Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు ప్రతీ సారి వల్లి పుట్టింటి భాగోతం చెప్పాలని రామరాజు దగ్గరకు వెళ్లడం ఏదో ఒక కారణంతో అది కాస్తా ఆగిపోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా వల్లీ కన్నవారి బస్తీ గురించి రామరాజుకి చెప్పే టైంకి రైసు మిల్లులో దొంగలు పడ్డారని వార్తతో నర్మద, ప్రేమలు చెప్పాలనుకున్న బస్తీ మేటర్‌కి అడ్డుకట్ట పడింది. 

రామరాజు ఫ్యామిలీ మొత్తం మిల్లుకి పరుగులు పెడతారు. ఎప్పుడూ లేదని ఇలా జరిగింది ఏంటి అని రామరాజు సింహాద్రిని అడుగుతాడు. దాంతో సింహాద్రి మీరు లాకర్‌ పెట్టిన 5 లక్షలు పోయావని చెప్తాడు. రామరాజు అక్కడున్న కూలీలతో మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండ్రా నేను ఇస్తానని అంటాడు. అక్కడ పని చేసే ఎవరూ మాకు తెలీదని అంటారు. ధీరజ్‌ తండ్రితో అందరూ ఇక్కడే ఉన్నారు. బయట నుంచి వచ్చి ఎవరూ దొంగతనం చేయలేదు అంటే డబ్బు ఇక్కడే ఎక్కడో ఉంటుందని అంటాడు. దానికి రామరాజు నాకు కావాల్సింది డబ్బు కాదురా దొంగతనం ఎవరు చేశారో తెలియాలి అని అంటాడు. 

నర్మద మొత్తం పరిశీలించి మిల్లులోని బస్తాల్లో ఒక బస్తా కుట్టినట్లు ఉండటం చూసి అక్కడకు వెళ్తుంది. అక్కడ బస్తా కుట్టడానికి వాడిన పెద్ద సూది బస్తాకి రక్తం అంటుకోవడం చూసి పని వాళ్లు అందర్నీ పరిశీలనగా చూస్తుంది. సింహాద్రి చేతికి రక్తం రావడం చూసి ఆయన దగ్గరకు వెళ్తుంది. దొంగతనం జరిగిన తర్వాత ముందుగా తెలిసింది మీకే కదా.. దొంగతనం జరిగిన తర్వాత అందరూ ఇక్కడే ఉన్నారు కదా.. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా.. అని అంటుంది. ఆయన అక్కడున్న వాళ్ల మీద అనుమానంగా ఉంది అంటే నాకు మీ మీద అనుమానంగా ఉందని నర్మద చెప్తుంది. నేను కాదు నాకేం తెలీదమ్మా అని సింహాద్రి వణికిపోతూ చెప్తాడు.

నర్మద ఆయనతో ఎందుకు భయపడుతున్నారు.. ఎందుకు చెమటలు పడుతున్నాయి..అని అడిగి రామరాజుతో మిల్లులో దొంగతనం చేసింది సింహాద్రినే అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. అంత కచ్చితంగా ఎలా చెప్తావని వేదవతి నర్మదని అడిగితే అతని చేయికి తగిలిన గాయం చూపిస్తుంది. సింహాద్రే దొంగతనం చేశాడు.. ఆడబ్బు బియ్యం సంచిలో దాయాలని చూశాడు.. ఎవరైనా చూస్తారనే కంగారులో కుడుతూ ఉంటే చేతికి దబ్బనం గుచ్చుకుందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నర్మద అలా చెప్పి బియ్యం బస్తాలో వెతకమని చెప్తుంది. 

సాగర్, చందు, ధీరజ్‌లు వెళ్లి వెతికితే అందులో డబ్బు కనిపిస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. వేదవతి సింహాద్రిని తిడుతుంది. అందరూ ఆయన్ని ఛీ కొడతారు. రామరాజు సింహాద్రి దగ్గరకు వెళ్లి మిల్లు స్టార్టింగ్ దగ్గర నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావ్ కదరా. నిన్ను నా ఇంటి మనిషిలా చూసుకున్నా నన్ను మోసం చేయాలి అని ఎలా అనిపించింది అని కుప్పకూలిపోతాడు. అందరూ రామరాజు చుట్టూ చేరుతారు. రామరాజు గుండె పట్టుకొని వాడు అడిగితే 10 లక్షలు అయినా ఇచ్చేవాడిని.. నర్మద నువ్వు ఈ దొంగతనం నిరూపించకపోయి ఉన్నా బాగుండేది ఎవరో తీసుకున్నారని అనుకునేవాడిని కానీ నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడు అని జీవితాంతం మోయాలి అని ఏడుస్తాడు. ఒక మనిషిని పొడిచి చంపినా కూడా ఇంత బాధ ఉండదు అని ఏడుస్తాడు. ముగ్గురు అన్నాదమ్ముళ్లు మీటింగ్ పెడతారు. చందు వాళ్లతో నమ్మిన  వాడు అలా చేస్తేనే తట్టుకోలేకపోయాడు నాన్న మనం ఏమైనా మోసం చేస్తే నాన్న మనసు బద్ధలైపోతుందిరా.. ఇక నుంచి మనం ముగ్గురం నాన్నకి బాధ కలిగేలా ప్రవర్తించొద్దని అంటాడు. 

చందు మాటలకు ధీరజ్ ప్రేమని ఎలా పెళ్లి చేసుకున్నానో అన్న విషయం దాచాను.. ఈ విషయం తెలిస్తే నాన్న ఇంకా బాధ పడతారు. అందుకే ఎప్పటికీ ఈ విషయం నాలోనే ఉండిపోవాలి అనుకుంటాడు. ఇక సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలి అనుకున్న విషయం నాన్నకి తెలీకూడదు అనుకుంటాడు. చందు అయితే పది లక్షల విషయం తెలీకూడదు అనుకుంటాడు. 

మరోవైపు వల్లి పుట్టింటికి పరుగులు పెడుతుంది. నర్మద, ప్రేమలకు మొత్తం తెలిసిపోయింది.. నేను వాళ్లని ఎంతలా ఆపాలి అనుకున్నా ఆపలేకపోయాను.. నా జీవితం మొత్తం అయిపోయింది. నాకు చావు తప్ప మరో దారి లేదు.. ఈ పరిస్థితి నువ్వే నాకు తీసుకొచ్చావ్ అని వల్లి ఏడుస్తుంది. చాలా మంచి భర్త, మంచి అత్తామామలు గొప్ప కుటుంబానికి కోడలు అయ్యానని చాలా సంబర పడ్డాను.. అబద్ధం చెప్పకుండా మనం పేదవాళ్లం అని ముందే చెప్పేసి ఉంటే నేను నా అత్తారింట్లో సంతోషంగా ఉండేదాన్ని మొత్తం నాశనం చేశారని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.