Podharillu Serial Today Episode: మహావాళ్ల ఇంట్లో వాళ్లు తిట్టడంతో చాలా మూడీగా ఉంటుంది. దీంతో ఆమె మూడ్‌ మార్చేందుకు  చక్రి బయటకు తీసుకెళ్తానని అంటాడు. ఇంట్లోనే ఉంటే ఇదే ఆలోచిస్తూ బాధపడతారని...సరదాగా  బయటకు వెళ్తే కాస్త రిలాక్స్‌గా ఉంటుందని చెప్పడంతో ఆమె సరేనని అంటుంది. దీంతో చక్రి ఆమెను బైక్‌మీద ఎక్కించుకుని  హైదరాబాద్‌లోని  అన్నిప్రాంతాలు తిప్పుతుంటాడు. ట్యాంక్‌బండ్‌పై  కూర్చున్న వీరిని చూసి పోలీసులు ప్రశ్నించగా...మహానే తన తాళిబొట్టు తీసి చూపిస్తుంది. ఓహో మీరిద్దరూ భార్యాభర్తలా అని అనుకుని ఆ పోలీసు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చక్రి మహాను  ఐటీ ఏరియా, ఛార్మినార్‌తో సహా అన్ని ప్రాంతాలు తిప్పి ఇంటికి తీసుకొస్తాడు. మహా,చక్రి బైక్‌పై బయటకు వెళ్లడం చూసి మాధవ్ చాలా సంతోషపడతాడు.                         ఉదయం నిద్రలేచేసరికి మాధవ్‌ ఒక్కడే అన్ని పనులు చేసుకోవడం చూసి మహాకు కోపం వస్తుంది. అన్నయ్య ఒక్కడే పనులు చేస్తుంటే  వీళ్లంతా నిద్రపోతున్నారని  మండిపడుతుంది. మాధవ్‌ చెబుతున్నా వినకుండా  వాళ్లను నిద్రలేపుతుంది. రేపటి నుంచి 7గంటల కల్లా ఇంట్లో అందరూ నిద్రలేవాల్సిందేనని  హెచ్చరిస్తుంది. ఎవరికి వాళ్లు లేచి వెళ్లిపోతుంటే....పక్కబట్టలు చాప ఎవరు తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో చేసేదిలేక అందరూ తాము కప్పుకున్న బట్టలను తీసి మడపతపెట్టుకుని వెళ్లిపోతారు.  ఆ తర్వాత మహా ఇంటి ముందుకు రాగా...అంతా చెత్తాచెదారం ఉండటం చూసి చీపురుపట్టుకుని వెళ్లి మొత్తం ఊడుస్తుంది. మాధవ్‌ అక్కడికి వచ్చి ఈ పనులన్నీ నీకెందుకమ్మా...నేను చేస్తానులే అని చెప్పగా నాకు ముగ్గులు వేయడం వచ్చని చెబుతుంది. ఆమె ఊడ్చగా...కన్నా వెళ్లి నీళ్లు తీసుకొస్తాడు. ఆమె ఊడ్చి, చల్లి ముగ్గులు పెడుతుంది. తొలిసారి వాళ్ల ఇంటి ముందు ముగ్గులు వేయడం చూసి ఇంట్లో ఉన్న అందరూ ఎంతో సంతోషపడతారు.  తొలిసారి మా ఇంటికి కళ వచ్చిందంటూ  కన్నా పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఆ తర్వాత  స్నానం చేసి వచ్చిన మహా దేవుడి పటాలు ముందు దుమ్ము చూసి ఇంట్లో అందరిపై మండిపడుతుంది. రోజూ దీపం పెట్టరా అని అడిగితే....పండుగలకు మాత్రమే పెడతామని చెబుతారు. ఇంతలో ఫోన్‌లో ఆడుకుంటున్న చక్రిని పిలిచి దేవుడి ప్రమిదలు, గంటా అన్నీ శుభ్రంగా కడుక్కుని రమ్మని చెబుతుంది.  నాకు రాదని చక్రి చెప్పగా...ఇప్పటి నుంచి నేర్చుకోమని హెచ్చరిస్తుంది.ఇంతలో మాధవ్ కలుగజేసుకుని నేను వెళ్తానని చెప్పగా...అవసరం లేదు అన్నీ నేర్చుకుంటారని  అంటుంది. కన్నా, మహా  ఇద్దరూ  దేవుడి ఫొటోలన్నీ శుభ్రంగా తుడిచి బోట్లుపెట్టగా...ఇంతలో కేశవ్ బయటకు వెళ్లి పూలు కొనుక్కుని వస్తాడు.  చక్రి పూజాసామాగ్రి శుభ్రం చేసుకుని రాగా....మహా ఇంట్లో దీపం పెట్టి దూపం వేస్తుంది. అది చూసిన కన్నా ఎక్కిఎక్కి ఏడుస్తాడు. తొలిసారి ఈ బృందావనానికి  మహాలక్ష్మీలాంటి  కళ వచ్చిందని కన్నీరు పెట్టుకుంటాడు.  ఆ తర్వాత మాధవ్‌ టీ పెడుతుండగా...ఈరోజు నేను పెడతానని మహా గొడవ చేస్తుంది. నీకు రాదని చెప్పినా వినకుండా  నేను నేర్చుకుంటానని చెప్పి అందరినీ బయటకు పంపి స్వయంగా  టీ పెట్టి అందరికీ ఇస్తుంది. కానీ దానిలో పొరపాటుగా  పంచదారకు బదులుగా ఉప్పు వేయడంతో  అందరూ చాలా ఇబ్బందిగానే  టీ తాగుతారు. మరోసారి ఇలా జరగకుండా  జాగ్రత్తగా టీ చేస్తానని మహా చెబుతుంది.