Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శ్రీధర్ కార్తీక్‌ని వీరేశలింగం అని అంటాడు. ఏంటి కొత్తగా పిలుస్తున్నావ్ అని కార్తీక్ అడిగితే ఊరెళ్లిపోతున్న ఆడవాళ్లని వెనక్కి తీసుకొస్తున్నావని.. బాధ్యతలు తీసుకుంటున్నావని అంటాడు. దీంతో కార్తీక్ పారు ఫోన్ చేసిందా అని అడుగుతాడు. దీంతో కాంచన ఎవరు చెప్తే ఏంటిరా నీ బిజీలో నువ్వు ఉంటావ్ నీకు ఇవి అవసరమా అని అడుగుతుంది. అయితే తాను అదంతా మానవత్వంతోనే చేశానని బదులు చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు.
సుమిత్ర: ఇప్పుడు నిన్ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు దీప. నీకు ఇంత అన్యాయం జరిగితే బాధ పడాలా.. లేక నాతో ఒక్క మాట కూడా చెప్పనందుకు తిట్టాలా. నేను నిన్ను సొంత కూతిరిలా అనుకుంటున్నా నేను నీకు పరాయిదాన్ని అయ్యానో అని బాధ పడాలా. లేదా నీ బాధలు ఎవరికీ చెప్పకుండా నువ్వే పడతాను అన్న నీ అమాయకత్వం చూసి జాలి పడాలా. చెప్పు దీప. ఇప్పుడు నిన్ను ఏమనాలో చెప్పు.
దీప: కావాలనే చెప్పలేదు అమ్మ. నన్ను వెనక్కి తీసుకురాకపోయి ఉంటే ఈ పాటికి మా ఇంటి దగ్గర ఉండేదాన్ని ఇక్కడ జరిగిందంతా ఈ రాత్రికే మర్చిపోయి. రేపు ఉదయాన్నే నా పాత జీవితాన్ని మొదలు పెట్టేదాన్ని. నా బిడ్డ మీద తప్ప నాకు ఇంకేం ఆశలు లేవమ్మా. ఇదంతా నా తల రాత.
సుమిత్ర: నువ్వు తల రాత అనుకుంటున్నావ్ కాబట్టే వాడు అలా రెచ్చిపోతున్నాడు.
అనసూయ: నా కొడుకు మీకు కూడా తెలుసా అమ్మ.
సుమిత్ర: తెలుసు. ఊరికెళ్లకపోతే చంపుతానని బెదిరించాడు నీ కోడలిని. నేను ఆరోజే అడిగాను నీకు నీ భర్తకి గొడవ ఏంటి అని దీప చెప్పలేదు. ఆ రోజే దీప ఈ నిజం చెప్తుంటే వాడిని అప్పుడే జైలుకి పంపేదాన్ని. ఇప్పుడైనా వదులుతాను అనుకుంటున్నారా. ఛీటింగ్ కేసు పెట్టి వాడిని జైల్లో పెడతా.
అనసూయ: అమ్మా మీకు దండం పెడతా అంత పని చేయకమ్మా.
సుమిత్ర: చూడండి మీ కోడలిని చూస్తుంటే మీకు జాలి వేయడం లేదు.
అనసూయ: దీని పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తుంది. వాడి మీద కోపం వస్తుంది. ఇప్పుడు మీరు పోలీస్ కేసు పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీపకు నేను న్యాయం చేస్తానమ్మా. రేపే దీపని తీసుకెళ్లి వాడికి బుద్ధి వచ్చేలా చేస్తాను.
దీప: చెప్తే వినే పరిస్థితిలో లేడు అత్తయ్య.
అనసూయ: వినకపోతే నాలుగు తగిలిస్తాను. లేదంటే నేనే జైలుకి వెళ్లి ఫిర్యాదు చేస్తాను.
దీప, అనసూయలు నర్శింహ ఇంటికి వస్తారు. దీపని చూసిన నర్శింహ దీపని నాలుగు తగించి ఇంటికి పంపుతానని కర్ర పట్టుకుంటాడు. దీప వెనకాలే ఉన్న తన తల్లిని చూసి షాక్ అయిపోతాడు. అమ్మకి దొరికితే చచ్చాను అని లోపలికి పరుగెత్తి తలుపు వేసేస్తాడు. అనసూయ తలుపు తన్ని కొడుకు మీదకు కర్ర తీసుకొని వెళ్తుంది.
నర్శింహ తల్లి కాలు పట్టుకొని వేడుకుంటాడు. ఇంతలో శోభ వచ్చి నర్శింహ తల్లి మీద ఫైర్ అవుతుంది. అనసూయ శోభని సోకులాడి అని తిడుతుంది. తన కొడుకును వలలో వేసుకున్నావని అంటుంది. తన్ని తగిలేస్తా నని అనసూయ శోభతో అంటే నేను నీ కొడుకు తాళి కట్టిన పెళ్లాన్ని అని చెప్తుంది.
