Kanguva Movie Dubbing : తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సిరుత్తై శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఎక్స్ స్పేస్ సెషన్ నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘కంగువ’ తమిళ వెర్షన్ మినహా, మిగతా అన్ని భాషల్లో AI సాయంతో డబ్బింగ్ చెప్పించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగింది.


తమిళ వెర్షన్ కు సూర్య డబ్బింగ్


‘కంగువ’ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు. డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ‘కంగువ’ సినిమాకు సంబంధించి, తమిళ వెర్షన్ కు హీరో సూర్య డబ్బింగ్ చెప్పనున్నారు. ఇతర భాషల్లో ఆయన క్యారెక్టర్ కు ఏఐ సాయంతో డబ్బింగ్ చెప్పించనున్నట్లు మేకర్స్ తెలిపారు. వాస్తవానికి గత కొంతకాలంగా సినిమాల్లో AIని విస్తృతంగా వినియోగిస్తున్నారు. రీసెంట్ గా ‘వేట్టయాన్’ సినిమాలోనూ AI సాయం తీసుకున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ వాయిస్ అనుకున్నట్లుగా రాకపోవడంతో, AI సాయంతో మరిన్ని మెరుగులు అద్దారు. ఆ తర్వాత బిగ్ బీ వాయిస్  మెరుగయ్యింది. ఇప్పుడు, సూర్యకు తమిళ వెర్షన్ తప్ప, మిగతా అన్ని భాషల్లో AI సాయంతోనే డబ్బింగ్ చెప్పించాలని భావించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ విధానం ఏ మేరకు వర్కౌట్ అవుతుందోనని సినీ టెక్నీషియన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



విదేశీ భాషల్లోనూ ‘కంగువ’ విడుదల


ప్రతిష్టాత్మక ‘కంగువ’ సినిమాను తమిళం, తెలుగు, కన్నడ, హిందీ సహా దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. అటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా వెల్లడించారు. అయితే, ఈ సినిమాను 3D వెర్షన్ లో విడుదల చేయాలా? వద్దా? అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని చెప్పారు.  


నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ‘కంగువ’ విడుదల


‘కంగువ’ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్లకు ప్రేక్షకులకు మంచి ఆదరణ లభించింది. వాస్తవానికి ఈ సినిమాను దసరా కానుకగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. రజనీకాంత్ ‘వేట్టయాన్’ అదే సమయంలో విడుదల కావడంతో మేకర్స్ తమ సినిమాను విడుదలను వాయిదా వేశారు. సూర్య కెరీర్ లో 42వ ప్రాజెక్ట్ తెరకెక్కిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14, 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.



Read Also: ఓటీటీలోకి వచ్చిన 'లెవల్ క్రాస్'... అమలా పాల్ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?