Podharillu Serial Today Episode: చక్రి ఎంత చెప్పినా వినడం లేదని.. అద్దెకు ఇల్లుగానీ, రూమ్‌గానీ చూడమని మహాలక్ష్మీ  మాధవ్‌కు చెబుతుంది. ఏంటమ్మా నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదా లేకపోతే మావల్ల ఏమైనా ఇబ్బందిపడుతున్నావా  అని అడుగుతాడు మాదవ్‌...అలాంటిదేమీ లేదని కాకపోతే నేను ఏ పరిస్థితుల్లో ఇక్కడి వచ్చానో మీకు కూడా బాగా తెలుసు కదా అని అంటుంది. దీంతో తప్పకుండా రూమ్ చూస్తానని మాధవ్‌ హామీ ఇస్తాడు. అబ్బాయిలు కంటే ఎలాగైనా రూమ్‌ దొరుకుతుందని...కాకపోతే  నువ్వు ఉండాలంటే  మాత్రం చాలా మంచి రూమ్ కావాలని, నీకు సౌకర్యంతో పాటు రక్షణగా ఉండే రూమ్ ఉండాలి కదా కొంచెం లేట్‌ అయినా మంచి రూమ్‌ వెతికిపెడతానని అంటాడు. అప్పటి వరకు నువ్వు మా ఇంట్లో నీ సొంత ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చని చెబుతాడు.  మధ్యలో చక్రి కలుగజేసుకుని నేను చూస్తానని చెప్పాను కదా అంటాడు. నీవల్ల కావడం లేదనే నీను మీఅన్నయ్యకు చెప్పానని వెళ్లిపోతుంది.              మహాలక్ష్మీ వెళ్లిపోయిన తర్వాత నిజంగా రూమ్‌ చూస్తావా అన్నయ్య అని అడుగుతాడు  చక్రి. ఆమె అంతగా అడుగుతుంటే చూడకుండా ఎలా ఉంటానని అంటాడు. నువ్వు రూమ్‌ చూస్తే ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోతుందని...అప్పుడు నాకు శాశ్వతంగా  దూరమవుతుందని అంటాడు. తను నా దగ్గర ఉంటేనే కదా అన్న మేమిద్దరం  అర్థం చేసుకుని దగ్గర అయ్యేదని అంటాడు. ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో నీతో తాళి కట్టించుకుందో  వివరంగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ అమ్మాయిపై ఆశలు పెట్టుకోవడం తప్పని అంటాడు. ఆడపిల్ల అవసరాన్ని అడ్డుపెట్టుకుని నీ దాన్ని చేసుకోవాలని చూడటం స్వార్థమవుతుందని హెచ్చరిస్తాడు. ఆ అమ్మాయి దృష్టిలో ఇప్పటికీ నువ్వు చాలా సాయం చేశావని గౌరవం ఉందని అది పోగొట్టుకోవద్దని అంటాడు. నేను మహాను  ఇష్టపడటం నిజమేగానీ...ఏదీ నేను కావాలని చేయలేదని అన్నీ నాకు అలా కలిసొచ్చాయంతేనని అంటాడు. పెళ్లి కూడా నేను ప్లాన్ చేసి చేసుకోలేదని ఆ దేవుడే ఇలా చేశాడని అంటాడు. అయినాగానీ ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇక్కడ ఉంచలేనని చెబుతాడు. వెళ్లి అమ్మాయి గదికి గొల్లెం సరిచేసి రమ్మని పంపిస్తాడు. రాత్రికి చక్రి మళ్లీ వచ్చి  హాల్‌లోనే పడుకుంటుంటే కేశవ్‌, కన్నా మళ్లీ కోప్పడతారు. మాదగ్గర ఏదో దాస్తున్నావని నిలదీస్తారు. మాధవ్‌ వచ్చి అందరూ గొడవ చేయకుండా  పడుకోండని చెప్పి పడుకోబెడతాడు.                     తెల్లారి మహా నిద్రలేచేసరికి  మాధవ్ ఇంటిపనులన్నీ చేస్తుండటం చూసి ఆమెకు జాలి వేస్తుంది. ఆమె స్నానం చేసి వచ్చేసరికి పోలీసులు నారాయణను ఇంటివద్ద వదిలిపెట్టి వెళ్లిపోతారు. మీనాన్నను చాలా త్వరగానే వదిలిపెట్టారని మహా అనగా...ఇదంతా మాకు మామూలేనని ఆయన ఎప్పుడూ వాళ్ల అన్నయ్యపై గొడవపడి అలా స్టేషన్‌కు వెళ్లి వస్తూనే ఉంటాడని చెబుతాడు. ఇంతలో టీ పెట్టి ఇచ్చి మధ్యాహ్నం భోజనానికి  రెడీ చేస్తుంటాడు మాధవ్‌. అదేంటీ ఇంటి పనులన్నీ మీరు ఒక్కరే చేస్తుంటే  వీళ్లంతా  గుర్రుపెట్టి నిద్రపోతున్నారని మహా అడుగుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్లకు తల్లిలేకపోవడంతో  నేను దగ్గర ఉండి పెంచానని అప్పటి నుంచి మాకు ఇలా అలవాటు అయిపోయిందని అంటాడు. అప్పుడంటే చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు కదా మీకు సాయం చేయకుండా అలా నిద్రపోతే ఎలా అని అంటుంది. ఇంటి పనులన్నీ తానే చేస్తానంటూ  పెద్ద బిల్డప్‌ ఇచ్చిన మీ చక్రి కూడా నిద్రపోతున్నాడని...నేను నిద్రలేపుతానని చెప్పి నీళ్లు తీసుకుని వెళ్తుంది. చక్రిని నిద్రలేపడానికి  వెళ్తుండగా....కేశవ్‌ కాలు తగిలి నీళ్లు అతని ముఖంపై పడతాయి. నిద్రలో ఉన్న కేశవ్‌...తనపై ఎవరో నీళ్లు పోశారనుకుని చేయి పైకి ఎత్తుతాడు. దీంతో భయపడిపోయిన మహా ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ్ కేశవ్‌పై మండిపడతాడు. వదినపైనే చేయి ఎత్తుతావా అంటూ చక్రి అనగా...ఇద్దరూ గొడవపడతారు. దీంతో మాధవ్ ఇద్దరిని తిట్టి పంపిస్తాడు.