గుండెనిండా గుడిగంటలు జూలై 30 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu July 30th Episode)
మీనా పూలకొట్టును మున్సిపల్ డిపార్ట్ మెంట్ వాళ్లు తొలగించడంతో బాలు బాధపడతాడు. ఇది ఎవరు చేశారో తెలిస్తే వాళ్లను మాత్రం వదిలిపెట్టను అంటాడు బాలు. నేనుకూడా సపోర్ట్ చేస్తానంటుంది కామాక్షి. ఆ తర్వాత మీనా బాధను చూడలేక ఓదార్చుతాడు బాలు. చిన్నప్పుడే అమ్మవదిలేసింది, నానమ్మ దగ్గర పెరిగాను. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తానా అనుకున్నా..ఎన్నో ఇబ్బందులుపడ్డా..ఇక్కడివరకూ రాగలిగాను కానీ అమ్మ ప్రేమ పొందలేకపోయాను. సముద్రంలో ఎగసిపడే అలలే మనకు ఆదర్శం..పడిపోతాయని కానీ అలానే ఉండిపోవు మళ్లీ అంతెత్తుకి లేస్తాయి. మన జీవితం కూడా అంతే అని చిన్న క్లాస్ వేయడంతో మీనా నార్మల్ అవుతుంది.
ఉదయం మీనా ఆలస్యంగా నిద్రలేవడంతో కాఫీ కోసం ఇంట్లో చిందులు తొక్కుతుంటుంది ప్రభావతి. మనోజ్, రోహిణి కూడా వచ్చి తమకు కూడా కాఫీ ఇవ్వలేదనిఅంటారు. పనీ పాటా లేదుకదా, పూలకొట్టు కూడా లేదుకదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఉదయాన్నే లేవలేకపోయాను ఒక్కరోజు లేవలేకపోతే ఎందుకంతలా మాట్లాడుతున్నారని అంటుంది. మీ పుట్టింటినుంచి తెచ్చిపెడుతున్నావా అంటే.. మీ పుట్టింటినుంచి కూడా రావడం లేదని సటైర్స్ వేస్తుంది. కోడలికి పని చెప్తే ఇంత తప్పా అని ప్రభావతి అనగానే... రోహిణి కూడా ఉంది కదా కాపీ పెట్టొచ్చు కదా అంటుంది మీనా. ఇంతలో బాలు వచ్చి ఇకపై నా భార్య పనిచేయదు...ఇంట్లోకి డబ్బులిస్తున్నా పని మనిషిని పెట్టండి అంటాడు. ఇకపై ఎవరి పని వాళ్లే చేసుకోవాలని చెప్తాడు. ఇక నీ దండకం ఆపు మేం వెళ్లి బయటకాఫీ తాగుతాం అని రోహిణి మనోజ్ ని తీసుకుని వెళ్లిపోతుంది
స్నేహితులను కలసి జరిగినదంతా చెప్పిన బాలు..మీనా కష్టపడినా ప్రతిఫలం దక్కడం లేదని బాధపడతాడు. తనని ఇంట్లో పనిమనిషిలా చూస్తున్నారు..ఏదో ఒకటి చేసి తన గౌరవాన్ని నిలబెట్టాలి అనుకుంటాడు. ఇంతలో స్నేహితుడు ఫోన్లో మాట్లాడుతూ అన్నీ ఆన్ లైన్లో అలవాటు పడ్డావ్..సరకులు లేటైతే ఏమైంది వెళ్లి తెచ్చుకోవచ్చు కదా అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడే బాలుకి ఓ ఆలోచన వస్తుంది. పూల వ్యాపారం కూడా ఆన్ లైన్లో చేస్తే ఎలా ఉంటుందనే ప్రపొజల్ పెడతాడు. స్నేహితులు కూడా ఇదే బెస్ట్ ఐడియా అంటారు. వెంటనే బండి కొనేందుకు ప్లాన్ చేసుకుని షోరూమ్ కి వెళతాడు. నీకు ఏ కలర్ ఇష్టం అని మీనాకు కాల్ చేస్తే పూలరంగులన్నీ పెద్ద లిస్ట్ చెబుతుంది. ఇక ఆపేయ్ పూలగంప అని ఓ బండి సెలెక్ట్ చేస్తాడు బాలు.
డబ్బులు ఇంకా అవసరం కావడంతో ఆలోచనలో పడతాడు. నేను ఇస్తాను తీసుకో అని స్నేహితుడు అన్నప్పటికీ ఇంకా అవసరం అవుతాయి, ఈఎమ్ఐ కి తీసుకుంటే సమస్య అవుతుందంటాడు. ఇంతలో ఓ పెద్దాయన వచ్చి నా ఇంట్లో రౌడీలు ఉన్నారు ఇల్లు ఖాళీ చేయడం లేదు వాళ్లను వెళ్లగొడితే ఈ పదివేలు ఇస్తాను...నా కూతురికి పెళ్లిచేసేందుకు ఆ ఇల్లు అమ్మాలని బతిమలాడుతాడు. ససేమిరా అన్న బాలు.. కూతురి పెళ్లికోసం తండ్రిపడే ఆవేదన చూసి సరే అని వెళతాడు. రౌడీలను బాగా చితక్కొట్టి ఇల్లు ఖాళీ చేయిస్తాడు.