దివ్య బెడ్ మీద పడుకుని విక్రమ్ సంకలో దూరుతుంది. చెయ్యి వేస్తే ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. దివ్య నిద్రపోతున్నట్టు నటిస్తుంది. కాసేపటికి కాలు వేస్తుంది. తనని నిద్రలేపి మీద కాలు వేయొద్దని అంటాడు. తులసి లక్కీకి తినిపిస్తూ ఉండగా నందు వస్తాడు. డాడీ ఎందుకు అంత గట్టిగా తోశారని అడుగుతుంది.


లక్కీ: తప్పు నాదే ఆంటీ. డాడీ ఫోన్లో కోపంగా మాట్లాడుతుంటే అది పట్టించుకోకుండా ఆడుకోవడానికి రమ్మని గొడవ చేశాను. చెయ్యి పట్టుకుని లాగాను. అందుకే తోసేశారు


తులసి: అంత మాత్రానీకే తోసేయాలా గట్టిగా దెబ్బ తగిలేలా చేయాలా?


నందు అదంతా చూస్తూ ఈ లక్కీ ఉన్నంత వరకు తులసితో మొట్టికాయలు తప్పవని అనుకుంటాడు. అప్పుడే ముసలోళ్ళు ఇద్దరూ వచ్చి కొడుకుని పక్కకి తీసుకెళ్తారు. ఇద్దరూ కాసేపు కొడుక్కి బ్రెయిన్ వాష్ చేస్తారు. అన్నీ మర్చిపోయి తులసికి దగ్గర అయ్యేందుకు ట్రై చేయమని సలహా ఇస్తారు. తను కూడా అదే ప్రయత్నం చేస్తున్నానని కానీ లక్కీ అడ్డుపడుతున్నాడని వాపోతాడు. ఇక తులసి హాస్పిటల్ క్యాంటీన్ లో తమ టిఫిన్స్ నచ్చుతున్నాయా లేదా అని అడుగుతుంది. మనసు పెట్టి చేస్తున్నారు చాలా బాగుంటున్నాయని ఒకామే చెప్తుంది. అప్పుడే ఒక నర్స్ వచ్చి తులసితో మాట్లాడాలని చెప్పి పక్కకి తీసుకెళ్తుంది.


Also Read: గుండెల్ని పిండేసే ఎమోషనల్ సీన్ - కనికరించని రాజ్, కన్నీళ్ళతో అత్తింటిని వదిలిన కావ్య


నర్స్: మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఎవరికి ఏ సమస్య వచ్చినా సలహా ఇచ్చి బయటపడే మార్గం చూపిస్తున్నారు. ఇప్పుడు మీ అవసరం నాకు వచ్చింది. నా కూతురికి హార్ట్ ప్రాబ్లం.. ఆపరేషన్ చేయాలని అన్నారు


తులసి: ఇది మంచి హాస్పిటల్ ఇక్కడే చేర్పించి ట్రీట్మెంట్ చేయించు


నర్స్: చేర్పించాలని నాకు ఉంది కానీ లక్షల్లో ఫీజు అడుగుతున్నారు


తులసి: అదేంటి నువ్వు ఇక్కడ పని చేసే నర్స్ వి నిన్ను లక్షల్లో ఫీజు అడగటం ఏంటి? సంజయ్ తో మాట్లాడావా?


నర్స్: మాట్లాడాను


లక్షల్లో అవుతుంది. వెంటనే ఆపరేషన్ చేయండని సంజయ్ అంటాడు. అంత ఖర్చు తాను పెట్టుకోలేనని అంటుంది. ఐదు లక్షలు పెట్టుకోలేనని యాభై వేలుకి మించి పెట్టుకోలేనని చెప్తుంది. కానీ సంజయ్ మాత్రం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించమని నోటికొచ్చినట్టు తిడతాడు. అది తెలుసుకుని తులసి షాక్ అవుతుంది. నందు వచ్చి ఇక్కడ మనం బయట వాళ్ళం మనకి అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోవడం ఎందుకని అంటాడు. కానీ తులసి మాత్రం దివ్యతో మాట్లాడి చూద్దామని అంటుంది.


దివ్య రాగానే ఇక్కడ పని చేసే నర్స్ కూతురికి హార్ట్ ప్రాబ్లం, సంజయ్ ఐదు లక్షలు కట్టమని అడుగుతున్నాడు. సాయం చేయగలమా అని అడుగుతుంది.


దివ్య: సాయం చేయాలని నాకు ఉంది. కానీ అత్తయ్యకి తెలిస్తే


తులసి: ముక్కుసూటిగా వెళ్తే పని జరగదు. వేరే దారిలో వెళ్ళాలి


నందు: అత్తని కాదని ఎలా ముందుకు వెళ్తుంది


Also Read: కృష్ణ దగ్గరకి చేరిన మురారీ- అన్నింటికీ తెగించేసిన ముకుంద


తులసి: లక్కీని ఇంటికి తీసుకురావాలని అనుకున్నారు తీసుకొచ్చారు. ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఆ నర్స్ కి సాయం చేయడానికి ఒక ఐడియా చెప్తాను విను అని ఏదో చెప్తుంది. అది మ్యూజిక్ వేసి వినిపించకుండా చేస్తారు. ఐడియా సూపర్ గా ఉందని దివ్య అంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా విక్రమ్ దూరమవుతాడాని జాగ్రత్తగా ఉండమని నందు హెచ్చరిస్తాడు.


ప్రకాశం దగ్గరకి తోడి కోడళ్ళు వస్తారు. అతనికి ట్రీట్మెంట్ ఇస్తారు. దివ్య డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. మన స్టాఫ్ నర్స్ కూతురికి ఆపరేషన్ చేయాలంట ఐదు లక్షలు తీసుకురమ్మని సంజయ్ చెప్పాడని చెప్తుంది. అత్తయ్య బాగుపడితే సంజయ్ కూడా బాగుపడతాడని అంటుంది.


ప్రియ: అత్తయ్య గురించి బావకి తెలిసేది ఎలా? ఎన్నాళ్ళు బావకి దూరంగా ఉంటావ్


దివ్య: కొన్ని కేసులకి సర్జరీ చేయాలి. ఆమెకి చావు భయం చూపించాలి. అమ్మకి ఏమైనా అయితే విక్రమ్ భయపడతాడు. కదా. అత్తయ్య రేపు మార్నింగ్ వాకింగ్ కి వచ్చినప్పుడు తనకి పక్కగా పూల కుండీ వేయాలి. అది నువ్వే చేయాలి ప్రియ


ప్రకాశం: ఈ ప్లాన్ దేనికి


దివ్య: అత్తయ్యని, సంజయ్ ని హాస్పిటల్ కి దూరం చేయాలి. హాస్పిటల్ బాధ్యతలు విక్రమ్ కి అప్పగించాలి


రేపటి ఎపిసోడ్లో..


అనుకున్నట్టుగానే రాజ్యలక్ష్మికి కాస్త దూరంగా ప్రియ పూల కుండీ వేస్తుంది. దీంతో విక్రమ్ తల్లికి ఏమైందా అని కంగారుపడతాడు. జాతకంలో ఏవైనా దోషాలు ఉంటేనే ఇలా జరుగుతూ ఉంటాయని దివ్య మరింత భయపెడుతుంది. పూజారి వచ్చి మంగళ దోషం మొదలైందని పరిహారం ఆమె కొడుకు సంజయ్ చేయాలని చెప్తాడు. దీంతో సంజయ్ షాక్ అవుతాడు.