Podharillu Serial Today Episode: మహాకు ఏదో  విధంగా ఉద్యోగం ఇప్పించాలని ప్రయత్నించిన చక్రి...వాళ్ల ప్రెండ్‌ను బ్రతిమలాడి ఇంటర్వూ ఏర్పాటు చేస్తాడు. ఆ ఆనందంలో ఆమెకు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలని అనుకుంటాడు. తాను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చుడీదార్‌లు వేసుకుని ఇబ్బందిపడుతుందని  భావించి తనకోసం ఓ నైటీ కొనడానికి షాపుకి వెళ్తాడు. అక్కడ సేల్స్‌గర్లుతో పులిహార కలిపి మంచి నైటీ కావాలని అడుగుతాడు. తాను ఏ సైజ్‌ నైటీకావాలని అడిగితే చెప్పలేక...అక్కడే ఉన్న మరో అమ్మాయితో మాటలు కలిపి తనను తీసుకొచ్చి ఈ అమ్మాయి సైజ్‌ ఉండే నైటీ ఇవ్వమని అడుగుతాడు.

అప్పుడే అక్కడికి వచ్చిన కేశవ్‌...వీడు అమ్మాయిలతో పులిహార కలపడం చూసి నిలదీస్తాడు. నువ్వు ఇంతకు ముందు మాదిరిగా కాదని...ఇప్పుడు నిన్ను నమ్ముకుని ఓ అమ్మాయి వచ్చిందని నువ్వు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకోనని అంటాడు. అయినా నాకు ఇప్పటికీ అనుమానం ఉందని....ఆ అమ్మాయి నిన్ను ఏం చూసి ప్రేమించిందని అడుగుతాడు. నాకు మీ ఇద్దరి వ్యవహారం చూస్తుంటే చాలా అనుమానంగానే ఉందని అంటాడు. అసలు మీ ఇద్దరికీ నిజంగా పెళ్లి అయ్యిందా అని అంటాడు. దీనికి కంగారుపడిన చక్రి...పోలీసుల సాక్షిగా పెళ్లి జరిగింది కదా అని అంటాడు. అయితే నువ్వు మరీ రోజూ తన గదిలో పడుకోకుండా మా పక్కన వచ్చి ఎందుకు పడుకుంటున్నావు అని నిలదీస్తాడు. పెద్దన్నయ్య పెళ్లి అయ్యే వరకు మేం విడిగా ఉందామని అనుకున్నాం కదా అందుకేనని మళ్లీ అబద్ధం చెబుతాడు. సరేనని తాను టవల్‌ కొనుక్కుని వెళ్లిపోగా....చక్రి నైటీ తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు.

                        శైలూ వాళ్ల నాన్నను ఏడిపించి మరీ కొత్త ఫోన్‌ కొనిపెట్టించుకుంటుంది. అసలే రీల్స్‌ పిచ్చిదైన శైలూ...స్కూటీపై తిరుగుతూ కొత్త ఫోన్‌తో రీల్‌ చేయాలని తహతహలాడుతుంటుంది. తన ఫ్రెండ్‌ కీర్తి కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంతలో కీర్తి రాగానే స్కూటీ ఒకసారి ఇస్తే నేను రీల్‌ చేసుకుంటానని అడుగుతుంది. దీనికి ఆమె ససేమీరా అంటుంది.ఈ స్కూటీకి చిన్న గీత పడినా మా అన్నయ్య చంపేస్తాడని...అసలు నీకు బండి నడపడమే రాదని కాబట్టి ఇవ్వనంటే ఇవ్వనని అంటుంది. అయితే నువ్వు నీ బాయ్‌ప్రెండ్‌తో తిరిగిన ఫొటోలన్నీ నా దగ్గరే ఉన్నాయని....ఇప్పుడే వాటిని మీ  అన్నయ్యకు పంపిస్తానని చెప్పి బెదిరిస్తుంది. దీంతో చేసేదిలేక శైలూకి వాళ్ల ప్రెండ్‌ స్కూటీ ఇస్తుంది. దానిపై రీల్స్‌ చేస్తూ వాళ్లు రోడ్డుపై వెళ్తుంటారు. ఇంతలో బైక్‌ డెలీవరీ ఇవ్వడానికి కేశవ్‌ అదే దారిలో వస్తాడు. ఓ చోట బండి పక్కన పెట్టుకుని ఉండగా....శైలూ వెళ్లి నేరుగా కేశవ్‌ బండిని గుద్దేస్తుంది. దీంతో అందరూ కిందపడిపోతారు. శుభమా అని బండి డెలివరీకి ఇవ్వడానికి వెళ్తుంటే....డ్యామేజీ చేశారని కేశవ్ ఆగ్రహంతో ఊగిపోతుంటాడు. వాళ్లిద్దరూ వెంటనే పైకి లేచి కేశవ్‌ను గుర్తుపడతారు.

