Illu Illalu Pillalu Serial Today Episode కల్యాణ్ రూపంలో ప్రేమకి పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ సమస్య ధీరజ్‌కి తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేని ధీరజ్ పరిష్కరిస్తాడు అనుకున్న ప్రేమకి నిరాశే మిగిలింది. ధీరజ్‌కి కల్యాణ్ తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పాలనుకున్న ప్రేమకి ధీరజ్ తన మాటలతో మనసు విరిచేస్తాడు.
ప్రేమ ఏడుస్తూ ఉన్న ఒకే ఒక ఆశ పోయింది ఇక నా బాధ ఎవరితో చెప్పుకోవాలిరా అని ప్రేమ చాలా ఏడుస్తుంది. ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమ పక్కనే కూర్చొని ప్రేమకు సారీ చెప్తాడు. మీ అన్నయ్య మీద కోపంతో నువ్వు చెప్పాలి అనుకున్నది కూడా వినకుండా అరిచేశాను అని అంటాడు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది కానీ బాధని కంట్రోల్ చేసుకోలేకపోయాను. సరే ఏదో చెప్పాలి అనుకున్నావ్ ఏంటి అది అని అడుగుతాడు. ప్రేమ ఏడుస్తూ వెళ్లిపోతుంది.
ధీరజ్ ప్రేమ పక్కనే నిల్చొని చూడు ప్రేమ ‘నీలో నువ్వే నలిగిపోతున్నావ్.. నరకం చూస్తున్నావ్.. నిన్ను ఇలా చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఎంత బాధగా ఉందో తెలుసా.. ఏమైందో చెప్పు ప్రేమా అని అడుగుతాడు. ప్రేమ మనసులో నాకు తెలుసురా.. నేను బాధపడితే నువ్వు చూడలేవ్ అనీ.. నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరని. నీ కన్నీళ్లు చూసి ఆ కళ్యాణ్ గాడు నన్ను ఏడిపిస్తున్న విషయం నీకు చెప్పాలని ఉంది. వాడు మోసం చేసి వెళ్లిపోవడం వల్లే నువ్వు నా మెడలో తాళిని కట్టావ్ అన్న భావనలో ఉన్నావ్. అలాంటి భావనలో ఉన్న నీకు కళ్యాణ్ గురించి ఎలా చెప్పగలనురా అని అనుకుంటుంది. ధీరజ్ ప్రేమకు సైలెంట్‌గా ఉండొద్దు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు.
ప్రేమ ధీరజ్‌తో రేయ్ నిన్ను ఒక్కమాట అడుగుతాను నిజం చెప్పురా.. నేను నీ లైఫ్‌లోకి రాకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండేవాడివి కదా.. కళ్యాణ్ గాడు నన్ను మోసం చేశాడనే జాలితోనే నువ్వు నా మెడలో తాళి కట్టావ్. అంతకుమించి నీ మనసులో ఏం ఫీలింగ్ లేదు కదా అని అడుగుతుంది. ప్రేమ ప్రశ్నకు ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు. దాంతో ప్రేమ.. మనసులో చూశావారా మాట వరసకి కూడా నువ్వు కాదని చెప్పడం లేదు.. మరి నా మనసులోని బాధ నీకు ఎలా చెప్పగలను.. నీ మీద నాకు ఏహక్కు ఉందని చెప్పుకోగలను అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ధీరజ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు.
