Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఏడుస్తుంటే సత్యమూర్తి వెళ్లి దేవాకి విషయం అడుగుతాడు. చెప్పు నాన్న ఏమైంది దేవా.. చీకటి దుఃఖం రెండూ ఒకటేరా.. నువ్వు మోయలేని అంత బాధ పెంచుకోకురా దయచేసి ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతారు.
సత్యమూర్తి అలా అడిగే సరికి దేవా నాన్న అని సత్యమూర్తిని పట్టుకొని ఏడుస్తాడు. సత్యమూర్తి కొడుకుతో ఇంత బాధకి కారణం ఏంట్రా అని అడిగితే దేవా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు మిథున అత్తారింటికి వెళ్లాలి అని బయల్దేరుతుంది. ఎంత మంది ఆపాలి అని ప్రయత్నించినా నేను వెళ్లాలి అని అంటుంది. హరివర్ధన్ ఎంత ఆపాలని ప్రయత్నించినా మిథున వినదు.. నేను కోలుకునే వరకు అక్కడే ఉన్న దేవా సడెన్‌గా కనిపించకుండా వెళ్లిపోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చూస్తుంటే నాకు టెన్షన్‌గా ఉంది. నేను అంటే అంత ప్రేమ ఉన్నవాడు ఇంత వరకు నన్ను చూడటానికి రాలేదు అంటే ఏమైందో ఏంటో అని అందర్నీ కాదు అని వెళ్లాలి అంటుంది. నన్ను ఆపితే నాకు ఆ దిగులుతో ఏదో ఒకటి అవుతుంది దయచేసి నన్ను ఆపొద్దు అని వెళ్లిపోతుంది.
మిథునని ఆపలేకపోయానని హరివర్ధన్ ఏడుస్తాడు. నీకేం అవుతుందో అని భయంతో దేవాని దూరం చేయగలిగాను కానీ నిన్ను ఆపలేకపోయాను. నా భయం మళ్లీ మొదటికి తీసుకొచ్చావ్ కదమ్మా అని ఏడుస్తాడు.
దేవాని శారద పిలుస్తుంది. నీకు బుద్ధి ఉందా.. మిథునకు దగ్గరగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని తిడుతుంది. దేవా మనసులో నాకు మిథునని చూడాలని దగ్గరుండి చూసుకోవాలని అని ఉంది కానీ నాకు ఆ అదృష్టం లేదని అనుకుంటాడు. సత్యమూర్తి కొడుకుతో అంత పెద్ద ప్రమాదం నుంచి కోలుకున్న మిథునని చూడాలి అని నీకు లేదారా.. అసలు వెళ్లడమే లేదు అని అంటాడు. ఏదో జరిగింది అని అనుమానం ఉందని కాంతం, రంగం అంటారు. ఇక సత్యమూర్తి, శారదలు దేవా ఎంత వద్దు అన్నా మిథున ఇంటికి వెళ్లి మిథునని పలకరించాలని తీసుకెళ్తుంటారు.
దేవాని తల్లిదండ్రులు మిథున దగ్గరకు తీసుకెళ్లాలని బయటకు వచ్చేలోపు మిథున ఎంట్రీ ఇస్తుంది. మిథునని చూసి దేవా చాలా సంతోషపడతాడు. పరుగున మిథున దగ్గరకు వెళ్లబోయి మామ మాటలు గుర్తు చేసుకొని ఆగిపోతాడు. శారద, సత్యమూర్తి, ప్రమోదిని, ఆనంద్ అందరూ మిథున దగ్గరకు వెళ్లి మిథునతో మాట్లాడుతారు. అందరూ మథునతో మాట్లాడుతున్నా మిథున మాత్రం దేవానే చూస్తుంటుంది.
దేవా మిథునని చూసి వెళ్లిపోయి ఓ మూలకు వెళ్లి ఏడుస్తాడు. దేవా తనని అవాయిడ్ చేయడం చూసి మిథున కంగారు పడుతుంది. శారద వాళ్లు మిథునకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు. రెండు సార్లు ప్రమాదం దాటుకొని వచ్చావ్ ఇక మీ బంధానికి ఏ అడ్డు ఉండదమ్మా.. నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి ఉంటారని శారద అంటుంది. ఆ మాటలు విన్న దేవా మనసులో నాకు ఆ అదృష్టం లేదమ్మా మా బంధం తెగిపోయింది అని ఏడుస్తాడు. మిథున తన వైపు రావడం చూసిన దేవా మిథునకు కనిపించకుండా దాక్కుంటాడు.
హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమకు చాలా పవర్ ఉంది. దేవా నాకు ఇచ్చిన మాట మీద ఉంటాడా..లేదంటే తన మనసులో ప్రేమను చెప్పేస్తాడా అనుకుంటాడు. దేవా మిథునని తలచుకొని నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు మిథున.. ఈ బాధ భరించడం నా వల్ల కాదు.. నీకు దూరం అవ్వడం అంటే నా ప్రాణాలు పోవడమే అని అనుకుంటూ ఏడుస్తాడు. ఇక హరివర్ధన్ దేవా తనకి ఇచ్చిన మాట తప్పడు అని అనుకుంటాడు.
లలిత భర్త దగ్గరకు వచ్చి ఏదో జరిగింది అని మీకు అనిపించడం లేదా.. మిథున కోసం అంత తపన పడిన దేవా ఇప్పటి వరకు మిథునని చూడటానికి రాలేదు. మిథునని దగ్గరుండి చూసుకోకుండా ఉండలేని వాడు.. మిథునని చూడటానికి ఇక్కడికి రాకుండా.. మిథున ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం వెనక ఏదో జరిగింది అని మీకు అనిపించడం లేదా.. చెప్పండి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న త్రిపుర ఆదిత్య అలా అన్నాడు అత్తయ్య అంతలా అడుగుతున్నా మామయ్య ఏం చెప్పకపోవడం వెనక ఏదో ఉందని అనుకుంటుంది.
దేవా ఒంటరిగా బాధ పడుతూ ఉంటే మిథున వచ్చి వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. దేవా అలా రాయిలా నిల్చొండిపోతాడు. మిథున దేవాతో నీ ప్రేమే నన్ను బతికించింది దేవా.. నేను బతకాలి అని నిప్పుల మీద నడిచావ్ మరి నీకు నా మీద అంత ప్రేమ ఉంటే నన్ను నీకు ఆ దేవుడు దూరం చేస్తాడా చెప్పు.. ఇది మన కొత్త ఆరంభం అని మా నాన్న నిన్ను అల్లుడిగా అంగీకరించేశాడు. ఆ విషయం మా నాన్న అమ్మతో చెప్తుంటే విన్నాను.. నాకు ఇలా జరగకపోయి ఉంటే ఆ రోజు మా నాన్న అందరి ముందు నువ్వు అల్లుడు అని చెప్పేవారు.. నువ్వు కూడా నాకు ఐలవ్యూ అని చెప్పేవాడివి.. ఇక మన ప్రయాణంలో సంతోషం తప్ప అవరోధాలు ఉండవు అని దేవా భుజం మీద వాలిపోతుంది. దేవా ఏడుస్తూ పక్కకి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.