Tollywood Producers vs Single Screen Exhibitors: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు ఒక వింతైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వెండితెరపై ధ్రిల్లర్ సినిమాలను రక్తికట్టించే ఇండస్ట్రీ వర్గాలు, ఇప్పుడు నిజజీవితంలో ఒక బిజినెస్ సస్పెన్స్ డ్రామా ను నడుపుతున్నాయి. గత కొద్ది రోజులుగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదం ఇప్పుడు బహిరంగ యుద్ధానికి దారితీసింది. థియేటర్ల నిర్వహణ భారం పెరిగిపోతోందని, మల్టిప్లెక్స్‌ల తరహాలోనే తమకు కూడా  పర్సంటేజ్ షేరింగ్  విధానం కావాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుండగా.. భారీ బడ్జెట్ సినిమాల రిస్క్ అంతా తమదేనని, పాత రెంటల్ విధానమే ముద్దని నిర్మాతలు తెగేసి చెబుతున్నారు. ఈ మాటల మంటలు టాలీవుడ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Continues below advertisement

 రెండు వర్గాలుగా చీలిన టాలీవుడ్ 

ఈ వివాదం టాలీవుడ్ అగ్ర నిర్మాతలను రెండు వర్గాలుగా విడగొట్టింది. ఒకవైపు సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు వంటి వారు ఎగ్జిబిటర్ల పక్షాన నిలబడి పర్సెంటేజ్  విధానం కోసం పోరాడుతుండగా.. మరోవైపు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున నాగవంశీ, మైత్రీ  రవిశంకర్  , సాహు గారపాటి వంటి వారు రెంటల్ విధానానికే మొగ్గు చూపుతున్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యను ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకునే స్థాయికి తీసుకెళ్లడం ఇండస్ట్రీ పరువును బజారున పడేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పర్సంటేజ్ సిస్టమ్ మన దగ్గర ఎందుకు కుదరదు అనేది ఎగ్జిబిటర్ల ప్రధాన ప్రశ్న.

Continues below advertisement

పెద్ద దిక్కు లేని లోటు

టాలీవుడ్‌లో ఒకప్పుడు దాసరి నారాయణరావు వంటి వారు ఉంటే ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించేవారు. ఇప్పుడు అటువంటి బలమైన  పంచాయితీ పెద్ద ఎవరూ లేకపోవడం ఈ వివాదం ముదరడానికి ప్రధాన కారణం. మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నప్పటికీ, ఆయన మాత్రం మౌన ముద్ర  వీడటం లేదు. గతంలో కొన్ని వివాదాల్లో తలదూర్చి పరిష్కారం చూపినా, చివరికి ఎవరో ఒకరు తనను బ్లేమ్ చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. అందుకే, నాకెందుకు వచ్చిన గొడవ  అన్నట్లుగా ఆయన సైలెంట్‌గా ఉంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడంలో ఫిలిం చాంబర్ కూడా ఆశించిన స్థాయిలో సఫలం కావడం లేదు.

 ఓటీటీ భయం.. కలెక్షన్ల కంగారు 

ఓ వైపు ఓటీటీల దూకుడు, మరోవైపు టికెట్ ధరల పెరుగుదల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు. సినిమా బాగున్నా సరే, మొదటి మూడు రోజులు దాటాక కలెక్షన్లు డ్రాప్ అవుతుండటంతో అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకు ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో రామ్ చరణ్ నటిస్తున్న  పెద్ది  విడుదలకు సిద్ధమవుతోంది.  సింగిల్ స్క్రీన్ సమస్య గనుక తేలకపోతే ఈ సినిమాల ఓపెనింగ్స్ మీద దెబ్బ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఎగ్జిబిటర్లు పట్టువీడకపోతే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది.

 పరిష్కారం ఎక్కడ? 

నిజానికి ఈ సమస్యలో రెండు వర్గాల వాదనలోనూ కొంత న్యాయం ఉంది. మల్టిప్లెక్స్‌లకు లేని నిబంధనలు తమకెందుకు అని సింగిల్ స్క్రీన్ యజమానులు అడుగుతుంటే.. మెయింటెనెన్స్ సరిగ్గా లేని థియేటర్లకు షేరింగ్ ఎలా ఇస్తామని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. థియేటర్ల గ్రేడింగ్, ఆన్‌లైన్ టికెటింగ్ వంటి అంశాలను జోడించి ఒక  మిడిల్ గ్రౌండ్  కనిపెడితే తప్ప ఈ వివాదం సద్దుమణగదు. ఇండస్ట్రీ క్షేమం కోరే పెద్దలు ఇప్పటికైనా పట్టువిడుపులకు లోనై, ముఖాముఖి చర్చలకు కూర్చోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకు  సింగిల్ స్క్రీన్ లు కేవలం చరిత్రగానే మిగిలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన ప్రారంభమయింది.