T Series- Mythri Movie Makers Partnership: టీ-సిరీస్, మైత్రి మూవీ మేకర్స్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నార్త్ లో టీ-సిరీస్ అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతుండగా, సౌత్ లో మైత్రి మూవీ మేకర్స్ దిగ్గజ ప్రముఖ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కలిశాయి. దేశ వ్యాప్తంగా పాన్ ఇండియన్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
మైత్రితో చేతులు కలిపిన టీ-సిరీస్
దేశ వ్యాప్తంగా ఉన్న నటులు, నిర్మాణ సంస్థలను భాగస్వామ్యం చేస్తూ నార్త్, సౌత్ సినిమా ఇండస్ట్రీల నడుమ దూరాన్ని తగ్గించడంలో టీ-సిరీస్ అధినేత భూషన్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు సౌత్ సినీ నిర్మాణ సంస్థతో కలిసి పని చేసేందుకు రెడీ అయ్యారు. T సిరీస్, మైత్రీ ప్రొడక్షన్స్ కలిసి ఓ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం టీ సిరీస్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్న సినిమాలను మైత్రి ప్రొడక్షన్స్ ద్వారా సౌత్ లో రిలీజ్ చేయనున్నారు. అటు మైత్రి ప్రొడక్షన్స్ కొనుగోలు చేసిన థియేట్రికల్ రైట్స్ మూవీస్ ను నార్త్ లో టీ-సిరీస్ ద్వారా రిలీజ్ చేస్తారు.
‘పుష్ప 2’తో పాన్ ఇండియన్ సినిమాల జాతర షురూ
ఇక ఈ రెండు సంస్థలు కలిపి తొలి చిత్రంగా ‘పుష్ప 2’ను దేశ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాయి. “T సిరీస్, మైత్రీ ప్రొడక్షన్స్ కలిసి పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అసోసియేషన్ గా ఏర్పడ్డాయి. ‘పుష్ప 2’ ఈ అసోసియేషన్ మొదలుకానుంది. భూషణ్ కుమార్ ‘పుష్ప 2: ది రూల్’లో పెట్టుబడి పెట్టారు. ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ కూడా ఆయనే తీసుకున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి ‘పుష్ప 2’ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ, అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. అటు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’, రణబీర్ కపూర్ ‘యానిమల్ పార్క్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను సైతం ఈ రెండు సంస్థలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. ‘భూల్ భూలయ్యా 3’ని దీపావళి కానుకగా టీ-సిరీస్ రిలీజ్ చేస్తోంది” అని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇండియన్ సినిమాను రూల్ చేసే అవకాశం
“తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మార్కెట్ లీడర్‌గా ఉండగా, హిందీ రాష్ట్రాల్లో మార్కెటింగ్ లో టీ-సిరీస్ కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ రెండు సంస్థలు కలవడం ద్వారా దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమను రూల్ చేసే అవకాశం కలుగుతుంది. రెండు సంస్థ కోఆర్డినేషన్ తో సౌత్ టు నార్త్ ఒకేసారి తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Read Also: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే