త్రిష కృష్ణన్ నటించిన తాజా సినిమా ‘రాంగి’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో త్రిష బిజీగా ఉంది. ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు వ్యాఖ్యలపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె చాలా ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. తమిళనాడులో విజయ్, అజిత్లో ఎవరు నెంబర్ వన్ స్టార్ అనే ప్రశ్నకు బదులిస్తూ.. “ఇద్దరూ చాలా అనుభవం కలిగిన నటులు. ఇద్దరికీ స్టార్ స్టేటస్ ఉంది. వీరిలో ఎవరో నెంబర్ వన్ అనేది చెప్పడం కష్టం” అని చెప్పింది.
‘‘నాకు వ్యక్తిగతంగా నంబర్ గేమ్స్ పై నమ్మకం లేదు. మనం నటించిన చివరి సినిమా మంచి విజయం అందుకుంటే నంబర్ వన్ గా ఉంటాం. లేదంటే ఆస్థానంలో మరొకరు వస్తారు. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే వారిద్దరు స్టార్ స్టేటస్ ను అందుకున్నారు. వారి సినిమాలను ప్రేక్షకులుగా చూస్తాం. వారి ఫ్యాన్స్ క్లబ్బులు ఈ నెంబర్ గేమ్ ను మొదలు పెట్టాయి. ఇద్దరూ పెద్ద స్టార్లు అయినప్పుడు ఎవరో ఒకరిని ఎంచుకోవడం కష్టం”’’ అని తెలిపింది.
విజయ్ నటించిన ‘వరిసు’, అజిత్ నటించిన ‘తునివు’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్టబోతున్నాయి. సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు నిలువనున్నాయి. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు, విజయ్, అజిత్ కంటే పెద్ద స్టార్ గా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలపై అజిత్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
15 ఏళ్ల తర్వాత విజయ్ తో సినిమా!
అటు త్రిష సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదని తెలుస్తోంది. తాజాగా త్రిష నటించిన ‘రంగి’ సినిమా డిసెంబర్ 30న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో తను జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్రిష చివరిగా మణిరత్నం తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్ 1’లో కనిపించింది, ఇందులో ఆమె కుంధవి పాత్రను పోషించింది. చక్కటి అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంది.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన 20 ఏళ్లు పూర్తి
త్రిష ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002లో, తమిళ రొమాంటిక్ డ్రామా ‘మౌనం పెసియాదే’ సినిమాలో సూర్య సరసన నటించింది. అన్ని దక్షిణాది భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించింది. కొన్ని హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేసింది.
Read Also: రెమ్యునరేషన్ లేకుండా ‘వరిసు‘ కోసం పనిచేసిన శింబు, వీళ్లు కూడా నయా పైసా తీసుకోలేదు తెలుసా?