Lakshimi Raave Maa Intiki Serial Today February 25th:గోపీతో సింధూజాక్షి విడాకులు తీసుకోవాలనుకుంటున్న విషయం వాళ్ల అత్తకు తెలిసిపోయిందా..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 25 th: గోపీతో సింధూజాక్షి విడాకులు తీసుకోవాలనుకుంటున్న విషయం వాళ్ల అత్తకు తెలిసిపోయిందా..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ శ్రీలక్ష్మీకి బాగా కలిసొస్తుంది. వాళ్లు మ్యాడీని ర్యాంగింగ్ చేస్తుంటే....శ్రీలక్ష్మీ మాత్రం తనకు వచ్చిన అవకాశాలన్నీ వాడుకుని ఆనందిస్తుంది. శ్రీలక్ష్మీని బైక్‌పై ఎక్కించుకుని మూడు రౌండ్లు కొట్టమనడంతో చేసేది లేక మ్యాడీ వాళ్లు చెప్పినట్లు చేస్తుంటాడు. అది చూసి త్రిషతోపాటు ఆమె స్నేహితులు ఎంతో కోప్పడతారు. బైక్ దిగి క్లాస్‌రూమ్‌లోకి వెళ్తుండగా శ్రీలక్ష్మీని కిందపడేసేందుకు త్రిష తనకాలు అడ్డుపెడుతుంది. అంతే శ్రీలక్ష్మీ కిందపడిపోతుండగా మ్యాడీ ఆమెను ఒడిసిపట్టుకుంటాడు.అది చూసిన త్రిషకు కోపం మరింత ఎక్కువవుతుంది. అలాగే క్లాస్‌రూమ్‌లోకి వెళ్లిన తర్వాత....త్రిష అందరికీ చెబుతుంది ఆ ఎర్రబస్సుకు ఎవరూ చోటు ఇవ్వొద్దని అనడంతో అందరూ సరేనంటారు. శ్రీలక్ష్మీ క్లాస్‌రూమ్‌లోకి రాగానే...అందరూ ఆమెకు చోటు ఇవ్వకుండా గేలి చేస్తుండగా....ఇది ఆ త్రిష పనేనని కనిపెట్టిన లక్ష్మీ పాము వచ్చిందంటూ అరడంతో అందరూ భయపడిపోయి బెంచీలు వదిలేసి పరారవుతారు.దీంతో శ్రీలక్ష్మీ గట్టిగా నవ్వి...పాములేదు ఏం లేదని చెబుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన త్రిష..ఇది పల్లెటూరు కాదని నీ లిమిట్స్‌లో నువ్వు ఉండని హెచ్చరించడంతో శ్రీలక్ష్మీ కూడా ఆమెకు అదే స్థాయిలో వార్నింగ్ ఇస్తుంది. నా జోలికి రాకుండా నీ లిమిట్స్‌లో నువ్వు ఉంటే మంచిదని హెచ్చరిస్తుంది.
పెద్దయ్య రమ్మనడంతో గోపి,సింధూజాక్షి హైదరాబాద్ బయలుదేరుతుంటారు.సింధూ ఎంతో ఆనందంగా ఉండటం చూసి గోపికి ఏం అర్థం కాదు. నీతో పెళ్లి అంటేనే వద్దన్న దాన్ని ఇప్పుడు 16 రోజుల పండుగకు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నావా అని సింధూ గోపిని అడుగుతుంది.ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్లిన తర్వాత మన విడాకులకు అప్లై చేయబోతున్నామని అందుకే ఈ ఆనందమని అంటుంది. దీనికి గోపి అభ్యంతరం చెబుతాడు. 6 నెలల తర్వాత నేనే విడాకులు ఇస్తానని చెప్పాను కదా మరి ఇప్పుడు ఇదేంటని అంటాడు. పెళ్లైన నెలరోజులకే విడాకులకు అప్లై చేశామని తెలిస్తే పెద్దయ్య ఏమనుకుంటాడని అంటాడు. మనం ఇప్పుడు అప్లై చేసిన 6 నెలల తర్వాతే విడాకులు వస్తాయని...అప్పటి వరకు ఎదురుచూసి అప్పుడు అప్లై చేయడం సమయం దండగని అందుకే ఇప్పుడు మనం వెళ్లిన వెంటనే విడాకుల కోసం అప్లై చేస్తున్నామని సింధూజాక్షి చెబుతుంది.ఈ మాటలు విని గోపీ చాలా బాధపడతాడు. ఆరునెలల్లో నీ మనుసు మార్చి నా దానిని చేసుకుందామని అనుకుంటుంటే...నువ్వు మాత్రం విడాకులు గురించి ఆలోచిస్తున్నావ్ అని మనసులో అనుకుంటాడు. మనం ఎప్పుడైనా విడిపోవాల్సిందే కదా అందుకే హైదరాబాద్ వెళ్లిన వెంటనే విడాకులకు అప్లై చేద్దామని సింధూ అంటుండగా...అప్పుడే అక్కడేకి వచ్చిన గోపి వాళ్ల అమ్మతోపాటు చెల్లి కూడా ఈ మాటలు విని షాక్‌కు గురవుతారు. పెళ్లయి నెలరోజులు కూడా కావడం లేదు అప్పుడే విడాకులు ఏంటిరా అని నిలదీస్తుంది. అలాంటిదేమీ లేదని....ఊరు వెళ్తున్నాం కదా విడివిడిగా బట్టలు సర్దుకుందామని చెబుతోందని మీకు విడాకులులా వినిపించాయని అబద్దం చెప్పి తప్పించుకుంటాడు.
కాలేజీ అయిపోయిన తర్వాత శ్రీలక్ష్మీ ఇంటికి తిరిగి వెళ్లేందుకు మ్యాడీ బైక్ ఎక్కేందుకు ప్రయత్నించగా....ఆటోలో రమ్మని చెప్పి వెళ్లిపోతాడు. ముందుగానే ఇంటికి చేరిన మ్యాడీ శ్రీలక్ష్మీ వచ్చేవరకు బయటే ఉండి ఆమె వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ రేపు గోపి, సింధూ వస్తున్నారని వాళ్లకు 16 రోజుల పండుగ చేస్తున్నట్లు చెబుతాడు.అలాగే మీ ఇద్దరికి కూడా ఆ పండుగ చేయాలని నిర్ణయించామని కాబట్టి రేపు కాలేజీకి వెళ్లొద్దని చెప్పి ఏర్పాట్లు చూడాల్సిందిగా కొడుకులను ఆదేశించి బయటకు వెళ్లిపోతాడు. సూర్యనారాయణ మాటలకు చిర్రెత్తుకొచ్చి మ్యాడీ వాళ్ల అమ్మపై అరుస్తాడు. నేను ఏమైనా ఆటబొమ్మ అనుకుంటున్నారా అని నిలదీస్తాడు. తాతయ్య ఆయన ఇష్టానుసారం చెప్పుకుంటూపోతుంటే నువ్వు,నాన్న కనీసం మాట్లడటం లేదని మండిపడతాడు. అప్పుడే ప్రియంవద అసలు విషయం చెబుతుంది. రేపు కేవలం 16రోజుల పండుగ మాత్రమే చేయడం లేదని....నీకు,ఈ లక్ష్మీకి ఫస్ట్ నైట్ కార్యక్రమం చేయబోతున్నారని చెప్పడంతో మ్యాడీ మరింత మండిపడతాడు. చావనైనా చస్తాను గానీ ఈ శ్రీలక్ష్మీతో కలిసి ఉండేది లేదని తేల్చి చెబుతాడు.