నర్మద ఏడుస్తూ ఉంటుంది. సాగర్ వెళ్లి నేను ఒక మాట మీద ఉండను అని నీకు భయం ఉంది. కానీ అదంతా గతం ఇప్పుడు నేను అలా లేను మామయ్యగారికి ఇచ్చిన మాట ప్రకారం గవర్నమెంట్ జాబ్ కొడతా అని అంటాడు. దానికి నర్మద రైస్ మిల్లు వారసత్వాన్ని నువ్వే కొనసాగిస్తావని మీ నాన్న చాలా నమ్మకంతో ఉన్నారు. దాన్ని నువ్వు వదిలేస్తే మీ నాన్న తట్టుకోలేరు. నువ్వు రైస్ మిల్లు నుంచి బయటకు వచ్చి జాబ్ చేస్తావంటే అందుకు ఒప్పుకోరు.. నువ్వు మీ నాన్న మాటే వింటావ్ తప్ప.. నా వైపు నిలబడవు ఏదో ఒక పరిస్థితిలో నీకు మా నాన్న నేనా అనే సందర్భం వస్తుంది. ఇద్దరినీ నువ్వు హర్ట్ చేయకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేవు. ఎవరో ఒకరు బాధ పడాలి అందుకే నేనే తగ్గిపోవాలి నా సంతోషం త్యాగం చేయాలి అనుకుంటున్నా అని అంటుంది. దానికి సాగర్ నాకు అలాంటి పరిస్థితి వస్తే నీ కోసం మానాన్నకి కూడా ఎదురు తిరుగుతా అని అంటాడు. నాకు నీ సంతోషం తప్ప ఇంకేం అవసరం లేదని అంటాడు. నర్మద సంతోషంతో భర్తని వాటేసుకుంటుంది.
రామరాజు హాల్లో కూర్చొని లెక్కలేసుకుంటుండగా.. చెంబులో చేయితో తిరుపతి ఎంట్రీ ఇస్తాడు. నన్ను ఎవరూ పట్టంచుకోవడం లేదని అంటాడు. వేదవతి వచ్చి ఇక్కడ నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు వెళ్లిపోరా మీ ఇంటికి అంటుంది. దానికి తిరుపతి నీ కంటే బావే బెటర్ బావ ఏదో ఒకటి చేయ్ అంటాడు. దానికి రామరాజు రేయ్ చేయి అందులో పెట్టి ఉండకపోతే.. వెళ్లి కట్ చేయించుకోవచ్చు కదా అని అంటాడు. చెంబుని కట్ చేస్తే నా జీవితమే కట్ అయిపోతుంది. కట్ చేసి తీస్తే నాకు జీవితంలో పెళ్లి కాదు అని తిరుపతి అంటాడు. ఆ మాటతో రామరాజు రేయ్.. ఏ తలకమాసిన వాడు చెప్పాడ్రా నీకు మాటా అని అంటాడు. ఆ తలకమాసిన వాడ్ని నేనే అని ఎంట్రీ ఇస్తాడు వల్లీ తండ్రి ఇడ్లీ బాబాయ్.
వేదవతి ఆయనతో మీరేంటి అన్నయ్య గారు ఈ టైంలో వచ్చారు అంటే చూసిపోదాం అని వచ్చానని అంటాడు. ఏంటి నన్నేనా అని తిరుపతి అంటే కాదు చెంబుని చూడటానికి వచ్చానని అంటాడు. దానికి తిరుపతి నా కూతుర్ని చూడాలని వచ్చానని అంటాడు. ఇక వల్లి వచ్చి తండ్రితో మాట్లాడాలి అని గదిలోకి తీసుకెళ్తుంది. ఇడ్లీబాబాయ్‌తో నువ్వు వచ్చావ్ అంటే భయంగా ఉంది ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది. ఏం టెన్షన్ పెట్టడానికి వచ్చావ్ మళ్లీ నా జీవితం ఎలా నాశనం చేస్తావో అ ని భయంగా ఉందని వల్లి అంటుంది. దానికి ఇడ్లీబాబయ్ మరో ప్లాన్‌తో వచ్చానని అంటాడు. వల్లీ చాలా భయపడుతుంది. తిరుపతి చేతి చెంబు అంతు చూడాలని వచ్చానని అంటాడు. నువ్వేం చేయకు వెళ్లిపో నాన్న అని వల్లి అంటే వెళ్లిపోవడానికి రాలేదు ఉండిపోవడానికి వచ్చానని అంటాడు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.