అనసూయ: పెళ్లయి పిల్ల ఉన్న వాడిని వలలో వేసుకోవడానికి నీకు సిగ్గులేదానే.
శోభ: ఆ ముక్క అడగాల్సింది నన్ను కాదు నీ కొడుకుని. మీ అమ్మ అడుగుతుంది కదా. నన్ను ఎన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నావో చెప్పు. అమ్మని చూస్తుంటే మాటలు రావడం లేదా. నువ్వు లేకపోతే చస్తాను అని నీ కొడుకు నా వెంట పడ్డాడు. పెళ్లికి మీ వాళ్లు ఒప్పుకుంటారా అంటే మా అమ్మా బాబు చచ్చారు. నాకు వెనకా ముందు ఎవరూ లేరు అన్నాడు.
నర్శింహ: అమ్మా దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఏదో రెండు అబద్దాలు ఆడాను అంతే.
అనసూయ: అబద్దాలు ఆడావు సరే మరి దీని బతుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావ్ రా. అప్పులోళ్లని మాకు తగిలించి ఇప్పుడు దీన్ని తగులుకున్నావా. చెప్పరా ఇప్పుడు దీపకి ఏం సమాధానం చెప్తావో చెప్పు.
నర్శింహ: దాన్ని వద్దు అనుకునే కదా వచ్చింది. నీ గోల పడలేకే దాన్ని పెళ్లి చేసుకున్నా. దానితో నేను కాపురం చేయలేను. అది తప్పులు చేసిందే.. దీప మంచిది కాదమ్మా. అది దర్జాగా ఇంకొకడితో తిరుగుతుంది.
దీప నర్శింహ కాలర్ పట్టుకుంటుంది. వాడిని చెప్పుతో కొట్టాలి అంటుంది. తాను చెప్పేది నిజం అని నర్శింహ అంటాడు. దాంతో దీప నీ బతుకే ఓ అబద్దం ఇంక నువ్వు నిజాలు చెప్తావా అని అడుగుతుంది. దీంతో అనసూయ వాడికి మాట్లాడనిద్దాం అని అంటుంది.
నర్శింహ: నేను తప్పు చేశాను అమ్మ. రెండు మూడు నెలల్లో అప్పులు తీర్చాలి అనుకున్నా. ఇంతలో దీప వచ్చింది. జరిగింది చెప్పి దాని చేతులు పట్టుకున్నాను.
దీప: అబద్ధాలు చెప్తున్నాడు అత్తయ్య.
నర్శింహ: కూతుర్ని తీసుకొని ఊరు వెళ్లవే నేను వస్తాను అన్నాను. కానీ నాతో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాతే నాకు తెలిసింది దీప ఎవరో డబ్బున్నోడితో సంబంధం పెట్టుకుంది.
దీప: సంబంధం అంటకట్టావ్ అంటే బాగుండదు చెప్తున్నా.
నర్శింహ: అమ్మా వాడితో దీప కారులో తిరగడం నేను చూశాను. వాడు దీపనే కాదమ్మా నా కూతుర్ని కూడా వేసుకొని తిరుగుతున్నాడు. ఊరికి పోకుండా నీకు ఇవేం పనులు అన్నందుకు వాడితో నన్ను కొట్టించింది. కావాలి అంటే దీపని అడుగు. నేను తప్పుగా మాట్లాడితే నా పెళ్లాం నన్ను అడగాలి కానీ వాడు ఎవడమ్మా నన్ను కొట్టడానికి. ఇదంటే ఇష్టం ఉండబట్టే కదా నన్ను కొట్టాడు.
దీప: నర్శింహా..
నర్శింహ: ఊరు పొమ్మంటే వాడి ఇంట్లోనే తిష్ట వేసింది. వాళ్ల ఇంటికి కూడా వెళ్లి ఊరు వెళ్లమని అంటే అప్పుడు కూడా ఓ పెద్దావిడతో నన్ను కొట్టించిందమ్మ.
ఇక ఆ విషయాలు ఇప్పుడు తెలియడంతో శోభ నర్శింహని నిలదీస్తుంది. దీంతో అనసూయ శోభతో గొడవ పడుతుంది. వాడి సంపాదన తింటూ నా కొడుకుమీద అరుస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. దీంతో శోభ నాకేం తక్కువ మా అమ్మ వీడితో పెళ్లి చేసి కోటి రూపాయల ఇళ్లు ఇచ్చిందని అంటుంది. దాంతో అనసూయ షాక్ అయిపోతుంది. పది లక్షలు పెట్టి నీ కొడుకుకు ట్యాక్సీ కొనిపెట్టిందని.. ఇంకో పది లక్షలతో నాకు నగలు కూడా చేయించిందని చెప్తుంది శోభ. దీంతో అనసూయ దగ్గరకు వెళ్లి శోభ నగలని దగ్గరగా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.