Podharillu Serial Today Episode: గాయత్రితో పెళ్లి చెడిపోవడంతో మాధవ్ చాలా బాధపడుతుంటాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటాడు. అన్నం,కూరలు కూడా సరిగా చేయలేకపోతుంటాడు. ఇదంతా చూసిన చక్రి మాధవ్‌ను బయటకు తీసుకెళ్తాడు. సరదాగా రోడ్డుపై నడుచుకుంట వెళ్తుండగా.. గాయత్రి ఎంగేజ్‌మెంట్ కోసం వాళ్ల మామయ్య,పెదనాన్న కలిసి ఏర్పాట్లు చేస్తుండగా చక్రి చూసి వెళ్లి చెడగొడదామని అంటాడు. వాళ్ల జోలికి మనం వెళ్లొద్దని మాధవ్ ఆపుతాడు. ఇంతలోనే మేడపై నుంచి గాయత్రి మాధవ్‌ను చూస్తుంది. మాధవ్ కూడా గాయత్రిని చూసి మరింతగా బాధపడి ఇంటికి వెళ్లిపోతాడు. అందరూ కలిసి అన్నం తింటుండగా....కన్నా కూరలో ఉప్పు ఎక్కువ వేశావేంటని మాధవ్‌ను అడుగుతాడు.చూసుకోకుండా పడిపోయిందిలేరా అని మాధవ్ సర్దిచెప్పగా...మహా అందిరపైనా గుడ్లు ఉరిమిచూస్తుంది. ఒక్కరోజు వంటసరిగా లేకపోతే తినలేరా అని మండిపడుతుంది. దీంతో అందరూ నోరుమూసుకుని అన్నం తింటుంటారు. మాధవ్ మాత్రం నోటి దగ్గర ముద్ద పెట్టుకోగానే....గాయత్రి గుర్తుకు వచ్చి లేచి వెళ్లిపోతాడు.
మాధవ్ బాధ చూడలేకపోయిన తండ్రి నారాయణ....కొడుకుని పిలిచి మందుతాగమని అడుగుతాడు.బాధలన్నీ మర్చిపోవడానికి ఇదే సరైన మందని చెబుతాడు. తనకు తాగుడు అలవాటు లేదని చెప్పినా వినకుండా నారాయణ బలవంతంగా మాధవ్‌కు మందు తాగిస్తాడు. ముందు కొంచెం మందు తాగిన మాధవ్...ఆ తర్వాత ఇంకా కావాలంటూ అడిగి మరీ తాగుతాడు. తాను గాయత్రిని ఎంతలా ప్రేమించింంది చెప్పి బాధపడుతుంటాడు. ఇంతలో పెద్ది కనిపించకపోవడంతో మహా ఇంట్లో వెతుకుతూ కన్నాను అడుగుతుంది.
కొంపదీసి మీనాన్నతో కలిసి మందు తాగడం లేదు కదా అని అంటుంది. మా అన్నయ్యకు అసలు మందు వాసన అంటేనే పడదని....ఎట్టిపరిస్థితుల్లోనూ మందు తాగడని చెబుతాడు. అలా వెతుక్కుంటూ వెళ్లగా....తండ్రితో కలిసి మందు తాగుతున్న పెద్దిని చూసి మహా మండిపడుతుంది. కొడుకుకు దగ్గర ఉండి తాగిస్తున్న నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.బాధపడేనాళ్లంతా మందుకు అలవాటుపడితే....ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ తాగుబోతులే అవుతారని కోప్పడుతుంది. కన్నా వాళ్ల అన్నయ్యను తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు.
బయటకు వెళ్లిన చక్రి, కేశవ్‌కు మహా ఫోన్‌చేసి విషయం చెప్పడంతో వారు పరుగున ఇంటికి వస్తారు. మీ నాన్న మాధవ్ అన్నయ్యకు మందు తాగించారని చెప్పడంతో కోపంతో మాధవ్ దగ్గరకు వెళ్తారు. అప్పటికే నిషా బాగా ఎక్కేసిన మాధవ్..గాయత్రి గురించి చెప్పుకుంటూ బాధపడుతుంటాడు. గాయత్రి అంటే తనకు ఎంత ఇష్టమో...చిన్నప్పటి నుంచి తనను ఎలా ప్రేమించాడో చెబుతాడు.అలాగే ఎలాంటి కల్మషంలేని గాయత్రి ప్రేమ అన్నా...తన మాటలు అన్నా అంతే ఇష్టమని చెబుతాడు. చిన్నప్పటి నుంచి గాయత్రి తనను ఎంతలా ప్రేమించిందో గుర్తుచేసుకుంటాడు. తను పెరటి గుమ్మం నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందోనని ఎదురుచూసినట్లు చెబుతాడు.
ఏదీఏమైనా ఈ గొడవలన్నీ సర్దుకుని గాయత్రిని తనకే ఇచ్చి పెళ్లిచేస్తారని అనుకున్నానని...కానీ మా దుబాయ్ మామయ్య ఇలా చేస్తాడని అనుకోలేదని అంటాడు. గాయత్రి పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి ఎన్నోరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని గాయత్రి మీద తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆ మాటలు విన్న ముగ్గురు అన్నదమ్ములు మాధవ్‌ను పట్టుకుని ఏడుస్తారు.ఇదంతా చూసిన మహాలక్ష్మీ ఎంతో బాధపడుతుంది. అన్నదమ్ములు మాధవ్‌ను ఓదార్చి...ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెడతారు.
మహాలక్ష్మీ బయట ఉండి బాధపడుతుంటే....చక్రి ఆమె దగ్గరకు వచ్చి ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందని చెబుతాడు. అతని మాటలు పూర్తికాకుండానే మహా పిచ్చితిట్లు తిడుతుంది. మీ అన్నయ్య తాగితే నీకు ఆనందంగా ఉందా అని నిలదీస్తుంది. పైగా డ్యాన్స్ చేయాలని ఉందా అని అంటుంది.అసలు నీకు మెదడులేదని అర్థమవుతుందని తిట్టిపోస్తుంది. ఏదీ ఏమైనా చిన్నప్పటి నుంచి మా అన్నయ్య గుండెల్లో దాచుకున్న బాధ మొత్తం ఇవాళ బయటకు కక్కేశాడని అంటాడు. మా అందరితో చెప్పుకుని తన గుండెలపై ఉన్న భారం దించేసుకున్నాడని అంటాడు. అందుకే నాకు సంతోషంతో డ్యాన్స్ చేయాలని ఉందని అంటాడు. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావని అనుకోలేదంటూ చక్రిని మహా మెచ్చుకుంటుంది.
