Podharillu Serial Today Episode: నారాయణకు గాయం పూర్తిగా మానిపోయే వరకు క్రమం తప్పకుండా ప్రతి 6గంటలకు ఓసారి మందులు వేయమని డాక్టర్ చెప్పడంతో...మహాలక్ష్మీ అలారం పెట్టుకుని మరీ అర్థరాత్రి మందులు వేయడానికి నిద్రలేస్తుంది. ఆమె అలారం సౌండ్ విని ఇంట్లో అందరూ నిద్రలేస్తారు. మహాలక్ష్మీ బయటకు వెళ్తుంటే...పెద్ది లేచి ఎక్కడకమ్మా అని అడుగుతాడు. మీ నాన్నగారికి టాబ్లెట్‌లు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అందరూ లేచి ఆమె ఏం చేస్తుందా అని చూస్తుంటారు. వెళ్లి నారాయణను నిద్రలేపి టాబ్లెట్ వేసుకోవాలని చెప్పగా.... అతను నాకు ఈ మందులు పనిచేయవని అంటాడు. దీంతో నారాయణను బెదిరించి మరీ మహాలక్ష్మీ టాబ్లెట్లు వేస్తుంది. అది చూసిన ఇంట్లో అందరూ నవ్వుకుంటారు.మళ్లీ తమకు ఏం తెలియనట్లు వెళ్లి పడుకుంటారు.
ఇంత మంచి అమ్మాయి మన ఇంటికి రావడం ఎంతో అదృష్టమని చక్రి అంటాడు. అటు గాయత్రి మాత్రం మాధవ్‌ను తలచుకునే చాలా బాధపడుతుంటుంది. ఇంతలో వాళ్ల నాన్న వియ్యాలవారి ఇంటికి వెళ్లి వచ్చి వచ్చే ముహూర్తానికే పెళ్లి చేద్దామని వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని చెబుతాడు. అయితే ఖచ్చితంగా అదే ముహూర్తానికి పెళ్లి చేద్దామని తాయరు కూడా అంటుంది.
మళ్లీ తెల్లవారుజామున మహాలక్ష్మీ నిద్రలేచి నారాయణకు ట్యాబ్లెట్లు ఇచ్చి వెనక్కి వచ్చేప్పుడు చూస్తే....మాధవ్ అక్కడ కనిపించడు. పెద్ది ఏమయ్యాడని వెతుకుతుండగా...పెరటిలో గాయత్రితో తెల్లవారుజామున మాట్లాడుతూ కనిపిస్తాడు. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ గాయత్రి ఏడుస్తూ తన బావకు చెబుతుంది. నాకు ఏమాత్రం ఆ పెళ్లి ఇష్టంలేదని చెబుతుంది. ఇది మనం ఊహించిన విషయమే కదా అని మాధవ్ ఆమెకు సర్దిచెబుతాడు. చిన్నప్పటి నుంచి నాకు కూడా నువ్వంటే ఇష్టమేనని అయినా నా తమ్ముళ్ల కోసం నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని చెబుతాడు. ఒకవేళ ఈ ఆస్తిలో మీకు వాటా రాసిచ్చినా...మీ అమ్మ నాకు ఇచ్చి నిన్ను పెళ్లి చేయదని అంటాడు. కాబట్టి మనం కలిసి ఉండటం అనేది ఈ జన్మలో జరిగేది కాదని అంటాడు.
మనం లేచిపోయి పెళ్లిచేసుకుందామని గాయత్రి కోరగా...అలా అమ్మాయిని తీసుకొచ్చినందుకే మానాన్న కత్తిపోట్ల వరకు వెళ్లాల్సి వచ్చిందని మాధవ్ అంటాడు. నిన్ను తీసుకుని వెళ్తే మీవాళ్లు ఖచ్చితంగా వెతికిమరీ నిన్ను చంపేస్తారని చెబుతాడు.మా తమ్ముళ్లను జైలుకు పంపిస్తారని...ఏ పాపం తెలియని మహాలక్ష్మీ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని నచ్చజెబుతాడు. ఇక ఈ జన్మకు ఇంతేనని అంటాడు.ఇకపై కూడా నువ్వు నన్ను కలుసుకోవడానికి రావొద్దని ఇదే మనం కలిసే ఆఖరి కలయిక అని చెబుతాడు. ఆ మాటాలన్నీ విన్న మహాలక్ష్మీ చాలా బాధపడుతుంది. ఈ ఇంటికోసం ఇంత చేసిన పెద్దికి తాను ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదనుకుంటుంది.
తెల్లారిన తర్వాత మంచంపై నారాయణ లేకపోవడంతో మహా కంగారుపడగా...అప్పుడే బయట నుంచి సైకిల్‌పై వస్తున్న నారాయణను చూసి కోపంతో తిడుతుంది. గాయం పూర్తిగా మానకముందే సైకిల్ వేసుకుని ఎక్కడికి వెళ్లావని నిలదీస్తుంది. నా అవసరాలు నాకు ఉంటాయని అంటాడు. గాయం మానేవరకు అలాంటివి మానేయమని చెప్పి సైకిల్‌కు తాళం వేసి తాళం చెవి తీసుకుంటుంది. ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తుండగా....మాదవ్ పనికి వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. అతను వెళ్లిపోయిన తర్వాత మహా అందరినీ తీసుకుని పెరటిలోకి వెళ్లి మాట్లాడుతుంది. తెల్లవారుజామున గాయత్రి వచ్చిందని...వాళ్లిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారని అంటుంది. ఆ విషయం మాకు చిన్నప్పటి నుంచి తెలుసని అంటారు. అయితే ఈ ఇంటి కోసం ఇంత చేసిన మీ అన్నయ్య కోసం మీరు ఏం చేయరా అని మహా నిలదీస్తుంది. వాళ్లిద్దరూకు పెళ్లి చేయడానికి మనం ఏదైనా చేయాలని అనగా....ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పమని చక్రితోపాటు మిగిలినవాళ్లంతా అంటారు.
