి మహాను లాక్కుని వెళ్లేందుకు భూషణ్ ప్రయత్నిస్తాడు. తాను రానంటే రానని మహా గొడవ చేస్తుంది. చక్రి కూడా అడ్డుకుంటాడు. అయినా సరే భూషణ్ చక్రిని పక్కకు నెట్టేసే మహాను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో మహా మరింత గొడవ చేసి పెద్దరాయి తీసుకుని మీ కారు మొత్తం పగులగొట్టేస్తానంటూ  బెదిరిస్తుంది. దీంతో భూషణ్ వెంట వచ్చిన అతని ప్రెండ్‌ బ్రతిమలాడతాడు. ఈకారు నాదని ఏం చేయవద్దని వేడుకుంటాడు. భూషణ్‌ను నేను తీసుకెళ్తానని చెబుతాడు.  భూషణ్‌ను వాళ్ల ప్రెండ్ బలవంతంగా కారులో కూర్చోబెట్టడంతో  మహా,చక్రి తమ కారులో మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా...వెనక భూషణ్‌ వాళ్లను కారులో వెంటాడుతుంటాడు. ప్రతాప్‌కు ఫోన్ చేసి మహా నాకు దొరికిందని...నేను తననే ఫాలో అవుతున్నానని మీరు వెంటనే రండని చెబుతాడు.