Nuvvunte Naa Jathaga Serial Today భాను తన వాళ్లని తీసుకొని పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకోవడానికి దేవా ఇంటికి వెళ్తుంది. అందరూ ఇలా వస్తున్నారు ఏంటి.. పైగా పంతులు కూడా ఉన్నారేంటి అని కాంతం వాళ్లు కంగారుగా వెళ్తారు. ఏంటి వదినా ఇదంతా అని శారద రేణుకని అడిగితే మా భానుకి మీ దేవాకి నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేయడానికి అని చెప్తుంది.
సత్యమూర్తి, శారద అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావ్ రేణుక అని శారద అడిగితే దేవా నా కూతురికి మాటిచ్చాడు కదా అని అంటుంది. వాడో ఏదో అంటే మీరు మాతో కనీసం ఓ మాట కూడా అనకుండా ఇలా రావడం ఏంటి అని అడుగుతుంది. ఇంతలో దేవా వస్తాడు. మనం మనం మాట్లాడుకోవడం ఎందుకు మాట ఇచ్చినవాడు వచ్చాడు కదా తనే చెప్తాడు. అల్లుడు నా కూతురిని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు కదా.. నువ్వే చెప్పు అని రేణుక అంటుంది.
సత్యమూర్తి కోపంగా ఏంట్రా ఇదంతా.. నువ్వేం చేస్తున్నావో నీకు అయినా అర్థమవుతుందా.. నీ వల్ల ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అర్థమవుతున్నాయో అని అడుగుతాడు. ఒక్క నిమిషం నాన్న అని దేవా భానుకి సారీ చెప్తాడు. సారీ ఎందుకు రాజా అని భాను అంటే మిథున మీద కోపంతో మిథున నోరు మూయించడానికి ఇలా చెప్పాను అంతే కానీ నీ మీద ప్రేమ కాదు అని దేవా అంటాడు. భాను షాక్ అయిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అని అంటాడు. ఏంటి నన్ను పెళ్లి చేసుకోవాలి అని అబద్ధం చెప్తున్నావా.. నేను ఎలా కనిపిస్తున్నానురా.. అని అంటుంది. నీ వెనక తురుగుతున్నా అని అంత చులకన అయిపోయానారా.. ఆడపిల్ల జీవితం నీకు అంత అలుసుగా ఉందారా.. అని అంటుంది. నీకు బాధ పెట్టినందుకు సారీ అని దేవా అంటే నాది బాధ కాదురా చచ్చిపోవాలి అనుకునేంత అవమానం.. అని అంటుంది.
నిన్నే ఊహ తెలిసినప్పుటి నుంచి ప్రేమించా.. కానీ మిథునని పెళ్లి చేసుకొని వచ్చి నా గుండె ముక్కలు చేశావు.. ఇప్పుడు మరో సారి నా గుండె ముక్కలు చేసేశావ్.. అందరికి నా రాజాతో నా పెళ్లి అని చెప్పానురా ఇప్పుడు అందరూ అడిగితే ఏం చెప్పాలి అని ఏడుస్తుంది. భాను తల్లి కూడా భానుని తిడుతుంది. నీ మాటలు నమ్మి పిచ్చిదాన్ని అవ్వడం కంటే చావే నయం అని భాను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఒంటి మీద పెట్రోల్ పోసుకుంటుంది. అందరూ ఆపాలని చూసినా ఆగదు. ఇంతలో దేవా వచ్చి లాగిపెట్టి కొడతాడు. భాను చాలా ఏడుస్తుంది. మా అమ్మ నాకు ఎన్ని సంబంధాలు చూసినా నిన్నే చేసుకుంటా అని చెప్పా.. నా బిడ్డకు పెళ్లి అవుతుంది అని అందరికీ చెప్తుంది. ఇప్పుడు మా అమ్మకి కూడా చావు తప్పా ఇంకో దారి లేదు.. నిన్ను ప్రేమించిన పాపానికి మా అమ్మని పొట్టన పెట్టుకోవాలా అని అడుగుతుంది.
దేవా భానుతో నేను చెప్పేది అర్థం చేసుకోకుండా ఏంటి ఈ పిచ్చి పనులు అని అడిగితే సత్యమూర్తి లాగిపెట్టి కొట్టి ఏంట్రా అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల జీవితం అంటే నీకు అంత అలుసు అయిపోయిందా.. ఆ అమ్మాయి చావాలని అనుకుంటుంది. బంగారం లాంటి ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని ఆ తండ్రి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం నాశనం చేయాలి అని చూస్తున్నావ్. ఎంత మంది అమ్మాయిల ఉసురు పోసుకుంటావురా.. తనని పెళ్లి చేసుకుంటా అని నువ్వు తనకి మాటివ్వడం వల్లే కదరా ఇదంతా.. నువ్వు మాట ఇవ్వకపోతే వీళ్లు మన ఇంటికి వచ్చేవాళ్లా.. తను మన నట్టింట్లోనే ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటుందా అని అడుగుతాడు. ఇంకోసారి ఇలా జరగదు అని దేవా అంటాడు. అలా జరగకూడదు అంటే నువ్వు భానుని పెళ్లి చేసుకోవాలి అని సత్యమూర్తి అంటాడు.
భానుని వెంటనే పెళ్లి చేసుకో అని చెప్తాడు. నువ్వు భానుని పెళ్లి చేసుకొని తీరాలి.. లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని సత్యమూర్తి అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. రేపే దేవాకి, భానుని గుడిలో నిశ్చితార్థం అని సత్యమూర్తి చెప్తాడు. తన నిర్ణయాన్ని అందరూ పాటించాలి తీరాలి అని అంటారు. ప్రమోదిని వెంటనే మిథునకు కాల్ చేస్తుంది. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.