Gruhalakshmi Serial November 18th Episode :  తులసి తల్లి సరస్వతి చనిపోయిన విషయం ఇంకా తులసికి తెలీదు. ఇక అందరూ తర్వాత కార్యక్రమం చేద్దామని దీపక్ వాళ్లతో చెప్తారు. ఇంత వరకు తులసి వాళ్లు రాలేదని అనసూయ ఏడుస్తుంది. తులసి లేకుండా కార్యక్రమం ఎలా చేస్తాం అని శ్రావణి ఏడుస్తుంది. అయితే బాడీని ఇంట్లో ఎక్కువ సేపు ఉంచకూడదు అని కొందరు అంటారు. తీసుకెళ్లే ఏర్పాట్లు చేద్దాం అని అదృష్టం ఉంటే తులసికి చివరి చూపు దక్కుతుందని లేదంటే లేదు అని అంటారు. 


అనసూయ: అయ్యో మా తులసికి చివరి చూపు చూసే అదృష్టం ఉందో లేదో 


శ్రావణి: ఇంతలో దివ్య వస్తుంది. అత్తయ్య లేవండి అత్తయ్య దివ్య వచ్చింది చూడండి అత్తయ్య 


దివ్య: అమ్మమ్మ లే అమ్మమ్మ ఒకసారి మాట్లాడు అమ్మమ్మ 


పనిమనిషి: అయ్యో తులసమ్మ గారికి ఈ విషయం ఎలా చెప్పాలి. తెలిస్తే అమ్మగారి గుండె పగిలిపోతుంది. అమ్మగారు విని ఈ విషయం తట్టుకోగలరా.


(ఇంతలో తులసి, నందూ వస్తారు) అమ్మా తులసమ్మా ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదమ్మ. మీ అమ్మగారు దేవుడి దగ్గరకు వెళ్లిపోయారమ్మ. తులసి షాక్‌తో కళ్లు తిరిగి పడిపోతుంది. 


తులసి: (వెక్కి వెక్కి ఏడుస్తుంది.) ఎప్పుడు జరిగింది. మరి నాకు ఎందుకు చెప్పలేదు.


నందూ: మనసులో.. నీకు వాళ్లు కాల్ చేసింది ఇందుకేనేమో ఎంత పెద్ద తప్పు చేశాను ఛా..


పనిమనిషి: అమ్మా తొందరగా వెళ్లండి అమ్మ కనీసం చివరి చూపు అయినా దక్కుతుంది 


పరందామయ్య: దీపక్ మరో ఐదు నిమిషాలు చూద్దాం


దీపక్: ఏడుస్తూ.. అక్క గురించి ఆలోచించడం అనవసరం. తను మరి రాదు. అక్క మారిపోయింది. మీకు తెలీదు మామయ్య ఇక ఎదురు చూడటం అనవసరం. ఎదురు చూపులు గుండెల్లో బాధ పెంచుతాయి తప్ప లాభం ఉండదు. 


తులసి ఏడుస్తూ.. పరుగు పరుగున వచ్చే సరికి దీపక్ తన తల్లి చితికి నిప్పు పెట్టేస్తాడు. ఇక తులసి గుండె బాధుకొని ఏడుస్తుంది. అందరూ ఆమెను గట్టిగా పట్టుకొని  ఓదార్చుతారు. తులసి తన తమ్ముడిని కొట్టేస్తుంది. 


తులసి: అడ్డం రాకండి మామయ్య.. వీడు చేసింది మామూలు తప్పు కాదు. అమ్మని కడసారి చూడకుండా చేసేశాడు. వీడిని ఎంత పని చేశావురా. ఎందుకురా నా మీద నీకు ఇంత పగ. అమ్మ నీకు ఒక్కడికే అమ్మ కాదురా నాకు అమ్మేరా. నీకంటే ముందు నేను పుట్టాను రా. అమ్మ మీద నీకంటే ఎక్కువ ప్రేమ నాకుందిరా. అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే నాకు కాల్ చేసి చెప్పాలి అన్న ఇంకితజ్ఞానం కూడా లేదా. నేను వచ్చే దాకా అంత్యక్రియలు ఎందుకు ఆపలేదు. నాకు ఇప్పుడు అమ్మ కావాలి. నా అమ్మను నాకు ఇప్పుడు తెచ్చి ఇవ్వు. పాతికేళ్ల నా కాపురం కూలిపోవడం కంటే పెద్ద ఘోరం ఇక జీవితంలో ఉండదు అనుకున్నాను. నేను అనుకున్నది తప్పు అని రుజువు చేశావురా. అంత కంటే పెద్ద ఘోరాన్ని నాకు పరిచయం చేశావురా. ఈ అక్కని మోసం చేశావురా


దీపక్: అక్కా అంత మాట అనొద్దు అక్క


నందూ: తులసి జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధ పడి లాభం ఏముంది చెప్పు గుండె రాయిని చేసుకో. దీపక్ నీ తమ్ముడు


తులసి: కాదు దీపక్ నా తమ్ముడు కాదు. అమ్మతో పాటే మా ఇద్దరి మధ్య బంధం కూడా కాలిపోతుంది. ఇక జీవితంలో వీడి మొఖం చూడను. ఇక వీడు జీవితంలో మన గడప తొక్కడానికి వీలులేదు. ఆ మాట వాడికి చెప్పండి.


దీపక్: ఎందుకు అక్క ఇంత పెద్ద శిక్ష వేశావు. అమ్మ పోయింది నువ్వు కూడా నన్ను దూరం చేస్తే ఎలా అక్క. 


తులసి: అమ్మతో పాటే అక్క కూడా చనిపోయింది అనుకో. నాకు కూడా చితిపెట్టురా రారా. నాకు బతకాలి అని లేదురా. నేను మంచి చెడు అని చెప్పుకునే అమ్మే పోయాక నాకు ఈ ఒంటరి జీవితం వద్దురా. అమ్మతో పాటే నన్ను కూడా పంపే అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. అని తులసి చితి వైపు వెళ్తుంది అందరూ అడ్డుకుంటారు. 


మరోవైపు దివ్య అమ్మమ్మ చనిపోవడంతో దివ్య సింపతిని వాడుకొని విక్రమ్‌కు మరింత దగ్గరవుతుందని విక్రమ్ మేనమామ అత్త మాట్లాడుకుంటారు. ఇక వాళ్ల కూతురు అయితే వాళ్లకి చివాట్లు పెడుతుంది. దివ్యక్క వాళ్ల అమ్మమ్మ చావును అడ్డుపెట్టుకునే అంత చెడ్డది కాదని జాను అంటుంది. మీరు కూడా దివ్యక్క మీద సానుభూతి చూపించండి అని వాళ్ల మీద దగ్గరకు వెళ్లి పలకరించండని చెప్తుంది. దీని మనసు ఏంటి ఇలా మారిపోయింది అని వాళ్లు అనుకుంటారు. జానూని వాళ్ల మాట వినేలా చేసుకోవాలని అనుకుంటారు. ఇక తులసికి దివ్య పాలు తీసుకొని వచ్చి ఇస్తుంది. తాగమని నచ్చచెప్తుంది. ఇక దీపక్ వచ్చి తులసితో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దీపక్‌పై తులసి ఫైర్ అవుతుంది. ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. పరందామయ్య చెప్పినా వినదు. అమ్మ ఆఖరి చూపు దక్కకుండా చేశాడని వాడిని క్షమించే ప్రసక్తే లేదని సీరియస్ అవుతుంది. దీపక్ నిజం చెప్పాలి అని చూసినా తులసి వినదు. ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.