ఇప్పుడు వీడు మనల్ని చూస్తే...ఆ రోజు గిప్ట్‌షాప్‌లో పగులగొట్టిన బొమ్మ డబ్బులు కూడా వసూలు చేస్తాడని అనుకుంటారు. ఇంతలో కేశవ్‌ పైకి లేచి వాళ్ల దగ్గరకు వచ్చి గుర్తుపడతాడు. మీరా అంటూ ఆడబ్బులతోపాటు  ఇప్పుడు బండి డ్యామేజీ చేసిన 20వేలు కట్టకుంటే పోలీసులను పిలుస్తానని బెదిరిస్తాడు. దీంతో భయపడిపోయిన శైలూ.....కేశవ్‌ చేతిని పట్టుకుని గట్టిగా అరుస్తుంది. వీడు మా బండిని ఢీకొట్టి తిరిగి మమ్మల్నే డబ్బులు అడుగుతున్నాడని అరుస్తుంది. దీంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి కేశవ్‌ను గట్టిగా తిడతారు. వెంటనే కేశవ్‌ తేరుకుని ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని...పోలీసుస్టేషన్‌కు వెళితే తప్పు ఎవరిదో వాళ్లే తేలుస్తారని గట్టిగా చెప్పడంతో అందరూ భయపడి వెళ్లిపోతారు. ఇదే హడావుడిలో శైలూతోపాటు  ఆమె ప్రెండ్‌ కూడా అక్కడి నుంచి పరారైపోతారు.                           

నైటీ తీసుకుని ఇంటికి వచ్చిన చక్రి....మహాకు రెండు సర్‌ఫ్రైజ్‌లు  ఉన్నాయని చెబుతాడు. అవేంటి అని  అడగ్గా...నీకు రేపు ఇంటర్వూ  ఉందని చెప్పడంతో  ఆమె ఆనందంతో  ఉబ్బితబ్బిబ్బైపోతుంది. పెద్ద కంపెనీలో ఇంటర్వూ ఉందని చెప్పడంతో ఇంకా ఆనందపడిపోతుంది. మరి అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం అంటే సర్టిఫికేట్లు ఉండాలి కదా అని అంటుంది. అవేమీ అవసరం లేదని...మా అన్నయ్య సిఫార్సు చేశాడని, కాబట్టి నీకు సర్టిఫికేట్లు లేకుండానే  ఇంటర్వూ  నిర్వహిస్తారని చెప్పడంతో ....ఆమె మాధవ్‌కు థ్యాంక్స్  చెప్పాలని అనుకుంటుంది. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి చాక్లెట్‌ గిప్ట్‌గా ఇచ్చి చెప్పొచ్చులే అని చక్రి అంటాడు . మరి రెండో సర్‌ఫ్రైజ్ ఏంటని అడిగ్గా....తన దగ్గర ఉన్న నైటీ ఆమెకు ఇస్తాడు. దీంతో ఆమె కోపంగా నేను అడిగానా అని అంటుంది. అసలు నేను నైటీలే వేసుకోనని చెప్పడంతో ఉసూరుమంటూ  తీసుకుని బయటకు వెళ్లిపోతాడు.