Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తాను చేసిన మట్టి అమ్మవారి విగ్రహం పోయిందని ఏడుస్తుంది. లక్ష్మీతో విహారి నీకు అమ్మవారి విగ్రహం కావాలి అంతే కదా నేను తీసుకొస్తా  అని అంటాడు. ఎలా తీసుకొస్తారు అని లక్ష్మీ అంటే నీపై నాకు ఉన్న ప్రేమ నీ బాధ, నీ కన్నీరు చూడలేదు ఎలా అయినా అమ్మవారి విగ్రహం తీసుకొస్తా అని విహారి బావిలోకి దూకేస్తాడు.

లక్ష్మీ విహారి గారు విహారి గారు అనడంతో అందరూ అక్కడికి చేరుకుంటారు. ఏంటి ఏదో నీళ్లలో పడినట్లు సౌండ్ వచ్చింది అని అడుగుతారు. లక్ష్మీ  ఏడుస్తూ విహారి గారు అమ్మవారి విగ్రహం బావిలో ఉందని అందులోకే దూకేశారు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పద్మాక్షి కోపంగా ఓసేయ్ నిన్న రాత్రి బావిలో పడిన మట్టి విగ్రహం ఇంకా ఉంటుందా.. బుద్ధి ఉందా నీకు అని తిడుతుంది. బావకి ఏమైనా అయితే నిన్ను అందులో తోసేసి జల సమాధి చేస్తా అని సహస్ర లక్ష్మీకి వార్నింగ్ ఇస్తుంది. 

ఇంతలో పని మనిషి వచ్చి ఆ బావి లోతు ఎక్కువ ఎవరు పడినా రారు అని అంటుంది. అందరూ కంగారు పడి దేవుడిని మొక్కుకుంటారా. ఇంతలో విహారి గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతో బయటకు వస్తాడు. అందరూ చాలా సంతోషపడతారు. చారుకేశవ బావి తాడు లాగి విహారిని పైకి లాగుతాడు. నీ మీద ఆశలు పెట్టుకొని ఎంత మంది బతుకుతున్నాం.. ఇంటి పని మనిషి మట్టి విగ్రహం కనిపించడం లేదని చెప్తే బావిలోకి దూకేస్తావా అని పద్మాక్షి కోప్పడుతుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దని అందరూ విహారికి చెప్తారు.

విహారి చేతిలో ఉన్న అమ్మవారి విగ్రహం అందరూ చూసి ఇది గుడిలో విగ్రహం కదా మన బావిలోకి ఎలా వచ్చింది అని అనుకుంటారు. పనివాళ్లు వెళ్లి ఊరి వారితో విగ్రహం దొరికిందని చెప్తారు. లక్ష్మీ ఆ విగ్రహం తీసుకొని వెళ్లి పూజ పెట్టుకుంటుంది. ప్రకాశ్ వీర్రాజుకి కాల్ చేసి విషయం చెప్పడంతో వీర్రాజు షాక్ అయిపోతాడు. వెంటనే ఏం చేయాలో తెలుసు కదా అది చేయ్ అంటాడు. లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి పూజ పెట్టుకుంటుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమ్మా నువ్వు చేసిన మట్టి విగ్రహం పోవడంతో స్వయంగా ఆ అమ్మే నీ దగ్గరకు వచ్చిందని వసుధ, చారుకేశవ అంటారు. 

లక్ష్మీ అమ్మవారికి దండ వేసి పూజ మొదలు పెట్టే టైంకి ఊరి జనం వస్తారు. పంతులు అందరితో అమ్మవారి విగ్రహాన్ని గుడికి తీసుకెళ్తా అంటే లక్ష్మీ ఆపుతుంది. అమ్మవారికి పూజ చేయాలని నేను మట్టి విగ్రహం చేస్తే దాని స్థానంలో అమ్మవారు నా దగ్గరకు వచ్చారు.. నేను పూజ చేసుకొని నేనే స్వయంగా అమ్మవారిని ఇస్తాను అంటుంది. అమ్మవారి విగ్రహం లేకుండా గుడి ఉండకూడదు అమ్మ అవసరం అయితే అక్కడే పూజలు చేసుకో అమ్మా అని పంతులు అంటే నేను ఇవ్వను మీరు ఏమైనా అనుకోండి అని లక్ష్మీ అంటుంది. పద్మాక్షి తీసుకెళ్లమని చెప్పడంతో పంతులు తీసుకెళ్లే టైంకి పోచమ్మ వస్తుంది. నేను పూజ చేసుకుంటా అని లక్ష్మీ అంటే ఊరి జనం అలా కాదని చెప్తే అర్థం కాదా అని అంటారు. దానికి పోచమ్మ లక్ష్మీ చేతిలో పూజ చేయించుకోవాలని అమ్మవారు ఇక్కడి వరకు వచ్చారు లక్ష్మీ పూజ చేసిన తర్వాత  మనం ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అని చెప్తుంది. 

లక్ష్మీ సంతోషంగా పూజ చేసుకుంటుంది. అందరికీ హారతి ఇస్తుంది. పోచమ్మ లక్ష్మీతో ఎంత చక్కగా అమ్మకి పూజ చేశావో అంతే శ్రద్ధగా అమ్మవారు నేలకు తాకకుండా గుడి వరకు చేరాలి జాగ్రత్తగా తీసుకురామ్మా అని పోచమ్మ చెప్పడంతో లక్ష్మీ అమ్మవారిని పట్టుకుంటుంది. లక్ష్మీ వెనక అందరూ వెళ్తారు. ఇంతలో ఎదురుగా వీర్రాజు మరికొంత మంది ఊరిజనాన్ని పెద్దల్ని తీసుకొని వస్తారు. అమ్మవారి విగ్రహం మీ ఇంటి బావిలోకి ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తారు. మీ వాళ్లే విగ్రహం దొంగతనం చేశారని వీర్రాజు పద్మాక్షి వాళ్లతో అంటాడు. మొత్తం కుటుంబం మీద నింద వేస్తారు. సాక్ష్యం లేకుండా దొంగలు అనడం మంచిది కాదు అని పోచమ్మ అంటుంది. ఇంతలో పని వాడు వచ్చి గుడిలో ఊడ్చుతుంటే పట్టీ దొరికిందని చెప్తాడు. లక్ష్మీ ఆ పట్టీ నాదే అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీనే దొంగతనం చేసిందని వీర్రాజు వాళ్లు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.